IND vs ENG 2025: జడేజా అసాధారణ పోరాటం: టీమిండియాకు 30 పరుగులు.. ఇంగ్లాండ్‌కు ఒక్క వికెట్

IND vs ENG 2025: జడేజా అసాధారణ పోరాటం: టీమిండియాకు 30 పరుగులు.. ఇంగ్లాండ్‌కు ఒక్క వికెట్

ఇంగ్లాండ్, ఇండియా మధ్య జరుగుతున్న లార్డ్స్ టెస్ట్ ఇంకా సస్పెన్స్ లోనే ఉంది. జడేజా అసాధారణంగా పోరాడడంతో మ్యాచ్ చివరి రోజు చివరి సెషన్ వరకు వెళ్ళింది. ఐదో రోజు టీ విరామ సమయానికి ఇండియా 70 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 163 పరుగులు చేసింది. క్రీజ్ లో జడేజా (56), సిరాజ్ (2) ఉన్నాడు. చివరి సెషన్ లో టీమిండియా విజయానికి మరో 30 పరుగులు కావాలి. మరోవైపు ఇంగ్లాండ్ ఒక వికెట్ తీస్తే మ్యాచ్ గెలుస్తుంది. దీంతో చివరి సెషన్ ఆసక్తికరంగా మారింది.  

8 వికెట్ల నష్టానికి 112 పరుగులతో లంచ్ తర్వాత బ్యాటింగ్ ప్రారంభించిన టీమిండియాను జడేజా, బుమ్రా భాగస్వామ్యం నిలబెట్టింది. వీరిద్దరూ దాదాపు 21 ఓవరాల్ పాటు ఇంగ్లాండ్ బౌలర్ల సహనాన్ని పరీక్షించి 35 పరుగుల విలువైన పరుగులు జోడించారు. జట్టు విజయానికి 46 పరుగులు కావాల్సిన దశలో స్టోక్స్ బౌలింగ్ లో పుల్ షాట్ కు ప్రయత్నించి బుమ్రా ఔటయ్యాడు. దీంతో భారత జట్టు 9 వికెట్ కోల్పోయింది. ఈ దశలో సిరాజ్ తో కలిసి జడేజా క్రీజ్ లో పాతుకుపోయాడు. 

అద్భుతమైన పోరాటం కొనసాగిస్తూ చివరి వికెట్ కు సిరాజ్ తో కలిసి అజేయంగా 51 బంతుల్లో 16 పరుగులను జోడించాడు. ఈ క్రమంలో జడేజా తన హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. తొలి ఇన్నింగ్స్ లో ఇంగ్లాండ్ 387 పరుగులు చేయగా.. ఆతర్వాత ఇండియా కూడా సరిగ్గా 387 పరుగులు చేసింది. ఇంగ్లాండ్ రెండో ఇన్నింగ్స్ లో 192 పరుగులకే ఆలౌట్ అయింది.