- విజయ్ దివస్ మనందరిలో ఎనలేని గర్వాన్ని నింపుతుంది: మోదీ
- రక్షణ రంగంలో భారత్ తిరుగులేని శక్తిగా ఎదుగుతున్నది
- స్పేస్ స్టార్టప్‌లతో మన యువశక్తి సత్తా చాటుతున్నది
- ప్రతి ఒక్కరూ చేనేత వస్త్రాలను ధరించాలని ప్రజలకు పిలుపు
న్యూఢిల్లీ: రక్షణ ఉత్పత్తి, విదేశాలకు మిలిటరీ ఎగుమతులు, మిత్రదేశాలతో వ్యూహాత్మక భాగస్వామ్యంలో భారత్ సరికొత్త శిఖరాలను అధిరోహిస్తోందని, తిరుగులేని శక్తిగా ఎదుగుతోందని ప్రధాని నరేంద్ర మోదీ పేర్కొన్నారు. కార్గిల్ యోధుల ధైర్యసాహసాలు, త్యాగాలు భారతీయులకు ఎప్పటికీ గుర్తుండిపోతాయని కొనియాడారు. ఆదివారం ప్రసారమైన నెలవారీ రేడియో కార్యక్రమం ‘మన్ కీ బాత్’ 136వ ఎపిసోడ్‌లో మోదీ మాట్లాడారు. 1999 కార్గిల్ యుద్ధంలో దేశ రక్షణ కోసం ప్రాణాలర్పించిన అమరవీరులకు నివాళులర్పించారు. దేశ సైనికుల అసాధారణ ధైర్యసాహసాలను కొనియాడారు.
‘‘మన జీవితంలో కొన్ని ప్రత్యేకమైన రోజులను గుర్తుపెట్టుకోవడానికి క్యాలెండర్ చూడాల్సిన అవసరం ఉండదు. జులై 26 అలాంటి పవిత్రమైన రోజే. అదే కార్గిల్ విజయ్ దివస్’’ అని ప్రధాని పేర్కొన్నారు. ఎత్తైన మంచు పర్వతాలు, ప్రతికూల వాతావరణం, శత్రువు విసిరిన సవాళ్లను సైనికులు ధైర్యంగా ఎదుర్కొన్నారని, వారి మనోధైర్యం ముందు ఏదీ నిలవలేకపోయిందని అన్నారు. ఈ స్ఫూర్తిని కొత్త తరానికి అందించేందుకు ఈసారి ‘శౌర్య విజయ్ యాత్ర’ పేరిట ఢిల్లీ నుంచి లడఖ్‌లోని ద్రాస్ వరకు ప్రత్యేక బైక్ ర్యాలీ నిర్వహిస్తున్నట్టు వెల్లడించారు.
స్వదేశీ రక్షణ సామర్థ్యం ‘ఆత్మనిర్భర్ భారత్’..
భారత్ తన సాంకేతిక రక్షణ సామర్థ్యాన్ని వేగంగా పెంచుకుంటోందని ప్రధాని మోదీ తెలిపారు. స్వదేశీ పరిజ్ఞానంతో తయారై ఇటీవల ఇండియన్ నేవీలో చేరిన ఐఎన్‌ఎస్ మహేంద్రగిరిలో 75 శాతానికి పైగా స్వదేశీ విడిభాగాలనే ఉపయోగించినట్టు చెప్పారు. డీఆర్డీవో ఇటీవలే ‘పినాక లాంగ్ రేంజ్ గైడెడ్ రాకెట్’, కుషా క్షిపణి ప్రయోగాలను విజయవంతంగా నిర్వహించిందని ప్రశంసించారు. ఇండోనేసియాతో బ్రహ్మోస్, అస్త్ర క్షిపణుల ఒప్పందం కుదరడం భారత రక్షణ రంగానికి ప్రపంచవ్యాప్తంగా పెరిగిన నమ్మకానికి నిదర్శనమని పేర్కొన్నారు. సైంటిస్టులు, ఇంజనీర్ల ఉమ్మడి శ్రమ వల్లే రక్షణ రంగంలో భారత్ ఈ స్థాయి విజయాలు సాధిస్తోందని అభినందించారు.
దేశ యువశక్తి సత్తా చాటుతున్నది..
ప్రైవేట్ రంగంలో భారత్ అభివృద్ధి చేసిన మొదటి రాకెట్ ‘విక్రమ్-1’ ఇటీవల విజయవంతంగా లాంచ్ కావడం చరిత్రాత్మక ఘట్టమని, యువ ఇన్నోవేటర్లు అద్భుతాలు సృష్టిస్తున్నారని ప్రధాని మోదీ కొనియాడారు. అలాగే సైన్స్ ఒలింపియాడ్స్‌లో పతకాలు, రికార్డులు సాధించిన మన విద్యార్థులను ప్రశంసించారు. అంతర్జాతీయ వేదికలపై అద్భుత ప్రతిభ కనబరుస్తున్న భారతీయ అథ్లెట్లను ప్రధాని అభినందించారు.
జపాన్ ఓపెన్ గెలిచిన తొలి భారతీయురాలిగా పీవీ సింధు నిలవడం, లార్డ్స్ మైదానంలో భారత మహిళా క్రికెట్ జట్టు సాధించిన చరిత్రాత్మక టెస్టు విజయాన్ని మోదీ గుర్తుచేసుకున్నారు. కేరళలోని ఎర్నాకులం విద్యార్థుల సంస్కృత క్లబ్‌పై ప్రశంసలు కురిపించారు. కాశ్మీరీ సాంప్రదాయ చాపల తయారీ కళ ‘వాగు’ పునరుద్ధరణకు గులాబ్ హుస్సేన్, తన్జిలా చేస్తున్న కృషితోపాటు యూపీలోని బిజ్నోర్ జిల్లా మహిళలు తయారు చేస్తున్న ‘విదుర్ ప్రేరణ స్వదేశీ హెర్బల్ టీ’ విశేషాలను ప్రధాని వివరించారు.
జోరుగా క్యాచ్ ది రెయిన్
వర్షపు నీటిని ఎక్కడికక్కడ ఒడిసిపట్టి భూగర్భ జలాలను మెరుగుపరుచుకోవడా నికి ఈ నెల 4 నుంచి చేపట్టిన ‘క్యాచ్ ది రెయిన్’ ఉద్యమం ఊపందుకుందని, పురాతన చెరువుల పునరుద్ధరణ వేగంగా జరుగుతోందని మోదీ తెలిపారు. ‘ఏక్ పేడ్ మా కే నామ్’ ప్రచారంలో భాగంగా కోట్ల సంఖ్యలో మొక్కలు నాటుతున్న ప్రజల భాగస్వామ్యాన్ని మెచ్చుకున్నారు. ఆగస్టు 7న ‘జాతీయ చేనేత దినోత్సవం’ సందర్భంగా ప్రతి ఒక్కరూ చేనేత వస్త్రాలను ప్రోత్సహించాలని ప్రధాని నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు.
