కుర్రాళ్లకు సవాల్‌! : నేడు న్యూజిలాండ్‌‌తో ఇండియా ఫస్ట్‌‌ వన్డే

కుర్రాళ్లకు సవాల్‌! : నేడు న్యూజిలాండ్‌‌తో ఇండియా ఫస్ట్‌‌ వన్డే

ఓపెనర్లుగా పృథ్వీ, మయాంక్‌
నేడు న్యూజిలాండ్‌‌తో
ఇండియా ఫస్ట్‌‌ వన్డే
రెండు జట్లకు గాయాల సమస్యలు
ఉ.7:30 నుంచి స్టార్​ స్పోర్ట్స్ లో​ 

ఐదు టీ20ల ధనాధన్‌‌ సమరం ముగిసింది..! బ్యాటుకు బంతికి మధ్య రసవత్తర పోటీ నడుస్తూ.. బోనస్‌‌గా సూపర్‌‌ ఓవర్ల మజాను అందించిన సిరీస్‌‌ను క్లీన్‌‌స్వీప్‌‌ చేసిన టీమిండియా అదరహో అనిపించింది..! ఇప్పుడు అదే జోరును పిఫ్టీ ఓవర్ల ఆటలోనూ కొనసాగించాలని చూస్తోంది..! మూడు మ్యాచ్‌‌ల సిరీస్‌‌లో భాగంగా నేడు జరిగే ఫస్ట్‌‌ వన్డేలో ఇండియానే ఫేవరెట్‌‌గా బరిలోకి దిగుతోంది..! అయితే, రెండు జట్లనూ గాయాలు వెంటాడుతున్నాయి..! శిఖర్‌‌ ధవన్‌‌ ఈ టూర్‌‌కే దూరమవగా, లాస్ట్‌‌ టీ20లో గాయపడ్డ రోహిత్‌‌ శర్మ కూడా ఇంటిముఖం పట్టాడు..! వీరిద్దరి ప్లేస్‌‌లో యంగ్‌‌స్టర్స్‌‌ పృథ్వీ షా, మయాంక్‌‌ అగర్వాల్‌‌ ఓపెనర్లుగా వన్డే అరంగేట్రం చేయనున్నారు..! మరోవైపు గాయపడ్డ రెగ్యులర్‌‌ కెప్టెన్‌‌ కేన్‌‌ విలియమ్సన్‌‌ లేకుండానే బ్లాక్‌‌క్యాప్స్‌‌ టీమ్‌‌ బరిలోకి దిగుతోంది..! మరి, టీ20ల్లో చేతులెత్తేసిన కివీస్‌‌ వన్డేల్లో ఏమేరకు పోటీ ఇస్తుందో…సీనియర్ల గైర్హాజరీలో లభించిన చాన్స్‌‌ను ఇండియా యంగ్‌‌స్టర్స్‌‌ ఎలా సద్వినియోగం చేసుకుంటారో చూడాలి.

హామిల్టన్‌‌: నవంబర్‌‌ 25, 2019. న్యూజిలాండ్‌‌ చివరగా విజయం సాధించిన రోజు. అప్పటి నుంచి ఆ జట్టు అన్ని ఫార్మాట్లలో కలిపి తొమ్మిది మ్యాచ్‌‌లాడితే ఒక్కసారి కూడా నెగ్గలేదు. పైగా ఆటగాళ్ల గాయాలు ఆ జట్టును మరింత కుంగదీస్తున్నాయి. ట్రెంట్‌‌ బౌల్ట్‌‌, లోకీ ఫెర్గుసన్‌‌, మాట్‌‌ హెన్రీ లేకుండా బరిలోకి దిగి టీ20ల్లో వైట్‌‌వాష్‌‌కు గురైన కివీస్‌‌.. వన్డేల్లో కెప్టెన్‌‌ కేన్‌‌ విలియమ్సన్‌‌ సేవలు కోల్పోయి మరింత డీలా పడింది. ఈ నేపథ్యంలో మూడు వన్డేల సిరీస్‌‌లో భాగంగా బుధవారం జరిగే తొలి మ్యాచ్‌‌లో గెలిచి ఆత్మవిశ్వాసం పెంచుకోవాలని చూస్తోంది. మరోవైపు టీ20ల జోరును వన్డేల్లోనూ కొనసాగించాలని ఇండియా భావిస్తోంది. వన్డే వరల్డ్‌‌కప్‌‌ ఫైనల్‌‌ ఓటమి తర్వాత కివీస్‌‌ ఆడుతున్న ఫస్ట్‌‌ వన్డే ఇదే కాగా.. ఆ మెగా టోర్నీ అనంతరం ఇండియా ఇప్పటికే రెండు సిరీస్‌‌లు (వెస్టిండీస్‌‌, ఆస్ట్రేలియా) ఆడి విజయం సాధించింది. చివరగా వరల్డ్‌‌కప్‌‌ సెమీస్‌‌లో ఈ రెండు జట్లు తలపడగా.. రెండు రోజుల పాటు సాగిన ఆ మ్యాచ్‌‌లో కోహ్లీసేన ఓడిపోయింది. టీ20 సిరీస్‌‌లో బ్లాక్‌‌క్యాప్స్‌‌ టీమ్‌‌ను వైట్‌‌వాష్‌‌ చేసి.. ఆ ఓటమికి ఇప్పటికే ప్రతీకారం తీర్చుకుంది. రెండు జట్లూ రాబోయే వరల్డ్‌‌ టీ20 పై దృష్టి పెట్టడంతో ఈ సిరీస్‌‌ కూడా దానికి సన్నాహకంగానే
అనిపిస్తోంది.

షా, మయాంక్‌‌ అరంగేట్రం.. మిడిలార్డర్‌‌కు రాహుల్‌‌

చివరి టీ20లో గాయపడ్డ రోహిత్‌‌ శర్మ ఈ సిరీస్‌‌కు దూరమవడం ఇండియాకు గట్టి ఎదురుదెబ్బే. ఇప్పటికే శిఖర్‌‌ ధవన్‌‌, భువనేశ్వర్‌‌, హార్దిక్‌‌ పాండ్యా, దీపక్‌‌ చహర్‌‌ లేకుండా కివీస్‌‌కు వచ్చిన కోహ్లీసేన సూపర్‌‌ ఫామ్‌‌లో ఉన్న ఆటగాడి సేవలు కోల్పోయింది. రోహిత్‌‌కు రీప్లేస్‌‌మెంట్‌‌గా వచ్చిన మయాంక్‌‌ అగర్వాల్‌‌.. మరో యంగ్‌‌స్టర్‌‌ పృథ్వీ షా ఈ మ్యాచ్‌‌తో వన్డే అరంగేట్రం చేయనున్నారు. ఈ ఇద్దరే ఇన్నింగ్స్‌‌ ఆరంభిస్తారని, లోకేశ్‌‌ రాహుల్‌‌ను మిడిలార్డర్‌‌లో ఆడిస్తామని కెప్టెన్‌‌ విరాట్‌‌ కోహ్లీ దాదాపు కన్ఫామ్‌‌ చేశాడు. ఇండియా-–ఎ తరఫున కివీస్‌‌ టూర్‌‌కు వచ్చిన షా, మయాంక్‌‌ ఇప్పటికే ఇక్కడి పరిస్థితులకు అలవాటు పడ్డారు. పైగా రంజీ ట్రోఫీలో డబుల్‌‌ సెంచరీ, న్యూజిలాండ్‌‌ ఎలెవన్‌‌తో మ్యాచ్‌‌లో భారీ సెంచరీ చేసిన షా జోరుమీదున్నాడు. ఇండియా–-ఎ తరఫున పెద్దగా ఆకట్టుకోలేకపోయినా వన్డే చాన్స్‌‌ కొట్టేసిన మయాంక్‌‌ దీన్ని సద్వినియోగం చేసుకుంటాడో లేదో చూడాలి. వీరిద్దరూ రాణించకపోతే వన్‌‌డౌన్‌‌లో వచ్చే కెప్టెన్‌‌ విరాట్‌‌ బాధ్యత తీసుకోవాల్సి ఉంటుంది. మిడిలార్డర్‌‌లో శ్రేయస్‌‌ అయ్యర్‌‌, లోకేశ్‌‌ రాహుల్‌‌ జోరుమీద ఉండడం ఇండియాకు ప్లస్‌‌ పాయింట్‌‌. ఆరో నంబర్‌‌లో ఫామ్‌‌లోఉన్న మనీశ్‌‌ పాండేను కాదని కేదార్‌‌ జాదవ్‌‌ను ఆడించే సాహసం మేనేజ్‌‌మెంట్‌‌ చేయకపోవచ్చు. టీ20ల్లో ఫెయిలైన శివం దూబే కూడా బెంచ్‌‌కే పరిమితం కావొచ్చు. దాంతో, ఆల్‌‌రౌండర్‌‌ కోటాలో జడేజా ప్లేస్‌‌ ఖాయమే. అయితే, స్పిన్నర్లలో కుల్దీప్‌‌, చహల్‌‌లో ఎవరిని తీసుకుంటారన్నది ఆసక్తికరం. టీ20ల్లో చాన్స్‌‌ రాని కుల్దీప్‌‌కే మొగ్గు ఉంది. ఇక పొట్టి సిరీస్‌‌లో అదరగొట్టిన శార్దుల్‌‌ ఠాకూర్‌‌.. సీనియర్‌‌ బౌలర్‌‌ బుమ్రాతో పేస్‌‌ బాధ్యతలు పంచుకోనున్నాడు. లాస్ట్‌‌ టీ20లో రెస్ట్‌‌ తీసుకున్న షమీ కూడా బరిలోకి దిగొచ్చు. ఒకవేళ థర్డ్‌‌ సీమర్‌‌గా సైనీని కొనసాగించాలంటే మాత్రం షమీ తన ప్లేస్‌‌ను త్యాగం చేయాల్సి ఉంటుంది. రోహిత్‌‌ గైర్హాజరీలో ఇండియా బ్యాటింగ్‌‌ కాస్త వీక్‌‌ అయినా.. బౌలింగ్‌‌లో మాత్రం దుర్భేద్యంగా ఉంది.

కేన్‌‌ ఔట్‌‌.. కెప్టెన్‌‌గా లాథమ్‌‌

టీ20 సిరీస్‌‌లో ఇండియాకు గట్టి పోటీనే ఇచ్చినా కీలక సమయాల్లో పట్టు విడిచిన కివీస్‌‌ ఘోరంగా ఓడింది. వన్డేల్లోనూ ఆ రిజల్ట్‌‌ను రిపీట్‌‌ చేయకూడదంటే ఆ జట్టు సమష్టిగా ఆడాల్సి ఉంటుంది. తొలి రెండు మ్యాచ్​లకు దూరమైన కెప్టెన్‌‌ విలియమ్సన్‌‌ ప్లేస్‌‌లో టామ్‌‌ లాథమ్‌‌ స్టాండిన్‌‌ కెప్టెన్‌‌గా వ్యవహరించనున్నాడు.అలాగే, కీపింగ్‌‌ బాధ్యతలూ తీసుకోనున్నాడు. ఫింగర్‌‌ ప్రాక్చర్‌‌ నుంచి కోలుకున్న లాథమ్‌‌ ఇటీవల ఫోర్డ్‌‌ ట్రోఫీలో ఆడి ఫామ్‌‌లోకొచ్చాడు. అలాగే, సూపర్‌‌ స్మాష్‌‌ నెగ్గిన వెల్లింగ్టన్‌‌ ఫైర్‌‌బర్డ్స్‌‌లో రాణించడంతో పాటు లిస్ట్‌‌-–ఎలో తన బెస్ట్‌‌ పెర్ఫామెన్స్‌‌ (5/29) చేసిన ఆల్‌‌రౌండర్‌‌ నీషమ్‌‌ జట్టులో రీఎంట్రీ ఇచ్చాడు. లాథమ్‌‌, నీషమ్‌‌తో పాటు గ్రాండ్‌‌హోమ్‌‌ రాకతో హోమ్‌‌టీమ్‌‌ మిడిలార్డర్‌‌ స్ట్రాంగ్‌‌గా మారింది. ఫోర్డ్‌‌ ట్రోఫీలో అదరగొట్టిన  నికోల్స్‌‌.. మరో ఓపెనర్‌‌ గప్టిల్‌‌తో ఇన్నింగ్స్‌‌ ఆరంభించనున్నాడు. కేన్‌‌కు రీప్లేస్‌‌మెంట్‌‌గా జట్టులోకొచ్చిన చాప్‌‌మన్‌‌ వన్‌‌డౌన్‌‌లో రావొచ్చు. అయితే, కెన్​ గైర్హాజరీలో వెటరన్‌‌ టేలర్‌‌ మరింత బాధ్యతగా ఆడాలని హోమ్‌‌టీమ్‌‌ కోరుకుంటోంది. ఈ మ్యాచ్‌‌కు మాత్రమే అందుబాటులో ఉండే సోధీతో పాటు సెకండ్‌‌ స్పిన్నర్‌‌గా శాంట్నర్‌‌ను ఆడిస్తుందో లేదో చూడాలి. బెనెట్‌‌, కుగెలిన్‌‌కు తోడుగా 6.8 ఫీట్ల ఎత్తున్న  జేమిసన్‌‌
అరంగేట్రం చేసే చాన్సుంది.

ఇండియా తరఫున ఓపెనర్లుగా వన్డే అరంగేట్రం చేయనున్న నాలుగో జంట  పృథ్వీ-మయాంక్‌‌.  ఇది వరకు సునీల్‌‌ గావస్కర్‌‌-సుధీర్‌‌ నాయక్‌‌ (1974లో ఇంగ్లండ్‌‌పై),  దిలీప్‌‌ వెంగ్‌‌ సర్కార్‌‌- పార్థసారథి శర్మ (1976లో కివీస్‌‌పై), లోకేశ్‌‌ రాహుల్‌‌-కరుణ్‌‌ నాయర్‌‌ (2016లో జింబాబ్వేపై) ఓపెనర్లుగా అరంగేట్రం చేశారు.

పిచ్‌‌/వాతావరణం

సెడాన్‌‌ పార్క్‌‌లో థర్డ్‌‌ టీ20 జరిగిన వికెట్‌‌నే ఈ మ్యాచ్‌‌కు వాడనున్నారు. ఆ మ్యాచ్‌‌లో పిచ్‌‌ అంతగా ఫ్లాట్‌‌గా కనిపించలేదు. సెకండ్‌‌ ఇన్నింగ్స్‌‌లో బౌలింగ్‌‌కు అనుకూలించింది. మ్యాచ్‌‌కు వర్షం ముప్పులేదు. వాతావరణం ఆహ్లాదకరంగా ఉండనుంది.

జట్లు (అంచనా)

ఇండియా: మయాంక్‌‌, పృథ్వీ షా, కోహ్లీ (కెప్టెన్‌‌), అయ్యర్‌‌, లోకేశ్​ రాహుల్‌‌ (కీపర్‌‌), పాండే, జడేజా, ఠాకూర్‌‌, చహల్‌‌/కుల్దీప్‌‌, షమీ/సైనీ, బుమ్రా.

న్యూజిలాండ్‌‌: గప్టిల్‌‌, నికోల్స్‌‌, చాప్‌‌మన్‌‌, టేలర్‌‌, లాథమ్‌‌ (కెప్టెన్‌‌, కీపర్‌‌), గ్రాండ్‌‌హోమ్‌‌, నీషమ్‌‌, శాంట్నర్‌‌/ఇష్‌‌ సోధీ, కైల్‌‌ జేమిసన్‌‌/టిమ్‌‌ సౌథీ, బెనెట్‌‌, కుగెలిన్‌‌.