
గెలిస్తే ఒలింపిక్స్ క్వాలిఫయర్స్‌కు
భువనేశ్వర్: ఈ ఏడాది చివర్లో జరిగే ఎఫ్‌ఐహెచ్ ఒలింపిక్ క్వాలిఫయర్స్‌కు అర్హత సాధించడానికి మన్‌ప్రీత్ సింగ్ నేతృత్వంలోని ఇండియా హాకీ జట్టు ఒక్క విజయం దూరంలో నిలిచింది. ఇక్కడి కళింగ స్టేడియం వేదికగా జరుగుతున్న ఎఫ్‌ఐహెచ్ సిరీస్ ఫైనల్స్‌లో లీగ్ దశలో అదరగొట్టిన టీమిండియా శుక్రవారం జపాన్‌తో సెమీఫైనల్‌లో అమీతుమీ తేల్చుకోనుంది. ఈ మ్యాచ్‌లో గెలిచి ఫైనల్ చేరిన జట్టు ఒలింపిక్స్ క్వాలిఫయర్స్ అర్హత సాధిస్తుంది. ఏషియన్ గేమ్స్ చాంపియన్ అయిన జపాన్.. ఆతిథ్య దేశం హోదాలో 2020 టోక్యో ఒలింపిక్స్ బెర్త్‌ను కన్ఫామ్ చేసుకుంది. దీంతో ఆ జట్టుకు ఈ మ్యాచ్ ఫలితంతో పెద్దగా ముప్పేమి లేదు. కానీ ఒలింపిక్స్ ఆశలు సజీవంగా ఉంచుకోవాలంటే టీమిండియా మాత్రం ఈ మ్యాచ్ గెలిచి తీరాల్సిందే. ర్యాంకింగ్‌లో తమ కంటే దిగువ స్థానాల్లో ఉన్న టీమ్‌లపై లీగ్ దశలో మన్‌ప్రీత్ సేన ఇరగదీసింది.
రష్యా, ఉజ్బెకిస్థాన్‌లపై 10–0తో గెలిచిన టీమిండియా పోలాండ్‌పై 3–1తో గెలిచింది. కొత్త కోచ్ గ్రహం రీడ్ ఆధ్వర్యంలోని ఇండియా జట్టుకు సిసలైన పరీక్ష జపాన్ రూపంలో ఎదురుకాబోతుంది. అయితే జపాన్‌తో చివరిగా ఆడిన రెండు మ్యాచ్‌ల్లోనూ ఇండియానే విజేతగా నిలవడం కలిసొచ్చే అంశం. మన్‌ప్రీత్ ఆధ్వర్యంలోని ఇండియా మిడ్‌ఫీల్డింగ్ బలంగా ఉన్నా.. దొరికిన అవకాశాలను గోల్స్‌గా మలచడంలో స్ట్రయికర్లు లీగ్ దశలో చాలా సార్లు విఫలమయ్యారు. అక్షదీప్ సింగ్ మినహా స్ట్రయికర్లు ఎవ్వరూ ప్రత్యర్థులకు సవాల్ విసరలేకపోతున్నారు. లీగ్ దశలో గోల్‌కీపర్లుకు పెద్దగా పని లేకపోయినా శ్రీజేష్, కృష్ణ బహదూర్ పతాక్ మంచి టచ్‌లోనే ఉన్నారు.