- వ్యవసాయం, ఎనర్జీ, సైబర్ స్పేస్, డిజిటల్ పేమెంట్లలోనూ ఒప్పందాలు
- ఇజ్రాయెల్ పీఎం నెతన్యాహుతో ప్రధాని మోదీ చర్చలు
- గాజా పీస్ డీల్ కు మద్దతు
ఇజ్రాయెల్ తో ఇండియా త్వరలో ఫ్రీ ట్రేడ్ డీల్ కుదుర్చుకోనుంది. ఈ మేరకు ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు, భారత ప్రధాని నరేంద్ర మోదీ అంగీకారం తెలిపారు. ఇజ్రాయెల్ పర్యటనలో భాగంగా మోదీ రెండో రోజు నెతన్యాహుతో గురువారం భేటీ అయ్యారు.
జెరూసలెం: ఇజ్రాయెల్ తో ఇండియా త్వరలో ఫ్రీ ట్రేడ్ డీల్ కుదుర్చుకోనుంది. ఈ మేరకు ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు, భారత ప్రధాని నరేంద్ర మోదీ అంగీకారం తెలిపారు. ఇజ్రాయెల్ పర్యటనలో భాగంగా మోదీ రెండో రోజు నెతన్యాహుతో గురువారం భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఇరు దేశాల అధినేతలు ట్రేడ్, వ్యవసాయం, ఎనర్జీ, సైబర్ స్పేస్, డిజిటల్ పేమెంట్ వంటి రంగాల్లో ఒప్పందాలు కుదుర్చుకున్నారు. అలాగే ఇజ్రాయెల్ తో డిఫెన్స్ భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేసుకుంటామని మోదీ చెప్పారు.
టెక్నాలజీ బదిలీ ఒప్పందం కింద మిలిటరీ హార్డ్ వేర్ ఉత్పత్తిని ఉమ్మడిగా అభివృద్ధి చేయాలని ఇరు దేశాల అధినేతలు నిర్ణయించారు. ఈ సందర్భంగా పశ్చిమాసియాలో పరిణామాలపైనా ఇద్దరూ చర్చించారు. పశ్చిమాసియాలో శాంతి, స్థిరత్వంతో భారత భద్రతా ప్రయోజనాలకు సంబంధం ఉందని మోదీ అన్నారు. నెతన్యాహుతో చర్చల తర్వాత ఈ మేరకు ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. గాజా శాంతి ఒప్పందానికి భారత్ మద్దతు తెలుపుతుందని ఆయన స్పష్టం చేశారు. ‘‘దేశాల మధ్య సంఘర్షణ, యుద్ధ వాతావరణంలో మానవత్వం బలికాకూడదు. ఈ విషయంలో భారత వైఖరి స్పష్టంగా ఉంది. మేము ఎప్పుడూ శాంతినే కోరుకుంటాం. భవిష్యత్తులోనూ అన్ని దేశాలతో చర్చలు, సహకారాన్నే మేము కొనసాగిస్తాం” అని మోదీ తెలిపారు.
యూపీఐ అమనుతిపై మోదీ హర్షం
ప్రపంచంలో ఉగ్రవాదానికి ఎక్కడా చోటు లేదని నరేంద్ర మోదీ అన్నారు. ఈ విషయంలో ఇండియా, ఇజ్రాయెల్ వ్యూహం ఒకటే అని, టెర్రరిజంపైనా, టెర్రరిజానికి మద్దతు ఇచ్చే వారిపైనా రెండు దేశాలు కలిసి పోరాడుతాయని ఆయన చెప్పారు. ‘‘బలమైన నమ్మకం, ప్రజాస్వామ్య విలువలు, మానవ ప్రయోజనాలపైనే మన బంధం నిలబడి ఉంది. ప్రతీసారి కాల పరీక్షకు ఇండియా, ఇజ్రాయెల్ బంధం నిలబడింది.
ఈరోజు ఇరు దేశాల మధ్య సంబంధాన్ని స్పెషల్ స్ట్రాటజిక్ పార్ట్ నర్ షిప్ గా మార్చాలని చరిత్రాత్మక నిర్ణయం తీసుకున్నాం. అలాగే ఏఐ, క్వాంటమ్ అండ్ క్రిటికల్ మినరల్స్ వంటి రంగాల్లో పరస్పర సహకారం కోసం టెక్నాలజీని ఇరు దేశాలు ఇచ్చిపుచ్చుకోవాలి. ఇజ్రాయెల్ లో యూపీఐకి అనుమతి ఇవ్వడం నాకు చాలా సంతోషాన్నిచ్చింది” అని మోదీ వ్యాఖ్యానించారు.
అధ్యక్షుడు ఐసాక్ తోనూ మోదీ భేటీ
ఇజ్రాయెల్ అధ్యక్షుడు ఐసాక్ హెర్జాగ్ తోనూ ప్రధాని నరేంద్ర మోదీ భేటీ అయ్యారు. విద్య, స్టార్టప్స్, ఇన్నోవేషన్స్, టెక్ అండ్ కనెక్టివిటీపై ఇద్దరూ సుదీర్ఘంగా చర్చించారు. ముందుగా హెర్జాగ్ ను ఆయన అధికారిక నివాసంలో ప్రధాని కలిశారు. ఇజ్రాయెల్, ఇండియా మధ్య స్నేహం, అభివృద్ధికి సూచికగా ఇద్దరూ అధ్యక్షుడి తోటలో ఓక్ చెట్టు నాటారు. ఇజ్రాయెల్ ఇచ్చిన ఆతిథ్యానికి మోదీ కృతజ్ఞతలు చెప్పారు. సైన్స్, ఇన్నోవేషన్, ఎడ్యుకేషన్ వంటి రంగాల్లో రెండు దేశాలు ప్రపంచానికి చాలా చేయగలవని మోదీ అన్నారు.
‘‘భారత వ్యవసాయ రంగంలో ఇప్పటికే ఇజ్రాయెల్ టెక్నాలజీని వాడుతున్నాం. మన దేశంలోని వ్యవసాయంలో చాలా సమస్యలకు ఇజ్రాయెల్ టెక్నాలజీ పరిష్కారం చూపింది. ఆ టెక్నాలజీతో మేము గొప్ప ఫలితాలు సాధించాం” అని మోదీ అన్నారు. ఇండియాలో పర్యటించాలని హెర్జాగ్ ను మోదీ ఆహ్వానించారు. కాగా.. టెక్ ఇన్నోవేషన్ ఎగ్జిబిషన్ ను బెంజమిన్ నెతన్యాహుతో కలిసి మోదీ సందర్శించారు. భారత్ లో పెట్టుబడులు పెట్టాలని ఇజ్రాయెల్ కంపెనీలను ఈ సందర్భంగా ఆయన కోరారు.
