న్యూఢిల్లీ: ఇరాన్ యుద్ధం, విమాన ప్రయాణాలకు ఏర్పడిన అడ్డంకులు భారతదేశపు 'మెడికల్ టూరిజం' రంగంపై తీవ్ర ప్రభావాన్ని చూపుతున్నాయి. ఈ ఏడాది ప్రారంభంలోని స్థాయిలతో పోలిస్తే, ప్రస్తుతం విదేశీ రోగుల రాక ఇంకా తక్కువగానే ఉంది. మెడికల్ టూరిజం సెక్టార్ సైజ్ దాదాపు 9 బిలియన్ డాలర్లు (సుమారు రూ.86 వేల కోట్లు) గా ఉంది. మిడిల్ ఈస్ట్ దేశాల నుంచి ఎక్కువ మంది ట్రీట్‌మెంట్ కోసం ఇండియాకు వస్తున్నారు.
కార్పొరేట్ ఆసుపత్రులపై ప్రభావం..
ఫోర్టిస్ హెల్త్‌కేర్ : తమ అంతర్జాతీయ వ్యాపారంలో పశ్చిమాసియా వాటా 30శాతం వరకు ఉంటుందని ఫోర్టిస్ తెలిపింది. ఫిబ్రవరి 2026 చివరలో యుద్ధం మొదలవ్వడం, విమానాల రద్దు, వీసా అనిశ్చితి, భద్రతా కారణాల వల్ల కొత్త రోగుల రాక తగ్గిందని పేర్కొంది. ప్రారంభంలో అంతర్జాతీయ రోగుల సంఖ్య 30శాతం తగ్గగా, మార్చిలో పశ్చిమాసియా నుంచి రోగుల రాక బాగా క్షీణించింది. ఏప్రిల్, మే లో
పరిస్థితి కొద్దిగా మెరుగయింది.
హెచ్‌సీజీ : గతేడాది ఇదే కాలంతో పోలిస్తే, ఈ ఏడాది మార్చి– మేలో పశ్చిమాసియా దేశాల నుంచి వచ్చే రోగుల సంఖ్య 60–70 శాతం వరకు పడిపోయిందని హెల్త్‌కేర్ గ్లోబల్ (హెచ్‌సీజీ) పేర్కొంది. ఏప్రిల్ నుంచి స్వల్ప రికవరీ కనిపిస్తున్నా, ఫిబ్రవరి 2026 కి ముందున్న స్థాయి కంటే తక్కువగానే ఉందని తెలిపింది.
అపోలో హాస్పిటల్స్: మిడిల్ ఈస్ట్ నుంచి రోగుల రాకపై ప్రభావం ప్రస్తుతానికి పరిమితంగానే ఉందని అపోలో తెలిపింది. అయితే, ఈ ఉద్రిక్తతలు ఇలాగే కొనసాగితే రోగుల సంఖ్య కంటే కూడా ద్రవ్యోల్బణం, కరెన్సీ హెచ్చుతగ్గుల వల్ల హెల్త్‌కేర్ ఆపరేటర్ల 'ఖర్చుల భారం' పెరుగుతుందని వివరించింది.
