భారత వ్యాక్సిన్లు బంద్.. పాక్ ఎకానమీపై తీవ్ర భారం

భారత వ్యాక్సిన్లు బంద్.. పాక్ ఎకానమీపై తీవ్ర భారం
  • ఆపరేషన్ సిందూర్  తర్వాత వ్యాక్సిన్ల సప్లై నిలిపివేసిన ఇండియా

కరాచీ: ఆర్థిక ఇబ్బందులతో ఇప్పటికే కుదేలైన పాకిస్తాన్​పై మరో భారం పడింది. పాక్​కు కాస్ట్ ఎఫెక్టివ్  వ్యాక్సిన్ల సప్లైను భారత్  నిలిపివేయడంతో ఆ దేశ ఆర్థిక కష్టాలు మరింత పెరిగాయి. నిరుడు పహల్గాం టెర్రర్  అటాక్​కు ప్రతీకారంగా భారత్  ఆపరేషన్  సిందూర్  నిర్వహించిడంతో పాటు ఆ తర్వాత పాక్​కు వ్యాక్సిన్ల సప్లై నిలిపివేసింది. అప్పటివరకూ గ్లోబల్  అలయెన్స్  ఫర్  వ్యాక్సిన్స్  అండ్  ఇమ్యునైజేషన్(గవి) ద్వారా పాక్​కు భారత్  చవకగా నాణ్యమైన వ్యాక్సిన్లను సరఫరా చేసింది. ఇప్పుడు సప్లై బంద్  కావడంతో పాక్  విదేశాల నుంచి వ్యాక్సిన్లను దిగుమతి చేసుకుంటోంది. ఇందుకు ఏడాదికి దాదాపు రూ.10 వేల కోట్లపైనే ఖర్చు చేస్తోంది.

వ్యాక్సిన్ల కోసం ఈ స్థాయిలో ఖర్చుపెట్టడం పాకిస్తాన్​కు తలకు మించిన భారంగా మారిందని ఆ దేశ హెల్త్  మినిస్టర్ ముస్తఫా కమల్ తెలిపారు. రూ.10 వేల కోట్లలో 49% గవి ద్వారా ఆపరేట్  చేస్తున్న పలు అంతర్జాతీయ సంస్థలు ఖర్చుపెట్టడం తమకు కాస్త ఊరటనిస్తోందని ఆయన చెప్పారు. ఇక తామే  సొంతంగా వ్యాక్సిన్ల ఉత్పత్తి ప్రారంభించాల్సిన టైమ్  వచ్చిందని, లేకపోతే దేశ పరిస్థితి మరింత దిగుజారుతుందన్నారు.

తమకు వ్యాక్సిన్లు అందిస్తున్న దేశాల ఒప్పందం కూడా 2031లోపు పూర్తవుతుందన్నారు. గవి ద్వారా భారత్  నుంచే తమకు ఎక్కువ మొత్తంలో నాణ్యమైన వ్యాక్సిన్లు తక్కువ ధరలో అందాయని వివరించారు. అలాగే, కొవిడ్  సమయంలోనూ భారత్  తమకు కొవాక్స్  వ్యాక్సిన్లు సప్లై చేసిందని వెల్లడించారు. ప్రస్తుతం 13 రకాల వ్యాక్సిన్లు మాత్రమే పౌరులకు ఉచితంగా అందిస్తున్నామని, వాటిలో ఏదీ కూడా స్థానికంగా తయారైనది కాదని చెప్పారు.