ఏటీఎంతో రేషన్ సరుకులు

ఏటీఎంతో రేషన్ సరుకులు

కస్టమర్లు నగదు తీసుకునేందుకు వీలుగా ఆయా బ్యాంకులు ఏటీఎంలను  ఏర్పాటు చేశాయి. వీటి నుంచి ఎప్పుడైనా డబ్బులు డ్రా చేసుకునేలా అవకాశం కల్పించాయి. ప్రస్తుతం అలాంటి ఏటీఎంల ద్వారా రేషన్‌ సరుకులను కూడా తీసుకునే ఏర్పాటు చేపట్టింది హర్యాన ప్రభుత్వం.దీంతో ఇకపై రేషన్ షాపుల ముందు బారులు తీరాల్సిన అవసరం ఉండదంటోంది ఆ రాష్ట్ర సర్కారు.

దేశంలోనే మొదటి ‘రేషన్‌ ఏటీఎం’ను గురుగ్రామ్‌లోని ఫరూక్‌నగర్‌లో ఏర్పాటు చేసింది హర్యాన. ఈ ఏటీఎం నుంచి 5 నుంచి 7 నిమిషాల్లో 70 కిలోల వరకు బియ్యం, గోధుమలు, చిరుధాన్యాలు విడుదలవుతాయి. ఇందులో బయోమెట్రిక్‌ వ్యవస్థ ఉంటుంది. టచ్‌స్క్రీన్‌ ద్వారా లబ్ధిదారుడు ఆధార్‌, రేషన్‌ ఖాతా నెంబర్‌ ప్రెస్ చేయాలి. బయోమెట్రిక్‌ కన్ఫాం కాగానే.. వారికి ఎంత బియ్యం వస్తుందో లెక్కించి ఆటోమేటిక్‌గా సంచుల్లో నింపేస్తుంది. వీటి ఏర్పాటుతో రేషన్‌ దుకాణాల్లో తూనికలు, కొలతల అక్రమాలకు తెర పడుతుందని.. ప్రజా పంపిణీ వ్యవస్థలో పారదర్శకత వస్తుందని ఆ రాష్ట్ర  డిప్యూటీ సీఎం దుష్యంత్‌ చౌతాలా తెలిపారు.