పాక్ ఫ్లయిట్‎లకు నో ఎంట్రీ: గగనతల నిషేధాన్ని మరోసారి పొడిగించిన భారత్

పాక్ ఫ్లయిట్‎లకు నో ఎంట్రీ: గగనతల నిషేధాన్ని మరోసారి పొడిగించిన భారత్

న్యూఢిల్లీ: పాకిస్థాన్ విమానాలకు గగనతల నిషేధాన్నిమరోసారి పొడిగించింది భారత్. ఈ మేరకు 2025, ఆగస్ట్ 22న నోటమ్ (నోటీసు టు ఎయిర్‌మెన్) జారీ చేసింది. ఈ నోటమ్ ప్రకారం.. 2025, సెప్టెంబర్ 23 వరకు నిషేధం అమల్లో ఉండనుంది. పాకిస్తాన్‌లో రిజిస్టర్డ్ విమానాలు, పాకిస్తాన్ ఎయిర్‌లైన్స్ లేదా ఆపరేటర్లు నడుపుతున్న విమానాలు, పాక్ లీజుకు తీసుకున్న విమానాలతో పాటు పాక్ సైనిక విమానాలకు కూడా ఈ నిషేదం వర్తించనుంది. ఎయిర్ స్పేస్ మూసివేయడం అంటే పాక్ విమానాలు భారత గగనతలం నుంచి ప్రయాణం చేయలేవు. 

భారత్, పాకిస్థాన్ మధ్య పరిస్థితుల వల్ల కేంద్రం ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. దీనిపై కేంద్ర పౌర విమానయాన శాఖ సహాయ మంత్రి మురళీధర్ మొహోల్ మాట్లాడుతూ.. పాకిస్తాన్ పౌర, సైనిక విమానాలు భారత గగనతలంలోకి ప్రవేశించకుండా నిషేధాన్ని 2025, సెప్టెంబర్ 23 వరకు పొడగించినట్లు తెలిపారు. ఈ పొడిగింపు నిరంతర వ్యూహాత్మక ప్రణాళికలు, ప్రస్తుత భద్రతా ప్రోటోకాల్‌లకు అనుగుణంగా ఉంటుందని పేర్కొన్నారు. 

►ALSO READ | అవును.. మునీర్ చెప్పింది నిజమే: పాక్ పరువు తీసిన మంత్రి రాజ్‎నాథ్ సింగ్

కాగా, 2025, ఏప్రిల్ 22న జమ్మూ కాశ్మీర్‎లోని పహల్గాంలో పాక్ ప్రేరేపిత ఉగ్రవాదులు మారణహోమం సృష్టించిన విషయం తెలిసిందే. ఈ టెర్రర్ ఎటాక్ కు ప్రతీకారంగా భారత్ ఆపరేషన్ సిందూర్ చేపట్టింది. దీంతో పాక్, ఇండియా దేశాల మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈ క్రమంలో ఇండియా విమానాలకు పాకిస్థాన్ తమ ఎయిర్ స్పేస్‎ను క్లోజ్ చేసింది. దీనికి కౌంటర్‎గా భారత్ కూడా పాక్ విమానాలకు మన గగనతలాన్ని మూసివేసింది.