WTC Points Table: వెస్టిండీస్‌ను క్లీన్ స్వీప్ చేసిన టీమిండియా.. WTC లేటెస్ట్ పాయింట్స్ టేబుల్‌ ఇదే!

WTC Points Table: వెస్టిండీస్‌ను క్లీన్ స్వీప్ చేసిన టీమిండియా.. WTC లేటెస్ట్ పాయింట్స్ టేబుల్‌ ఇదే!

స్వదేశంలో వెస్టిండీస్ తో జరిగిన రెండు మ్యాచ్ ల టెస్ట్ సిరీస్ లో ఇండియా 2-0 తేడాతో కైవసం చేసుకుంది. ఢిల్లీ వేదికగా అరుణ్ జైట్లీ స్టేడియంలో మంగళవారం (అక్టోబర్ 14) ముగిసిన ఈ మ్యాచ్ లో 7 వికెట్ల తేడాతో విండీస్ ను చిత్తు చిత్తుగా ఓడించింది. అహ్మదాబాద్ లో జరిగిన తొలి టెస్టులో ఇన్నింగ్స్ తేడాతో గెలిచిన గిల్ సేన.. ఢిల్లీ టెస్టులో 7 వికెట్ల తేడాతో నెగ్గింది. కుల్దీప్ యాదవ్ కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్.. రవీంద్ర జడేజాకు ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అవార్డులు లభించాయి. రెండు మ్యాచ్ ల టెస్ట్ సిరీస్ ను ఇండియా క్లీన్ స్వీప్ చేయడంతో లేటెస్ట్ వరల్డ్ టెస్ట్ ఛాంపియన్స్ షిప్ పాయింట్స్ టేబుల్ ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం..  

మూడో స్థానంలోనే ఇండియా: 

ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ 2025-27 లో భాగంగా లేటేస్ట్ పాయింట్స్ టేబుల్ లో ఇండియా మూడో స్థానంలోనే ఉంది. ఇంగ్లాండ్ తో ఐదు మ్యాచ్ ల టెస్ట్ సిరీస్ ను 2-2 తో సమం చేసుకొని మూడో స్థానంలో నిలిచిన టీమిండియా.. తాజాగా వెస్టిండీస్ పై రెండు మ్యాచ్ ల టెస్ట్ సిరీస్ ను 2-0తో క్లీన్ స్వీప్ చేసినా మూడో స్థానంలోనే కొనసాగుతుంది. మంగళవారం (అక్టోబర్ 14) ఢిల్లీ వేదికగా ముగిసిన రెండో టెస్టులో టీమిండియా విజయం సాధించిన తర్వాత పాయింట్ల శాతం (PCT) 55.56 నుండి 61.90కి పెరిగింది. పాయింట్ల శాతాన్ని పెంచుకోగలిగినప్పటికీ టాప్-2 లోకి రాలేకపోయింది. 

వెస్టిండీస్‌పై ఆస్ట్రేలియా జూలై నెలలో మూడు మ్యాచ్ ల టెస్ట్ సిరీస్ ను 3-0 తేడాతో విజయం సాధించిన తర్వాత అగ్రస్థానంలో కొనసాగుతుంది. శ్రీలంక (66.66) రెండో స్థానంలో ఉంది. 61.90 తో ఇండియా మూడో స్థానంలో.. 46.66 శాతంతో ఇంగ్లాండ్ నాలుగో స్థానంలో ఉన్నాయి. బంగ్లాదేశ్, వెస్టిండీస్ ఒక్క మ్యాచ్ లో కూడా గెలవలేదు. వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్ సైకిల్‌లో న్యూజిలాండ్, పాకిస్తాన్, సౌతాఫ్రికా ఇంకా ఎలాంటి మ్యాచ్‌లు ఆడలేదు. ప్రస్తుతం సౌతాఫ్రికా, పాకిస్థాన్ జట్ల మధ్య టెస్ట్ మ్యాచ్ జరుగుతుంది. వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్ సైకిల్‌లో 5 టెస్టు మ్యాచ్ లాడిన విండీస్ జట్టు ఐదు మ్యాచ్ ల్లోనూ ఘోరంగా ఓడిపోయింది.  

ఇండియా ఇప్పటివరకు డబ్ల్యూటీసిలో ఏడు టెస్ట్ మ్యాచ్ లాడింది. వీటిలో నాలుగు గెలిచి రెండు మ్యాచ్ ల్లో ఓడిపోయింది. ఓవరాల్ గా 52 పాయింట్లతో మూడో స్థానంలో కొనసాగుతుంది. స్వదేశంలో నవంబర్ నెలల్లో రెండు మ్యాచ్ ల టెస్ట్ సిరీస్ ఆడాల్సి ఉంది. ఈ సిరీస్ లో ఇండియా గెలిస్తే టాప్-2 కు చేరుతుంది. తొలి స్థానంలో ఉన్న ఆస్ట్రేలియా ఇంగ్లాండ్ పై యాషెస్ లో ఓడిపోతే ఇండియా టాప్ కు చేరుకునే ఛాన్స్ ఉంటుంది.