IND vs ENG 4th Test: అశ్విన్, కుల్దీప్ విజృంభణ.. భారత్ ముందు స్వల్ప లక్ష్యం

IND vs ENG 4th Test: అశ్విన్, కుల్దీప్ విజృంభణ.. భారత్ ముందు స్వల్ప లక్ష్యం

రాంచీ టెస్టులో భారత బౌలర్లు ఇంగ్లాండ్ ను తిప్పేశారు. మన స్పిన్నర్ల ధాటికి కేవలం 145 పరుగులకే కుప్పకూలారు. దీంతో రోహిత్ సేన  ముందు 192 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని ఉంచింది. భారత స్పిన్ త్రయం అశ్విన్, కుల్దీప్ యాదవ్, జడేజా ధాటికి వరుస పెట్టి పెవిలియన్ కు చేరారు. ఒక దశలో 3 వికెట్లకు 100 పరుగులతో పటిష్ట స్థితిలో నిలిచిన ఇంగ్లాండ్.. తమ చివరి 7 వికెట్లను 35 పరుగుల వ్యవధిలో కోల్పోయింది. 60 పరుగులు చేసిన క్రాలి టాప్ స్కోరర్ గా నిలిచాడు. 

బెయిర్ స్టో 30 పరుగులతో పర్వాలేదనిపించగా.. మిగిలిన వారందరూ విఫలమయ్యారు. భారత బౌలర్లలో అశ్విన్ మరోసారి 5 వికెట్లను తన ఖాతాలో వేసుకున్నాడు. కుల్దీప్ యాదవ్ నాలుగు వికెట్లు పడగొట్టగా.. జడేజాకు ఒక వికెట్ దక్కింది. 5 వికెట్లను 121 పరుగులతో మూడో సెషన్ ప్రారంభించిన ఇంగ్లాండ్.. గంట వ్యవధిలో 23 పరుగులు చేసి తమ చివరి 5 వికెట్లను కోల్పోయారు. స్పిన్నర్ల ధాటికి ఏ ఒక్క ఇంగ్లీష్ బ్యాటర్ క్రీజ్ లో నిలవలేకపోయాడు. 

అంతకముందు జురెల్ ఒంటరి పోరాటం చేస్తూ టీమిండియాను మ్యాచ్ లో నిలబెట్టాడు. టెయిలండర్ల సహకారంతో కీలకమైన 90 పరుగులు చేసి ఇంగ్లాండ్ బౌలర్లను సమర్ధవంతంగా అడ్డుకున్నాడు. జురెల్ ఆటతో భారత్ తమ తొలి ఇన్నింగ్స్ లో 307 పరుగులకు ఆలౌటైంది. కుల్దీప్ యాదవ్ (28) ఆకాష్ దీప్ (3) అతనికి చక్కని సహకారం అందించారు. దీంతో ఇంగ్లాండ్ కు తొలి ఇన్నింగ్స్ లో 46 పరుగుల ఆధిక్యం లభించింది.    

లక్ష్య ఛేదనలో భారత్ మూడో రోజు ఆట ముగిసే సమయానికి వికెట్లేమీ కోల్పోకుండా 40 పరుగులు చేసింది. ఆరంభం నుంచే దూకుడుగా ఆడుతూ విజయానికి చేరువైంది. టీమిండియా విజయానికి మరో 152 పరుగులు కావాల్సి ఉంది. క్రీజ్ లో రోహిత్ శర్మ (24), జైశ్వాల్ (16) ఉన్నారు.