IND vs ENG 2025: జడేజా పైనే భారం.. లార్డ్స్ టెస్టులో ఓటమి దిశగా టీమిండియా

IND vs ENG 2025: జడేజా పైనే భారం.. లార్డ్స్ టెస్టులో ఓటమి దిశగా టీమిండియా

ఇంగ్లాండ్ తో లార్డ్స్ వేదికగా జరుగుతోన్న మూడో టెస్టులో టీమిండియా పీకల్లోతు కష్టాల్లో పడింది. 193 పరుగుల స్వల్ప లక్ష్య ఛేదనలో ఓటమి దిశగా పయనిస్తోంది. రాహుల్ మినహా మిగిలిన బ్యాటర్లు చేతులెత్తేసినా జడేజా, నితీష్ స్వల్ప భాగస్వామ్యంతో టీమిండియా ఆశలు పెట్టుకుంది. అయితే లంచ్ కు ముందు నితీష్ (13) ఔట్ కావడంతో మ్యాచ్ ఇంగ్లాండ్ చేతుల్లోకి వెళ్ళింది. ఐదో రోజు లంచ్ సమయానికి టీమిండియా 8 వికెట్ల నష్టానికి 112 పరుగులు చేసింది. క్రీజ్ లో జడేజా (17) ఉన్నాడు. టీమిండియా గెలవాలంటే మరో 81 పరుగులు చేయాలి. మరోవైపు ఇంగ్లాండ్ విజయానికి రెండు వికెట్లు కావాలి. 

4 వికెట్ల నష్టానికి 58 పరుగులతో ఐదో రోజు ఆట ప్రారంభించిన టీమిండియాకు వరుస షాక్ లు తగిలాయి. తొలి గంట లోపే మూడు కీలక వికెట్లు కోల్పోయి ఓటమి అంచుల్లో నిలిచింది. మొదట పంత్ (9) ఔట్ కాగా.. ఆ తర్వాత వరుసగా రాహుల్, సుందర్ పెవిలియన్ కు క్యూ కట్టారు. 21 ఓవర్ ఐదో బంతికి ఆర్చర్ ఇన్ స్వింగ్ తో పంత్ ను ఔట్ చేశాడు. ఆ కాసేపటికే స్టోక్స్ ఒక అద్భుతమైన ఇన్ స్వింగ్ డెలివరీతో రాహుల్ (39) ను ఔట్ చేయగా.. ఆర్చర్ బౌలింగ్ లో సుందర్ (0) రిటర్న్ క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. దీంతో 83 పరుగులకే టీమిండియా 7 వికెట్లు కోల్పోయి ఓటమి దిశగా పయనించింది.   

ఈ దశలో జడేజా, సుందర్ కలిసి 15 ఓవర్ల పాటు ఇంగ్లాండ్ బౌలర్లను సమర్ధవంతంగా ఎదుర్కొని 30 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. అయితే లంచ్ కు ముందు వోక్స్ టీమిండియాకు ఊహించని షాక్ ఇచ్చాడు. నితీష్ ను ఔట్ చేసి ఇంగ్లాండ్ విజయాన్ని దాదాపు ఖాయం చేశాడు. జడేజా అద్బుతంగా చేస్తే తప్ప ఈ మ్యాచ్ లో టీమిండియా ఓటమి ఖాయంగా మారింది. ఇంగ్లాండ్ బౌలర్లలో ఆర్చర్ మూడు వికెట్లు పడగొట్టాడు. స్టోక్స్, కార్స్ తలో రెండు వికెట్లు తీసుకున్నారు. వోక్స్ కు ఒక వికెట్ దక్కింది. తొలి ఇన్నింగ్స్ లో ఇంగ్లాండ్ 387 పరుగులు చేయగా.. ఆతర్వాత ఇండియా కూడా సరిగ్గా 387 పరుగులు చేసింది. ఇంగ్లాండ్ రెండో ఇన్నింగ్స్ లో 192 పరుగులకే ఆలౌట్ అయింది.