మెల్‌బోర్న్: బ్యాటింగ్‌లో అట్టర్ ఫ్లాఫ్ అయిన టీమిండియా.. ఆస్ట్రేలియాతో జరిగిన రెండో టీ20లో ఓటమిపాలైంది. అభిషేక్ శర్మ (37 బాల్స్‌లో 8 ఫోర్లు, 2 సిక్స్‌లతో 68), హర్షిత్ రాణా (33 బాల్స్‌లో 3 ఫోర్లు, 1 సిక్స్‌తో 35) మినహా మిగతా వారందరూ సింగిల్ డిజిట్ స్కోర్లకే పరిమితం కావడంతో.. శుక్రవారం జరిగిన ఈ మ్యాచ్‌లో ఇండియా 4 వికెట్ల తేడాతో కంగారుల చేతిలో పరాజయం పాలైంది. టాస్ ఓడిన ఇండియా 18.4 ఓవర్లలో 125 రన్స్‌కే కుప్పకూలింది. తర్వాత ఛేజింగ్‌లో ఆసీస్ 13.2 ఓవర్లలో 126/6 స్కోరు చేసి నెగ్గింది.
కెప్టెన్ మిచెల్ మార్ష్ (26 బాల్స్‌లో 3 ఫోర్లు, 4 సిక్స్‌లతో 46), ట్రావిస్ హెడ్ (15 బాల్స్‌లో 3 ఫోర్లు, 1 సిక్స్‌తో 28) దంచికొట్టారు. హేజిల్‌వుడ్ (3/13)కు ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు లభించింది. ఇరుజట్ల మధ్య మూడో టీ20 హోబర్ట్‌లో ఆదివారం జరుగుతుంది. ప్రాక్టీస్ సందర్భంగా బాల్ మెడకు తగిలి మరణించిన ఆస్ట్రేలియా యంగ్ క్రికెటర్ బెన్ ఆస్టిన్ (17) మృతికి నివాళిగా ఇరుజట్లు బ్లాక్ ఆర్మ్ బ్యాండ్స్ ధరించి బరిలోకి దిగాయి.
9 మంది సింగిల్ డిజిట్‌కే..
మ్యాచ్ స్టార్ట్అయిన 20 నిమిషాల్లోపే హేజిల్‌వుడ్ ఇండియా బ్యాటింగ్ లైనప్‌ను పేకమేడలా కూల్చాడు. తన నాలుగు ఓవర్ల స్పెల్‌లో 15 డాట్ బాల్స్ వేసి తీవ్రమైన ఒత్తిడి తెచ్చాడు. ఓ ఎండ్‌లో అభిషేక్ ఒంటరిగా పోరాడినా.. హాజిల్‌వుడ్ టెస్ట్‌ల్లో మాదిరిగా వేసిన 6–8 మీటర్ల లెంగ్త్‌కు మిగతా బ్యాటర్లు విలవిలలాడారు. హాజిల్‌వుడ్ వేసిన బలమైన బౌన్సర్ డైరెక్ట్‌గా తలకు తాకడంతో కంకషన్ టెస్ట్‌కు వెళ్లిన శుభ్‌మన్ గిల్ (5) కూడా ఎక్కువసేపు ఆడలేకపోయాడు.
మూడో ఓవర్‌లో ఓ ఫుల్ లెంగ్త్ బాల్‌కు మిడాఫ్‌లో మార్ష్‌కు క్యాచ్ ఇచ్చాడు. తర్వాతి ఓవర్‌లో నేథన్ ఎలిస్ (2/21) దెబ్బకు శాంసన్ (2) ఎల్బీ అయ్యాడు. డీఆర్‌ఎస్‌కు వెళ్లినా సక్సెస్ కాలేదు. ఐదో ఓవర్‌లో హేజిల్‌వుడ్ డబుల్ స్ట్రోక్ ఇచ్చాడు. షార్ట్ బాల్‌ను ఫుల్ షాట్ కొట్టే క్రమంలో ఔటయ్యే ప్రమాదం తప్పించుకున్న కెప్టెన్ సూర్యకుమార్ (1) ఆ తర్వాత సంధించిన ఫుల్ లెంగ్త్ బాల్‌ను ఎలాంటి మూవ్‌మెంట్ లేకుండా ఆడి కీపర్ ఇంగ్లిస్‌కు క్యాచ్ ఇచ్చాడు.
ఆ వెంటనే ఇన్ స్వింగర్‌గా వేసిన ఐదో బాల్ తిలక్ వర్మ (0) బ్యాట్‌ను టచ్ చేస్తూ కీపర్ చేతుల్లోకి వెళ్లింది. 8వ ఓవర్‌లో అక్షర్ పటేల్ (7) అనూహ్యంగా రనౌట్ కావడంతో ఇండియా 49 రన్స్‌కే సగం జట్టును కోల్పోయింది. ఈ దశలో వచ్చిన హర్షిత్ రాణా.. అభిషేక్‌తో కలిసి పోరాటం చేశాడు.
ఈ ఇద్దరూ వీలైనప్పుడల్లా బౌండ్రీలు బాదుతూ స్కోరును పెంచారు. దాదాపు ఎనిమిది ఓవర్లు క్రీజులో నిలిచి ఆరో వికెట్‌కు 56 రన్స్ జత చేశారు. 16వ ఓవర్‌లో హర్షిత్ ఔట్‌తో ఇండియా ఇన్నింగ్స్ మళ్లీ కుప్పకూలింది. 23 బాల్స్‌లో ఫిఫ్టీ కొట్టిన అభిషేక్‌కు రెండో ఎండ్‌లో ఎలాంటి సహకారం అందలేదు.
శివమ్ దూబే (4), కుల్దీప్ (0) వెంటవెంటనే ఔట్‌కావడంతో ఇండియా 110/8తో పీకల్లోతు కష్టాల్లో పడింది. ఈ దశలో బార్ట్‌లెట్ (2/39) బౌలింగ్‌లో అభిషేక్ సిక్స్ కొట్టడంతో కనీసం ఆ మాత్రం స్కోరైనా వచ్చింది. చక్రవర్తి (0 నాటౌట్), బుమ్రా (0) నిరాశపర్చారు.
మార్ష్ ధనాధన్..
చిన్న ఛేజింగ్‌లో బుమ్రా (2/26), వరుణ్ చక్రవర్తి (2/23), కుల్దీప్ యాదవ్ (2/45) పోరాడినా ఆసీస్ విజయాన్ని అడ్డుకోలేకపోయారు. ఓపెనర్లు మార్ష్, హెడ్ ధనాధన్ షాట్లతో కేవలం 4.3 ఓవర్లలోనే తొలి వికెట్‌కు 51 రన్స్ జోడించారు. తర్వాత ఇంగ్లిస్ (20) నిలకడగా ఆడగా, మార్ష్ రెండో వికెట్‌కు 36 రన్స్ జత చేసి వెనుదిరిగాడు. ఈ దశలో టిమ్ డేవిడ్ (1), మాథ్యూ షార్ట్ (0) ఫెయిలైనా.. మిచెల్ ఓవెన్ (14), స్టోయినిస్ (6 నాటౌట్) 40 బాల్స్ మిగిలి ఉండగానే విజయానికి కావాల్సిన రన్స్ అందించారు.
సంక్షిప్త స్కోర్లు
ఇండియా: 18.4 ఓవర్లలో 125 ఆలౌట్ (అభిషేక్ 68, హర్షిత్ రాణా 35, హేజిల్‌వుడ్ 3/13). ఆస్ట్రేలియా: 13.2 ఓవర్లలో 126/6 (మార్ష్ 46, హెడ్ 28, వరుణ్ 2/23, బుమ్రా 2/26).
