ఆస్ట్రేలియాతో జరుగుతున్న మూడో టీ20లో టీమిండియా ఏకంగా మూడు మార్పులతో బరిలోకి దిగడం ఆశ్చర్యానికి గురి చేస్తుంది. రెండో టీ20లో ఘోర ఓటమితో జట్టు యాజమాన్యం ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తుంది. వికెట్ కీపర్ సంజు శాంసన్ స్థానంలో జితేష్ శర్మకు ఛాన్స్ దక్కింది. ఆసియా కప్ నుంచి శాంసన్ బ్యాటింగ్ లో పెద్దగా ఆకట్టుకోలేకపోయాడు. మిడిల్ ఆర్డర్ లో వేగంగా పరుగులు చేయలేకపోతున్నాడు. దీంతో జితేష్ శర్మకు అవకాశం దక్కింది. జితేష్ ఆసియా కప్ నుంచి బెంచ్ మీదే ఉన్నాడు. ఒక్క మ్యాచ్ లోనూ ప్లేయింగ్ 11లో అవకాశం రాలేదు.
2026 వరల్డ్ కప్ ఉండడంతో జితేష్ కు ఛాన్స్ ఇవ్వాలని భావించి ఉంటారు. మరోవైపు హర్షిత్ రానా స్థానంలో వాషింగ్ టన్ సుందర్ కు తుది జట్టులో స్థానం దక్కించుకున్నాడు. లోయర్ ఆర్డర్ లో బ్యాటింగ్ డెప్త్ కోసం సుందర్ ను తీసుకున్నట్టు తెలుస్తుంది. సుందర్ బౌలింగ్ తో పాటు బ్యాటింగ్ కూడా చేయగలడు. పైగా ప్రస్తుతం సూపర్ ఫామ్ లో ఉన్నాడు. స్పెషలిస్ట్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ స్థానంలో ఫాస్ట్ బౌలర్ అర్షదీప్ సింగ్ కు చోటు దక్కింది. వరుణ్ చక్రవర్తి, అక్షర్ పటేల్, సుందర్ ఉండడంతో కుల్దీప్ ను పక్కన పెట్టినట్టు అర్ధమవుతుంది. ఈ మూడు నిర్ణయాలు ఎలాంటి ప్రభావం చూపిస్తాయో చూడాలి.
ఈ మ్యాచ్ విషయానికి వస్తే ఆదివారం (నవంబర్ 2) హోబర్ట్ వేదికగా బెల్లెరివ్ ఓవల్ లో జరుగుతున్న ఈ మ్యాచ్ లో టీమిండియా టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచ్ లో ఇండియా ఏకంగా మూడు మార్పులతో బరిలోకి దిగుతుంది. జితేష్ శర్మ, వాషింగ్ టన్ సుందర్, అర్షదీప్ సింగ్ ప్లేయింగ్ 11లో చోటు సంపాదించారు. సంజు శాంసన్, కుల్దీప్ యాదవ్, హర్షిత్ రానా బెంచ్ కే పరిమితమయ్యారు. మరోవైపు ఆస్ట్రేలియా ఒక మార్పుతో బరిలోకి దిగుతుంది. స్టార్ ఫాస్ట్ బౌలర్ హేజల్ వుడ్ స్థానంలో సీన్ అబాట్ తుది జట్టులోకి వచ్చాడు.
5 మ్యాచ్ ల టీ20 సిరీస్ లో భాగంగా ఇరు జట్ల మధ్య జరిగిన తొలి టీ20 మ్యాచ్ వర్షం కారణంగా రద్దయింది. శుక్రవారం (అక్టోబర్ 31) మెల్ బోర్న్ వేదికగా జరిగిన రెండో టీ20లో ఆస్ట్రేలియా 4 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించి 1-0 ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. సిరీస్ ఆశలు సజీవంగా ఉండాలంటే ఈ మ్యాచ్ లో టీమిండియా గెలిచి తీరాల్సిందే.
ఆస్ట్రేలియా (ప్లేయింగ్ XI):
మిచెల్ మార్ష్ (కెప్టెన్), ట్రావిస్ హెడ్, జోష్ ఇంగ్లిస్ (వికెట్ కీపర్), టిమ్ డేవిడ్, మిచెల్ ఓవెన్, మార్కస్ స్టోయినిస్, మాథ్యూ షార్ట్, సీన్ అబాట్, జేవియర్ బార్ట్‌లెట్, నాథన్ ఎల్లిస్, మాథ్యూ కుహ్నెమాన్
భారత్ (ప్లేయింగ్ XI):
శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మ, సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), తిలక్ వర్మ, జితేష్ శర్మ (వికెట్ కీపర్), శివమ్ దూబే, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్, అర్ష్‌దీప్ సింగ్, వరుణ్ చక్రవర్తి, జస్‌ప్రీత్ బుమ్రా
