
టీమిండియాకు బ్యాడ్ లక్ కొనసాగుతోంది. రోహిత్ శర్మతో మొదలైన దురదృష్టం గిల్ ను వెంటాడుతుంది. అదేంటో కాదు మన జట్టు టాస్ గెలవడంలో విఫలమవుతున్నారు. వరుసగా ఐదు.. పది కాదు ఏకంగా 15 టాస్ లు ఓడిపోయారు. లండన్ వేదికగా ఓవల్ స్టేడియంలో ఇంగ్లాండ్ తో గురువారం (జూలై 31) ప్రారంభమైన ఐదో టెస్టులోనూ మన జట్టు టాస్ ఓడిపోయింది. లీడ్స్, ఎడ్జ్ బాస్టన్, లార్డ్స్, మాంచెస్టర్ టెస్టుల్లో టాస్ ఓడిపోయిన టీమిండియాకు ఈ సిరీస్ లో చివరిదైన ఐదో టెస్టులోనూ నిరాశ తప్పలేదు. కెప్టెన్ గా తొలి సిరీస్ లోనే గిల్ వరుసగా ఐదు టాస్ లు ఓడిపోయిన వింత రికార్డ్ మూటగట్టుకున్నాడు.
2025లో రాజ్‌కోట్‌లో జరిగిన టీ20 నుంచి టీమిండియా టాస్ విషయంలో బ్యాడ్ లక్ ప్రారంభమైంది. అప్పటి నుంచి కెప్టెన్ గా రోహిత్ శర్మ వరుసగా 10 మ్యాచ్ ల్లో టాస్ ఓడిపోగా.. ప్రస్తుతం జరుగుతున్న ఇంగ్లాండ్ టెస్ట్ సిరీస్ లో గిల్ వరుసగా 5 సార్లు టాస్ ఓడిపోయాడు. వరుసగా 12 టాస్ లు ఓడిపోయిన వెస్టిండీస్ ను ఎప్పుడో దాటేసిన టీమిండియా 15 టాస్ ఓటములతో ఈ రికార్డ్ పెంచుకుంది. ఈ మ్యాచ్ విషయానికి వస్తే ఇంగ్లాండ్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది.
ఇంగ్లాండ్ ప్లేయింగ్ 11 ఒక రోజు ముందే ప్రకటించిన సంగతి తెలిసిందే. కెప్టెన్ స్టోక్స్ ఈ టెస్ట్ మ్యాచ్ కు దూరం కాగా.. నాలుగు మార్పులతో ఇంగ్లీష్ సేన బరిలోకి దిగుతుంది. టీమిండియా విషయానికి వస్తే నాలుగు మార్పులతో మ్యాచ్ ఐదో టెస్ట్ ఆడనుంది. జస్ప్రీత్ బుమ్రా దూరం కావడంతో ప్రసిద్ కృష్ణ ప్లేయింగ్ 11 లోకి వచ్చాడు. శార్దూల్ ఠాకూర్ పై వేటు పడగా.. అతని స్థానంలో స్పెషలిస్ట్ బ్యాటర్ కరుణ్ నాయర్ తుది జట్టులోకి వచ్చాడు. పంత్ దూరం కావడంతో ధృవ్ జురెల్ ప్లేయింగ్ 11 లో చోటు సంపాదించాడు. కంబోజ్ స్థానంలో ఆకాష్ దీప్ స్థానం సంపాదించాడు.