సుస్థిర ప్రజాస్వామ్యం కొనసాగుతున్న అతిపెద్ద దేశం

సుస్థిర ప్రజాస్వామ్యం  కొనసాగుతున్న అతిపెద్ద దేశం

75 ఏండ్ల స్వతంత్ర భారతదేశం ప్రస్తుతం వజ్రోత్సవాలు జరుపుకుంటోంది. దాదాపు 90 ఏండ్లు... అనేకమంది పోరాటం చేసి సాధించుకున్న స్వేచ్ఛ ఇది.  అందుకోసం ఎంతోమంది ప్రాణ త్యాగాలు చేశారు. వేలాదిమంది జైలు పాలయ్యారు. ఈస్ట్ ఇండియా కంపెనీ దేశంలోని వనరులు, సంపద కొల్లగొట్టింది. బ్రిటిష్ ప్రభుత్వం కూడా వాళ్ల దేశంలోని ఫ్యాక్టరీల కోసం మనదేశాన్ని  బీదగా మార్చింది. అలాంటి పరిస్థితులకు, అంతకుముందటి రాజరికాలకు స్వస్తి చెప్పి మన దేశం ప్రజాస్వామ్య పద్ధతిలో పార్లమెంటరీ డెమోక్రసీని ఏర్పాటు చేసుకుంది. అందుకోసం రాజ్యాంగాన్ని ఏర్పాటు చేసుకున్నాం. అప్పటి నుంచి అంటే.. 75 ఏండ్ల నుంచి నిరాటంకంగా, సుస్థిరంగా ప్రజాస్వామ్యం కొనసాగుతున్నది. 

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఫెడరల్​ పద్ధతిలో మన ప్రజాస్వామ్య వ్యవస్థ ప్రపంచంలోనే అతి గొప్పగా, గర్వించదగినదిగా నిలబడింది. డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ నాయకత్వంలో తయారుచేసుకున్న విలక్షణమైన రాజ్యాంగంలో అణగారిన వర్గాలకు  సామాజిక, ఆర్థికంగా, రాజకీయంగా, సొసైటీ పరంగా న్యాయం జరగాలని పకడ్బందీ రూల్స్​ చేశారు.  ప్రతి పౌరునికి ధనిక, పేద అని తేడా లేకుండా ఓటు హక్కు ఇచ్చింది. ప్రతి  పౌరుడు ఓటు హక్కు  ద్వారా రాష్ట్ర శాసనసభలకు, లోక్​సభకు, స్థానిక సంస్థలకు సభ్యులను ఎన్నుకుంటున్నాడు. 

అభివృద్ధి చెందుతున్న దేశం 

మన దేశ జనాభా140 కోట్లకు చేరువలో ఉన్నది. త్వరలో ప్రపంచంలోనే  అతి ఎక్కువ జనాభా కలిగిన దేశంగా మొదటి ర్యాంకుకు చేరబోతున్నది. చదువుల్లో దేశం ఎంతో పురోగతి సాధించింది. ప్రస్తుతం దేశంలో 70 శాతం అక్షరాలు రాయగలరు. కేరళ, తమిళనాడు, కర్ణాటక, హిమాచల్ ప్రదేశ్, ఈశాన్య రాష్ట్రాలు అక్షరాస్యతలో మరింత పురోగతి సాధించాయి. కాకపోతే అక్షరాస్యతలో వివిధ వర్గాల ప్రజల మధ్య అంతరాలు ఉన్నాయి. వివిధ రంగాల్లో పరిశోధనా సంస్థలు, యూనివర్సిటీలు, కళాశాలలు, ఉన్నత ప్రాథమిక పాఠశాలలు, అంగన్వాడీలు, సంక్షేమ హాస్టల్ల​లో ఎన్నో రెట్లు ఎదిగినప్పటికీ చదువు విషయంలో మనం సాధించవలసింది ఇంకా చాలా ఉంది. 

మన దేశం సైన్స్​ అండ్​ టెక్నాలజీలో ప్రపంచంలో టాప్​ పొజిషన్​లో ఉన్నాం. ఈ విషయంలో మనం గర్వించాల్సిందే. మనకు అవసరమైన ఆయుధ సంపత్తిని కొంతమేరకు మనమే తయారు చేసుకుంటున్నాం. పారిశ్రామిక రంగానికి కావలసిన అనేక ఉత్పత్తులను దేశంలో తయారు చేయడమే కాకుండా ఇతర దేశాలకు ఎగుమతి చేస్తున్నాం. ఎలక్ట్రానిక్స్ ఇతర యంత్ర పరికరాలు అనేక దేశాలకు ఎగుమతి చేస్తున్నాం. సాఫ్ట్‌‌వేర్ ఉత్పత్తులను  పెద్ద సంఖ్యలో ఎగుమతి చేస్తున్నాం. ప్రతి సంవత్సరం వేల సంఖ్యలో మన దేశం నుండి యువతీ యువకులు అమెరికా, ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా, సింగపూర్, స్విట్జర్లాండ్, స్వీడన్ లాంటి దేశాలలో సాఫ్ట్‌‌వేర్ ఇంజనీర్లుగా, సైంటిస్టులుగా, డాక్టర్లుగా పనిచేయడానికి అవకాశాలు దక్కించుకుని వెళ్తున్నారు.

సాఫ్ట్‌‌వేర్​ కారణంగా విదేశాల నుంచి డబ్బు పెద్ద మొత్తంలో వస్తున్నది. అనేక ప్రభుత్వ ఆరోగ్య సంస్థలు మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేసినప్పటికీ మారుమూల గ్రామాలలో పేద ప్రజలకు పూర్తి స్థాయిలో ట్రీట్మెంట్​ అందడం లేదు. దేశ సంపద, జాతీయ ఉత్పత్తి, కుబేర్ల సంఖ్య, ప్రాజెక్టులు, పరిశ్రమలు, విశాలమైన హైవేలు అభివృద్ధిని సూచిస్తున్నప్పటికీ అవి నిజమైన కొలమానాలు కావు. అంతిమంగా మానవాభివృద్ధి సమానత్వం, సత్వర న్యాయం, చదువు, మెడికల్​ సౌకర్యాలు, స్త్రీల పట్ల న్యాయం, మానవ హక్కుల ఆచరణ లాంటి అంశాలు మాత్రమే ఆ దేశపు నిజమైన అభివృద్ధిని శాస్త్రీయంగా తెలియచేస్తాయని ఐక్యరాజ్యసమితి యు.ఎన్.డి.పి. చెప్పింది.

మానవాభివృద్ధి సూచిక(ఇన్​ఈక్వాలిటీ అడ్జెస్టెడ్​ ​ హ్యూమన్​ డెవలప్​మెంట్​ ఇండెక్స్​) మొత్తం 189 దేశాలుంటే మన దేశం 130 నుండి135 ర్యాంకుల మధ్య కొట్టుమిట్టాడుతున్నది. ఎంతో పురోగతి సాధించామని అనుకున్నప్పటికీ ఈ ఇండెక్స్​లో మన ర్యాంకు అనేక దేశాల కంటే దయనీయమైన స్థితిలో ఉంది. చదువు, మెడికల్​ ఫెసిలిటీస్​, ఆరోగ్యం, ప్రజాస్వామ్య హక్కులు, స్త్రీల సాధికారిత విషయాల్లో మన దేశం ఇంకా పురోగతి సాధించవలసి ఉందని మానవాభివృద్ధి సూచిక తెలియజేస్తున్నది. అయినా స్వతంత్రానికి పూర్వం కంటే ఈ 75 ఏండ్లలో భారతదేశం అనేక రంగాల్లో గణనీయమైన అభివృద్ధిని సాధించింది. 

 1950లో కేవలం 50 మిలియన్ టన్నుల ఆహార ఉత్పత్తి జరగ్గా 2022లో 390 మిలియన్ టన్నుల ఆహార ఉత్పత్తులు జరిగాయి. అంటే ఆహార ఉత్పత్తి ఆరు రెట్లకు పైగా పెరిగింది. అదే సమయంలో దేశ జనాభా నాలుగున్నర రెట్లు పెరిగింది. ఒకరకంగా చెప్పాలంటే ఒకప్పుడు ఆహార ధాన్యాలు దిగుమతి చేసుకునే వాళ్లం. ఇప్పుడు ఇతర దేశాలకు కూడా ఎగుమతి చేయగల సత్తా మన దేశం సాధించుకున్నది. అంతేకాకుండా వ్యవసాయ రంగం నుంచి ఇండస్ట్రియల్​, ప్రైవేట్​రంగాల్లోనూ ఊహించనంత అభివృద్ధి సాధించాం. ఇది ఒక శుభ పరిణామం. ఆందోళనకరమైన విషయం ఏమిటంటే.. ఉత్పత్తి పెరిగినా వ్యవసాయ రంగం ద్వారా రైతులకు మాత్రం శ్రమకు, పెట్టుబడికి తగిన ఆర్థిక ప్రయోజనం అందడం లేదు. 

పొలాలకు రియల్​ఎస్టేట్​ బెడద

రైతుల వలసలు, సన్న, చిన్న కారు రైతులలో అశాంతి మన అభివృద్ధిలో లోటుగానే  ఉంది. పొలాలు రైతుల నుండి వ్యాపారుల అధీనంలోకి వెళ్లడంతో వాళ్లు వ్యవసాయానికి దూరం అవుతున్నారు. రియల్ ఎస్టేట్ వ్యాపారంలో రైతుల భూములు ప్లాట్​లుగా మారుతున్నాయి. లక్షల ఎకరాల భూములు  వ్యవసాయానికి ఉపయోగపడకుండా దూరం అవుతున్నాయి. నల్లడబ్బు దాచిపెట్టడానికి వ్యవసాయ భూములు మార్కెట్ వస్తువుగా మారుతున్నాయి. దేశంలో జరుగుతున్న రియల్ ఎస్టేట్ వ్యాపారం వ్యవసాయ రంగాన్ని విధ్వంసం చేస్తున్నదని పాలకులు గుర్తిస్తే వ్యవసాయ మనుగడకు మేలు చేసినట్లు అవుతుంది.

మార్పులెన్నో..

 జాతీయ ఉత్పత్తిలో వ్యవసాయ రంగం ఉత్పత్తి 55 శాతం నుండి(1950) ప్రస్తుతం (2022) 15 శాతం వరకు తగ్గింది. పారిశ్రామిక రంగం 24శాతం, సేవా రంగం 61 శాతం ఉత్పత్తిని నమోదు చేస్తున్నది. వ్యవసాయ రంగంలో 43శాతం దేశ శ్రామికులు శ్రమించినప్పటికీ వారికి దక్కేది కేవలం జాతీయ ఉత్పత్తిలో కేవలం15శాతం ఆదాయం మాత్రమే. అందువల్లే వ్యవసాయ దారులు నిత్యం శ్రమిస్తున్నప్పటికీ గిట్టుబాటు ధరలు లేక నష్టపోతున్నారు. రైతు కుటుంబాలు ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోతున్నాయి. వేలాదిమంది  రైతులు ఆత్మహత్య చేసుకుంటున్నారు. 
పారిశ్రామిక రంగం కంటే అత్యధికంగా సేవా రంగం ఉరుకులు పెడుతున్నది.

బ్యాంకింగ్, ఫైనాన్స్, ఇన్సూరెన్స్, చదువు, మెడికల్​, రియల్ ఎస్టేట్, టూరిజం ఎంతో వేగంగా వృద్ధి చెందుతున్నాయి. ముఖ్యంగా కొన్ని పెద్ద జిల్లాల కేంద్రాలకు పరిమితమై అభివృద్ధి జరుగుతున్నది. అందుకే 25 నుంచి 30 ఏండ్ల నుండి మనదేశంలో గ్రామీణ శ్రామికుల వలసలు పెరిగిపోతున్నాయి. పట్టణాల్లో జనాభా పెరగడమే కాక వలస కార్మికుల సమస్యలు వర్ణనాతీతం. 2019 నుండి 2021 మధ్య కాలంలో ఏర్పడిన కొవిడ్​ వల్ల వలస కార్మికుల సమస్య, మన అభివృద్ధిలో ఉన్న సామాజిక, ఆర్థిక లోటుపాట్లు బయటపడ్డాయి.

గ్రామాల్లో తగిన సౌకర్యాలు లేక, ఆదాయ వనరులు కరువై ఉపాధి అన్వేషణలో కూలీలు, ఆర్థిక సంక్షోభంలో పడిన రైతులు, నిరుద్యోగులు గ్రామాల నుండి నగరాలకు వెళ్తున్నారు. గ్రామాల్లో వృద్ధులు, ఫిజికల్లీ ఛాలెంజ్డ్‌‌, పేద వర్గాల పిల్లలు మాత్రమే ఎక్కువ సంఖ్యలో ఉన్నారు. ఎదుగుతున్న యువతకు గ్రామీణ ఆర్థిక వ్యవస్థ ఉపాధి, ఆదాయ అవకాశాలను కల్పించలేని దుస్థితిలోకి దిగజారింది. అందుకే జిల్లా కేంద్రాలు, రాష్ట్రాల రాజధానులు వలస కార్మికులతో నిండిపోతున్నాయి. గ్రామాల్లో చిన్న, మధ్య తరగతి పట్టణాల్లో తగిన విధంగా పరిశ్రమలను ప్రమోట్ చేయడం ద్వారా నిరాటంకంగా సాగుతున్న గ్రామీణ వలసలను ఆపాల్సిన అవసరం ఉన్నది.

అభివృద్ధి నమూనాలో ‘యూ’టర్న్

గత 75 ఏండ్లలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేసిన ఆర్థిక విధానాలు అనేక రకాల మార్పులు, చేర్పులకు లోనయ్యాయి.  మొదటి ముప్పై ఏండ్లలో అద్భుతమైన అభివృద్ధిని సాధించామనేది వాస్తవం. అనేక పబ్లిక్ రంగ సంస్థలు, ఇరిగేషన్​ ప్రాజెక్టులు, రవాణా సౌకర్యాలు, బ్యాంకింగ్, చదువు, మెడికల్​ రంగాలు ఎంతో పురోగతి సాధించాయి. లక్షలాది మందికి ప్రభుత్వ రంగంలో ఉద్యోగ అవకాశాలు కల్పించారు. 

పాకిస్తాన్‌‌తో యుద్ధాలు, బంగ్లాదేశ్ సమస్య, 1970వ దశకంలో ఏర్పడ్డ కరువులు దేశ ఆర్థిక అభివృద్ధి వ్యవస్థను కొంత ప్రభావితం చేశాయి. ఈ విధంగా దేశానికి విదేశీ అప్పులు పెరిగి దిగుమతులు చేసుకోలేని పరిస్థితి ఏర్పడింది. ఇందిరాగాంధీ పరిపాలనలో నియంతృత్వ ధోరణి ప్రదర్శించడం వల్ల రాజకీయాలు మొదలయ్యాయి. ఫలితంగా ఎమర్జెన్సీ విధించడం, రాజకీయ పునరేకీకరణ.. అనేక అంశాలు దేశ రాజకీయ ఆర్థిక వ్యవస్థలో పలుమార్పులు రావడానికి దారితీశాయి.

1975 నుండి 1990 వరకు దేశ రాజకీయ చిత్రంలో అనేక మార్పులు వచ్చాయి. జనతా ప్రభుత్వం ఏర్పాటు (1977),  ప్రధాని ఇందిరాగాంధీ హత్య(1984), తర్వాత రాజీవ్ గాంధీ హత్య దేశ రాజకీయాల్లో సంక్లిష్టమైన, అస్థిరత్వానికి దారితీసింది. జనతా ప్రభుత్వం మధ్యంతరంగానే పతనం కావడంతో భాగస్వాములైన భారతీయ జనతా పార్టీతోపాటు వివిధ ప్రాంతీయ పార్టీలు ఆవిర్భవించాయి. దేశంలో కాంగ్రెస్ పార్టీ ఆధిపత్యం కొంత బలహీన పడడం ప్రారంభమైంది. 19 85  నుండి మన ఆర్థిక విధానాల్లో పెను మార్పులు వచ్చాయి. వివిధ రంగాల్లో సంస్కరణలు చేపట్టారు. ముఖ్యంగా 1991లో పీవీ నరసింహారావు నాయకత్వంలో ఆనాటి దేశ ఆర్థిక సంక్షోభం నుండి రక్షించడానికి నూతన ఆర్థిక విధానాలను ప్రవేశపెడుతున్నామని దేశ ప్రజలకు చెప్తూ ప్రైవేటీకరణకు ప్రారంభోత్సవం చేశారు.

‘ప్రైవేట్​’తో మార్పులు

దేశ ఆర్థిక విధానాల్లో ముఖ్యంగా లైసెన్స్ విధానాన్ని రద్దు చేసి, సరళీకృతమైన ఆర్థిక విధానాలను ప్రవేశపెట్టారు. ప్రభుత్వ రంగ సంస్థల ప్రాధాన్యతలను తగ్గించి, ప్రైవేటు రంగాన్ని ప్రోత్సహించే విధానాలు ప్రవేశపెట్టారు. విదేశీ వ్యాపార సంస్థలకు, సాంకేతిక పరిజ్ఞానం దిగుమతికి, విదేశీ అప్పులకు, బ్యాంకుల స్థాపనకు, సరళీకృతమైన విధానాలను తీసుకొచ్చారు. అంతర్జాతీయ పెట్టుబడిదారులను, బహుళ జాతి కంపెనీలను ఆహ్వానించారు. ఎగుమతి, దిగుమతుల రాకపోకలను సులభతరం చేయడం జరిగింది. పన్నుల విధానాలను సరళీకరించి పెట్టుబడిదారులకు, బహుళ జాతి కంపెనీలకు అనుకూలమైన శాసన సవరణలు చేశారు.

చదువు, మెడికల్​తో పాటు అన్ని రకాల వ్యాపారాలను, సర్వీసు రంగాలను, టెలీ కమ్యూనికేషన్లను, రవాణా వ్యవస్థలను ప్రైవేటీకరించడం ప్రారంభమైంది. ఇలా 35 ఏండ్ల పాటు అనేక విధానాల ద్వారా భారతదేశ  వ్యవసాయ, పారిశ్రామిక, సేవా రంగాలు జాతీయ మార్కెట్లతో అనుసంధానం అయ్యాయి. ఒక రకంగా చెప్పాలంటే భారత దేశ ఆర్థిక విధానాల్లో పాలకులు, విధానకర్తలు1985 నుండి యూ టర్న్ తిప్పారు. ప్రభుత్వ రంగానికి నిధుల కేటాయింపులు తగ్గించడమే కాకుండా నష్టాలను చూపించే సంస్థలను విక్రయించడం, మూసివేయడం వంటి చర్యలు తీసుకున్నారు. దేశంలోని పేద ప్రజల ఆర్థిక సామాజిక న్యాయం కోసం ప్రారంభించిన ప్రభుత్వ రంగ సంస్థలను చిన్న చూపు చూడడం మొదలైంది. క్రమేపీ ఎంతో ఆర్భాటంగా వేలాది కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టి స్థాపించిన ప్రభుత్వ సంస్థలు పూర్వ వైభవాన్ని నిలుపుకోలేకపోయాయి.

పెరిగిన వృద్ధిరేటు 

ఆర్థిక వ్యవస్థల వృద్ధి రేటు 19 50 నుండి 80 వరకు కేవలం మూడు నుంచి -మూడున్నర శాతానికి మించని పరిస్థితి ఉండేది. నూతన ఆర్థిక విధానాల అమలుతో వృద్ధిరేటు ఏడు నుండి తొమ్మిది శాతం వరకు పెరిగింది. అనేక ప్రైవేట్ కార్యకలాపాల్లో కార్మికుల వేతనాలు తక్కువగా ఉన్నప్పటికీ ఉపాధి అవకాశాలు మెరుగయ్యాయి. ప్రైవేట్ రంగాలు లాభసాటిగా ఎదుగుతూ కార్పొరేట్ సంస్థలుగా ఎదుగుతూ వచ్చాయి. ప్రైవేటు బ్యాంకులు, ఫ్యాక్టరీలు వ్యాపార సంస్థలు దేశ విదేశీ పెట్టుబడులతో అనేక రెట్లు అభివృద్ధి చెందాయి. కానీ, జన బాహుళ్యానికి అవసరమైన విద్య ప్రైవేట్ రంగంలో అనేక రెట్లు ఎదిగిపోయింది. పేద వర్గాలకు శాస్త్ర సాంకేతిక చదువు అందుబాటులో లేకుండా పోతున్నది. అదే విధంగా మెడికల్​ ఫెసిలిటీస్​ కూడా సంపన్నులకు మాత్రమే అందుబాటులో ఉంది. ప్రభుత్వ విద్య, వైద్య సంస్థలు పేద వర్గాలకు నాణ్యమైన సేవలు అందించే స్థితిలో లేకుండా పోతున్నాయి. ఉపాధి, ఉద్యోగ అవకాశాలు లభించినా అత్యధిక శాతం ఉద్యోగాలు అతి తక్కువ జీతానికే చేయాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. ప్రభుత్వం అనేక రకాల సామాజిక భద్రతా చట్టాలను తెచ్చినప్పటికీ అనేక సందర్భాల్లో అవి అమలుకు నోచుకోవడం లేదు.

సంతోషించాలా? విచారించాలా? 

ప్రైవేట్​ రంగానికి ప్రభుత్వ సంస్థలు అప్పగించడం, ప్రపంచ ఆర్థిక వ్యవస్థ అందుబాటులోకి రావడంతో... వృద్ధి, ఉత్పత్తిని పెంచినప్పటికీ పంపిణీ విధానంలో విపరీతమైన అసమానతలను సృష్టిస్తుందనేది అక్షర సత్యం. దేశం 3.6 బిలియన్ల ఆర్థిక వ్యవస్థగా ఎదిగిందని సంతోషించాలా? లేదా అత్యధిక శాతం ప్రజలకు అభివృద్ధి సరిగా అందడం లేదని విచారించాలా? నూట ముప్పై ఎనిమిది కోట్ల జనాభాలో అత్యధికంగా 20 శాతం ప్రజలకు భాగస్వామ్యం ఉండి ఉండవచ్చు. లక్షల మంది కోటీశ్వరులుగా ఎదిగి ఉండవచ్చు. పదులకొద్దీ బిలీనియర్స్‌‌ అంతర్జాతీయ కుబేరుల వరుసలో చేరవచ్చు. కానీ.. కనీస ఉపాధి దొరకని వారే మనదేశంలో అత్యధికం. పేద వర్గాలకు అత్యంత ధనికులకు వ్యత్యాసం గత 30 ఏండ్లలో అనేక రెట్లు పెరిగిపోయింది. బలహీనులు, స్త్రీలు, బహుజనులపై ఒత్తిడి, వివక్ష మరింత పెరిగిపోయింది.

ప్రతి వ్యవస్థ ప్రభావితం..

కార్పొరేట్ వ్యవస్థలో భాగంగా దేశ రాజకీయాలు కార్పొరేట్ వాసనలను, వాటి లక్షణాలను ఆలింగనం చేసుకున్నాయి. కార్పొరేట్ రంగం ప్రతి వ్యవస్థను ప్రభావితం చేస్తున్నది. నాయకులు సేవా దృక్పథం నుండి పెట్టుబడిదారులుగా, వ్యాపారవేత్తలుగా, కాంట్రాక్టర్లుగా, కార్పొరేట్ సంస్థల యాజమానులుగా అవతారం ఎత్తుతున్నారు. ఎన్నికల్లో లక్షల కోట్లలో ఖర్చు పెట్టడం... ఎన్నికైన తర్వాత అన్నీ తానై వ్యవస్థలను నిర్వీర్యం చేసి స్వీయ ప్రయోజనాల కోసం దుర్వినియోగం చేయడం అలవాటయింది. ప్రజాస్వామ్య, రాజకీయ, మానవ, కుటుంబ, సామాజిక న్యాయ విలువలను ఈనాటి వ్యవస్థలో పాటించడం అరుదైపోయింది. రాజకీయ నాయకులు ప్రజల ఆస్తులను, అస్తిత్వాన్ని, ఆత్మగౌరవాన్ని దెబ్బ తీసే విధంగా ప్రవర్తించడం ఈనాటి రాజకీయాల్లో చోటు చేసుకుంటోంది. 

గత 30 ఏండ్ల ప్రైవేటీకరణలో జరుగుతున్న ఎన్నికలు ఒక ప్రహసనంగా మారిపోతున్నాయి. కేవలం కోట్లాది రూపాయల ఆస్తి పరులు, సంపన్న వర్గాలు ఆధిపత్య వర్గాలు మాత్రమే ఈ ప్రజాస్వామ్యంలో చట్ట సభల్లో చేరి అధికారాన్ని సొంతం చేసుకునే అవకాశాలు పెరిగిపోతున్నాయి. కార్పొరేట్ వ్యవస్థలే రాజకీయ రంగంతోపాటు అన్ని రంగాలను నియంత్రించే దిశలో ఈ వ్యవస్థలు సాగుతున్నాయి. ఓటర్లను మద్యం, డబ్బు, తాయిలాలు, బుజ్జగింపులు, అవసరమైతే బెదిరింపులు, అధికారులతో తిప్పలు పెట్టడం.. వంటి పద్ధతులతో ఆకట్టుకోవడానికి, నియంత్రించడానికి ప్రయత్నించడం ఈనాటి ఎన్నికల్లో ముఖ్యమైంది. రకరకాల ప్రలోభాలకు, ఒత్తిళ్లకు లోనై ఓటు హక్కును నిజాయితీగా ఉపయోగించుకోలేని వాతావరణాన్ని ప్రస్తుత కార్పొరేట్, రాజకీయ, వ్యాపార వ్యవస్థలు సృష్టిస్తున్నాయి.

ప్రైవేటీకరణ  ద్వారా మొదలైన పెను మార్పుల్లో పెరిగిన అవినీతి అతి ముఖ్యమైంది. రాజకీయ, అధికార, ఆర్థిక రంగంలో అవినీతి అడుగడుగునా పాకిపోయింది. జాతీయ పార్టీల నాయకత్వంలో నడుస్తున్న ప్రభుత్వాలు కొంతమేరకు విలువలను పాటించే దిశలో సాగుతున్నప్పటికీ కొన్ని ప్రాంతీయ పార్టీల పాలన దుర్నీతి, బంధుప్రీతి, ఆశ్రిత పక్షపాతం, అవినీతి, ఆధిపత్యం మితిమీరిపోయి ప్రాంతీయ రాజ్యాంగ వ్యవస్థలుగా మారుతున్నాయి. జాతీయ పార్టీలైన కాంగ్రెస్, భారత కమ్యూనిస్టు పార్టీలు బహుజన సమాజ్‌‌వాది పార్టీ ఇంకా ఇతర జాతీయ పార్టీలు బలహీనపడడం కూడా ఈ నూతన ఆర్థిక విధానాల ప్రభావమే  అనుకోవచ్చు. 

ప్రపంచీకరణ దుష్ఫలితాలు ఇవి.. 

కుటుంబ, స్నేహ సంబంధాల్లో  కూడా వ్యాపార దృక్పథాలు చోటు చేసుకుంటున్నాయి. ఆస్తుల తగాదాలు, హత్యలు, నేరాలు, అత్యాచారాలు, గృహహింస మొదలైనవి ప్రపంచీకరణ దుష్ఫలితాలే  అని చెప్పవచ్చు. భారతదేశ సామాజిక వ్యవస్థలు అనాదిగా వస్తున్న నిజాయితీ, ఆదరణ, ప్రేమ, మానవత్వం అనే మానవజాతికి ఉండవలసిన విలువలు క్రమంగా మారిపోతున్నాయి. 
ప్రపంచీకరణను ఆహ్వానించిన మనం రాజకీయ, ఆర్థిక, సామాజిక, మానవ రంగాల్లో ఎప్పటినుంచో పాటిస్తున్న విలువలు, సంప్రదాయాలు కాపాడుకొనేలా పాలకులు ఆలోచించాల్సిన అవసరం ఉంది. దేశాభివృద్ధిలో భాగంగా ప్రజలందరికీ చదువు, మెడికల్​, ఎంప్లాయిమెంట్​.. కనీస స్థాయిలో లభించిన నాడే మనం సంపాదించుకున్న స్వాతంత్ర్యానికి, స్వాతంత్ర వజ్రోత్సవాలకు సార్థకత ఉంటుంది. 


వ్యాసకర్త: కూరపాటి వెంకట్​ నారాయణ, 
రిటైర్డ్‌ ప్రొఫెసర్‌‌‌‌, కాకతీయ యూనివర్శిటీ