పద్మారావునగర్/గచ్చిబౌలి, వెలుగు: ప్రధాని నరేంద్ర మోదీ ప్రత్యేక చొరవతో దేశంలో క్రీడలకు పూర్వవైభవం వస్తోందని కేంద్ర మంత్రి జి. కిషన్ రెడ్డి అన్నారు. సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో నెల రోజులుగా జరిగిన ‘పీఎం సంసద్ ఖేల్-2026’ క్రికెట్, ఖోఖో, కబడ్డీ పోటీల ముగింపు వేడుకలు శనివారం జింఖానా గ్రౌండ్స్‌లో ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి కిషన్ రెడ్డి హాజరై మాట్లాడారు. గ్రామీణ, పట్టణ యువతను క్రీడల వైపు మళ్లించేందుకు ప్రతి పార్లమెంట్ నియోజకవర్గంలో ఇలాంటి పోటీలు నిర్వహించాలని ప్రధాని ఆదేశించారని తెలిపారు.
ఈ ఏడాది 35 వేల మంది పాల్గొన్నారని, వచ్చే ఏడాది లక్ష మందిని భాగస్వాములను చేస్తామన్నారు. 2030లో వింటర్ ఒలింపిక్స్‌ను భారత్లో నిర్వహించేలా అడుగులు పడుతున్నాయని పేర్కొన్నారు. 2030లో ఒలింపిక్ గేమ్స్ భారత్ లో జరిగేలా మోదీ ప్రయత్నిస్తున్నారని చెప్పారు. మాజీ కేంద్ర మంత్రి, మాజీ గవర్నర్ విద్యాసాగర్ రావు మాట్లాడుతూ.. క్రీడలు యువతను దురలవాట్లకు దూరంగా ఉంచుతాయని, ఓటమి-విజయాలను సమానంగా స్వీకరించాలని సూచించారు.
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రాంచందర్ రావు మాట్లాడుతూ.. మహిళలు, దివ్యాంగులు కూడా ఈ పోటీల్లో ఉత్సాహంగా పాల్గొనడం అభినందనీయమన్నారు. అనంతరం విజేతలకు బహుమతులు అందజేశారు. అలాగే, అంతర్జాతీయ వాణిజ్య ఒప్పందాలతో భారతీయ ఉత్పత్తులకు ప్రపంచవ్యాప్తంగా మార్కెట్ లభిస్తోందని కిషన్ రెడ్డి అన్నారు. శనివారం రాయదుర్గంలోని లిడ్ క్యాప్ నైలెక్స్ క్యాంపస్‌లో జరిగిన ఫుట్‌వేర్ డిజైన్ అండ్ డెవలప్మెంట్ ఇన్స్టిట్యూట్ (ఎఫ్ డీడీఐ) 5వ స్నాతకోత్సవంలో ఆయన మాట్లాడారు.
