Football World Cup: ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది ఎప్పుడెప్పుడా అని వేచి చూస్తున్న ఫిఫా వరల్డ్ కప్ 2026 జూన్ 11 నుంచి ప్రారంభం కావడానికి సర్వం సిద్ధమైంది. అమెరికా, కెనడా, మెక్సికో దేశాలు సంయుక్తంగా ఆతిథ్యం ఇస్తున్న ఈ మెగా టోర్నమెంట్‌లో ఈసారి రికార్డు స్థాయిలో 48 జట్లు ప్రతిష్టాత్మక ట్రోఫీ కోసం పోటీ పడనున్నాయి. ఫిఫా వరల్డ్ కప్‌కు ఇండియా ఎప్పుడు అర్హత సాధిస్తుంది? అనే ప్రశ్న ప్రతి భారతీయుడిలో మిగిలిపోయింది. కానీ ఈసారి భారత్ నేరుగా బరిలోకి దిగకపోయినా, మన దేశ మూలాలున్న (Indian-origin) ముగ్గురు ఆటగాళ్లు వేర్వేరు దేశాల తరఫున ఈ మెగా టోర్నీలో ఆడుతున్నారు.
తహ్సిన్ మహ్మద్ జంషీద్ (ఖతార్):
కేవలం 19 ఏళ్ల వయస్సులోనే ఖతార్ జాతీయ జట్టులో తహ్సిన్ మహ్మద్ జంషీద్ చోటు సంపాదించి సంచలనం సృష్టించాడు. దోహాలో జన్మించిన జంషీద్ తల్లిదండ్రులు 2006లో కేరళలోని కన్నూర్ నుంచి ఖతార్‌కు వలస వెళ్లారు. అక్కడి ప్రపంచ స్థాయి ఆస్పైర్ అకాడమీలో ఫుట్‌బాల్ నేర్చుకున్న జంషీద్, తన అద్భుతమైన నైపుణ్యాలతో ఖతార్ టాప్-లీగ్ (ఖతార్ స్టార్స్ లీగ్) లో ఆడిన తొలి భారతీయ సంతతి ప్లేయర్ గా రికార్డు సృష్టించాడు. ప్రస్తుతం ప్రముఖ క్లబ్ అల్ దుహైల్ ఎస్సీ తరపున ఆడుతున్నాడు. వరుసగా రెండుసార్లు ఏషియన్ కప్ గెలిచిన ఖతార్ సీనియర్ జట్టులో ఈ కేరళ కుర్రాడు చోటు దక్కించుకున్నాడు.
సర్‌ప్రీత్ సింగ్ (న్యూజిలాండ్):
భారతీయ మూలాలున్న ఫుట్‌బాల్ ఆటగాళ్ల గురించి మాట్లాడుకుంటే మొదటగా గుర్తొచ్చే పేరు సర్‌ప్రీత్ సింగ్.. ఈ 27 ఏళ్ల అటాకింగ్ మిడ్‌ఫీల్డర్ న్యూజిలాండ్‌లోని వెల్లింగ్టన్‌లో జన్మించినప్పటికీ, అతని తల్లిదండ్రులు పంజాబ్‌లోని జలంధర్‌కు చెందినవారు. 2019లో జర్మనీకి చెందిన ప్రసిద్ధ క్లబ్ 'బేయర్న్ మ్యూనిచ్' తరఫున ఆడి, జర్మన్ బుండెస్లిగా లీగ్‌లో ఆడిన మొదటి భారతీయ సంతతి ప్లేయర్ గా సర్‌ప్రీత్ ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్నాడు. ప్రస్తుతం తన చిన్ననాటి క్లబ్ 'వెల్లింగ్టన్ ఫీనిక్స్'కు ఆడుతున్నాడు. డిఫెండర్లను ముప్పుతిప్పలు పెట్టగల నైపుణ్యం కలిగిన సర్‌ప్రీత్, ఈ వరల్డ్ కప్‌లో న్యూజిలాండ్ కి వెన్నుముకగా మారే అవకాశం ఉంది.
నిషాన్ వేలుపిళ్లై (ఆస్ట్రేలియా):
ఆస్ట్రేలియా జట్టు (సాకరూస్) తరఫున వింగర్‌గా ఆడుతున్న 25 ఏళ్ల నిషాన్ వేలుపిళ్లై ప్రయాణం ఎంతో స్ఫూర్తిదాయకమైనది. మెల్‌బోర్న్‌లో జన్మించిన నిషాన్ తల్లి ఆంగ్లో-ఇండియన్ కాగా, తండ్రి శ్రీలంక తమిళ వంశానికి చెందిన మలేషియావాసి. ఆస్ట్రేలియన్ ఎ-లీగ్‌లో మెల్‌బోర్న్ విక్టరీ క్లబ్ తరఫున అద్భుతంగా రాణించిన ఇతని ప్రతిభను చూసి ఆస్ట్రేలియా హెడ్ కోచ్ టోనీ పోపోవిక్ అతనికి వరల్డ్ కప్ జట్టులో ఛాన్స్ ఇచ్చాడు. 2024 చివరలో చైనాతో జరిగిన కీలకమైన వరల్డ్ కప్ క్వాలిఫైయర్ మ్యాచ్‌లో సబ్‌స్టిట్యూట్‌గా అంతర్జాతీయ అరంగేట్రం చేసిన నిషాన్, మైదానంలోకి వచ్చిన కొద్ది నిమిషాల్లోనే విన్నింగ్ గోల్ కొట్టి ఆస్ట్రేలియాను వరల్డ్ కప్ రేసులో నిలిపాడు.
తృటిలో వరల్డ్ కప్ ఛాన్స్ కోల్పోయిన నైలు మేసన్:
జంషీద్, సర్‌ప్రీత్, నిషాన్ 2026 ఫిఫా వరల్డ్ కప్‌కు బ్యాగులు సర్దుకుంటుంటే.. భారతీయ మూలాలున్న మరొక ప్లేయర్ నైలు మేసన్ (29 ఏళ్లు) చివరి నిమిషంలో దురదృష్టవశాత్తూ ఈ అవకాశాన్ని మిస్ అయ్యాడు. ఇంగ్లాండ్‌లో జన్మించిన మేసన్ తల్లి భారతీయురాలు కాగా, తండ్రి అమెరికన్. ప్రస్తుతం ఖతార్ ఎస్సీ క్లబ్‌కు డిఫెండర్‌గా ఆడుతున్న మేసన్, మొదట ఖతార్ ప్రకటించిన 34 మంది ప్రాథమిక వరల్డ్ కప్ స్క్వాడ్‌లో స్థానం సంపాదించినప్పటికీ, టోర్నమెంట్‌కు ముందు రిలీజ్ చేసిన 26 మంది ఆటగాళ్ల జాబితాలో అతని పేరు లేకపోవడంతో తీవ్ర నిరాశకు గురయ్యాడు.
