IND vs SA: సఫారీలను ఓడించినంత మాత్రాన ఆ బాధ తగ్గదు: రోహిత్ శర్మ

IND vs SA: సఫారీలను ఓడించినంత మాత్రాన ఆ బాధ తగ్గదు: రోహిత్ శర్మ

సఫారీ పర్యటనలో భారత్, దక్షిణాఫ్రికా మధ్య డిసెంబర్ 26 నుంచి టెస్ట్ సిరీస్ ప్రారంభం కానున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో మీడియా సమావేశంలో పాల్గొన్న భారత జట్టు కెప్టెన్ రోహిత్ శర్మ పలు ప్రశ్నలకు ఆసక్తికర సమాధానాలు ఇచ్చారు. ఇప్పటివరకూ సఫారీ గడ్డపై టెస్టు సిరీస్ సాధించలేకపోయామని, కానీ ఈసారి ఆ లోటు తీరుస్తామని రోహిత్ ధీమా వ్యక్తం చేశాడు. అదే సమయంలో తాను 2024 టీ20 వరల్డ్ కప్ ఆడతానా..? లేదా? అన్న ప్రశ్నలకు మీడియా మిత్రులకే చెమటలు పట్టే సమాధానాలు ఇచ్చారు.   

ఏళ్లు గడుస్తున్నా.. కెప్టెన్లు మారుతున్నా.. సఫారీ గడ్డపై భారత జట్టు టెస్టు సిరీస్ గెలిచింది లేదు. మహ్మద్‌ అజారుద్దీన్‌, రాహుల్‌ ద్రావిడ్, సచిన్‌ టెండూల్కర్‌, సౌరవ్‌ గంగూలీ, మహేంద్ర సింగ్‌ ధోని, విరాట్‌ కోహ్లీ.. ఇలా ఎంత మంది సారథులు సఫారీ టూర్‌ వెళ్లినా వట్టి చేతులతోనే స్వదేశానికి తిరిగొచ్చారు. అయితే, ఈసారి మాత్రం అలా వట్టి చేతులతో వెళ్లబోమని హిట్‌మ్యాన్‌ చెప్పుకొచ్చారు. ఎలాగైనా ఈసారి గెలిచితీరాలనే పట్టుదలతో ఉన్నామని తెలిపాడు.

"గతంలో(1992 నుంచి..) పలుమార్లు భారత జట్టు ఇక్కడ పర్యటించింది.. ఎన్నో టెస్టు మ్యాచ్‌లు ఆడింది. కానీ ఇంతవరకూ ఎవరూ సాధించని(టెస్టు సిరీస్‌) మేం సాధించాలని ఉంది. ఇది ప్రపంచ కప్ ఓటమి బాధను పూర్తిగా తుడిచివేస్తుందో లేదో నాకు ఖచ్చితంగా తెలియదు. కానీ గెలవాలన్నదే మా లక్ష్యం.. " అని హిట్ మ్యాన్ చెప్పుకొచ్చారు. 

టీ20 వరల్డ్‌ కప్‌ మాటేంటి..?

ఫైనల్ ఓటమి మినహాయిస్తే వన్డే ప్రపంచ కప్ 2023 టోర్నీ అమాంతం భారత జట్టు అద్భుతమైన ప్రదర్శన కనపరిచింది. కెప్టెన్ గా, బ్యాటర్ గా రోహిత్ శర్మ జట్టును ముందుండి నడిపించాడు. అయితే, ఫైనల్ ఓటమి అనంతరం పరిమిత ఓవర్ల క్రికెట్ కు, ముఖ్యంగా టీ20 ఫార్మాట్ కు హిట్ మ్యాన్ గుడ్ బై చెప్పారనే ఊహాగానాలు మొదలయ్యాయి. ఈ తరుణంలో వచ్చే ఏడాది జరగబోయే టీ20 వరల్డ్‌ కప్‌ లో ఆడతారా..? లేదా! అన్న ప్రశ్నలు రోహిత్ కు ఎదురయ్యాయి. వాటికి హిట్ మ్యాన్ సినీ హీరోల స్టయిల్లో ఆన్సర్లు ఇచ్చారు.     

"మీరు ఏమి అడగాలనుకుంటున్నారో నాకు తెలుసు, త్వరలోనే మీ ప్రశ్నలకు సమాధానం వస్తుంది (అప్కో జవాబ్ మైలేగా).." అంటూ హిట్ మ్యాన్ చిరునవ్వుతో సమాధానమిచ్చాడు.

కాగా, టీ20 ప్రపంచకప్‌కు యువ భారత జట్టుతోనే వెళ్లాలని బీసీసీఐ యోచిస్తోంది. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ వంటి సీనియర్లకు విశ్రాంతినిచ్చే సూచనలు వంద శాతం ఉన్నాయి.