తీవ్రంగా దిగ్ర్భాంతి చెందాం.. గాజాలో 104 మంది మృతిపై భారత్ స్పందన

తీవ్రంగా దిగ్ర్భాంతి చెందాం.. గాజాలో 104 మంది మృతిపై భారత్ స్పందన

న్యూఢిల్లీ: పాలస్తీనాలోని గాజాలో ఇజ్రాయెల్ బలగాలు గురువారం జరిపిన కాల్పుల్లో 104 మంది పౌరులు మృతి చెందిన ఘటనపై తీవ్ర దిగ్ర్భాంతి చెందామని భారత్ తెలిపింది. ఆ ఘటన ఆందోళన కలిగించే పరిణామమని విదేశాంగ శాఖ ఈ మేరకు శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేసింది. గాజా స్ట్రిప్ లో హమాస్, ఇజ్రాయెల్ వెంటనే కాల్పుల విరమణ పాటించాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడింది. 

ఇకపై గాజా స్ట్రిప్ లో ఎలాంటి ప్రాణ, ఆస్తినష్టం జరగకుండా మానవతా సాయం జరిగేలా చూడాలని విదేశాంగ శాఖ మంత్రి ఎస్.జైశంకర్ అన్నారు. అదేసమయంలో టెర్రరిజంను, పౌరులను చంపడాన్ని, బందీలుగా తీసుకోవడాన్ని కూడా తాము తీవ్రంగా ఖండిస్తున్నామని ఆయన స్పష్టం చేశారు. కాగా, గురువారం గాజా సిటీలో మానవతా సాయం కోసం పరుగెత్తుకొచ్చిన వారిపై ఇజ్రాయెల్ బలగాలు కాల్పులు జరపడంతో 104 మంది చనిపోయారు. 

760 మంది గాయపడ్డారు. ఆకలితో అలమటిస్తున్న పాలస్తీనియన్లు ఇజ్రాయెల్ యుద్ధ ట్యాంకులు, ఆర్మీ వెహికల్స్ కు చేరువలో ఉన్న ఎయిడ్ ట్రక్కుల వద్దకు రాగానే అకస్మాత్తుగా కాల్పులు జరిపారని గాజా హెల్త్ మినిస్ట్రీ ఆరోపించింది. అయితే, సాయం కోసం జరిగిన తొక్కిసలాట వల్లే మరణాలు చోటుచేసుకున్నాయని ఇజ్రాయెల్ ఆర్మీ ఒక ప్రకటనలో తెలిపింది.