‘కాశ్మీర్​’పై జోక్యానికి నో: సుప్రీంకోర్టు

‘కాశ్మీర్​’పై జోక్యానికి నో: సుప్రీంకోర్టు

న్యూఢిల్లీ: ఆర్టికల్​ 370 రద్దు, రాష్ట్రవిభజన  తర్వాత  జమ్మూకాశ్మీర్​లో విధించిన ఆంక్షల్ని  ఎత్తేసేలా ఇప్పటికిప్పుడే ఆదేశాలు ఇవ్వబోమని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ప్రజలకు స్వేచ్ఛా హక్కు ఎంత ప్రధానమైందో,  వాళ్ల ప్రాణాలు కాపాడటం ప్రభుత్వానికీ అంతే ముఖ్యమని, సెన్సిటివ్​ ఇష్యూని డీల్​ చేయడంలో సర్కారుకు కొంత టైమివ్వాల్సిందేనని పేర్కొంది. జమ్మూకాశ్మీర్​లో ఆంక్షల్ని రద్దుచేసేలా ఆదేశాలివ్వాలన్న కాంగ్రెస్​ నేత తనీశ్​ పూనావాలా పిటిషన్​ను జస్టిస్​ అరుణ్​ మిశ్రా బెంచ్ మంగళవారం విచారించింది. ప్రస్తుతం అమల్లో ఉన్న  ఆంక్షల వల్ల ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని నిర్ధారించుకున్న జడ్జిలు.. కాశ్మీర్​లో సాధారణ పరిస్థితులు తిరిగొచ్చేదాకా వేచిచూద్దామంటూ విచారణను రెండు వారాలకు వాయిదా వేశారు. ప్రభుత్వం తరఫున అటార్నీ జనరల్(ఏజీ)​ కేకే వేణుగోపాల్​, పిటిషనర్​ తరఫున సీనియర్​ లాయర్​ మేనకా గురుస్వామి వాదనలు వినిపించారు.

అనుకోనిది జరిగితే కేంద్రానిదే బాధ్యత

కాశ్మీర్​పై కేంద్రం ప్రతిరోజూ రివ్యూలు చేస్తున్నదని, జిల్లా కలెక్టర్ల నుంచి అందిన రిపోర్టుల ఆధారంగా ఆయా ప్రాంతాల్లో ఆంక్షల్ని సడలిస్తోన్నదని ఏజీ వేణుగోపాల్​ కోర్టుకు చెప్పారు. 2016లో టెర్రరిస్టు బుర్హాన్​ వనీ ఎన్​కౌంటర్​ తర్వాత వ్యాలీలో మూడు నెలల పాటు ఆందోళనలు కొనసాగాయని, 1990 నుంచి ఇప్పటిదాకా 44వేల మంది టెర్రరిజానికి బలయ్యారని బెంచ్​కు గుర్తుచేసిన ఏజీ వేణుగోపాల్​.. కాశ్మీర్​లో శాంతి భద్రతల నిర్వహణపై ప్రభుత్వానికి స్పష్టమైన నిర్ధారణ అవసరమని చెప్పుకొచ్చారు. ఈ సందర్భంగా జడ్జిలు జోక్యం చేసుకుంటూ.. ‘‘నిజంగా అక్కడేం జరుగుతోందో ఎవరికీ తెలియట్లేదు. ఎప్పటికప్పుడు రివ్యూ చేస్తున్నామని ప్రభుత్వం చెబుతున్నది. రేపేదైనా అనుకోనిది జరిగితే కేంద్ర ప్రభుత్వమే బాధ్యత వహించాల్సిఉంటుంది. కాబట్టి సాధారణ పరిస్థితులు నెలకొనేలా ప్రభుత్వానికి కొంత సమయం ఇవ్వాలి”అని కామెంట్​ చేశారు. ఆంక్షల వల్ల కమ్యూనికేషన్ కట్​ అయిందని, కాశ్మీర్​లో డ్యూటీ చేస్తున్న జవాన్లు తమ ఫ్యామిలీతో మాట్లాడలేకపోతున్నారని పిటిషనర్​ తరఫు లాయర్​ మేనక గోస్వామి కోర్టు దృష్టికి తీసుకురాగా, ఆమెపై జడ్జిలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘‘జవాన్ల గురించి మీకెందుకు? నిర్దిష్టమైన సమస్య ఏదైనా ఉంటే చెప్పండి, దాన్ని పరిష్కరించేలా ప్రభుత్వానికి ఆదేశాలిస్తాం. అంతేగానీ ఆంక్షల్ని పూర్తిగా ఎత్తేయడం కుదరదు’’అని బెంచ్‌‌ స్పష్టం చేసింది.

మీడియాపై ఆంక్షలొద్దు

370 రద్దు, విభజన తర్వాత జమ్మూకాశ్మీర్​లో గ్రౌండ్​ రియాలిటీ ఎలా ఉందో తెల్సుకోవాల్సిన అవసరం ఉందని, ప్రస్తుతం మీడియాపై కొనసాగుతున్న ఆంక్షల్ని వెంటనే ఎత్తేసేలా ఆదేశాలు జారీచేయాలని కోరుతూ ‘కాశ్మీర్​ టైమ్స్’​ ఎడిటర్ అనురాధా భాసిన్​ మంగళవారం సుప్రీంకోర్టులో పిటిషన్​ వేశారు. దీన్ని అర్జంట్​గా విచారించలేమన్న జడ్జిలు.. సంబంధిత మెమోను కోర్టు రిజిస్ట్రార్​కు అందజేయాలని పిటిషనర్​ను ఆదేశించారు. వీలైనంత త్వరగా ఈ అంశాన్ని పరిశీలిస్తామని తెలిపారు.