పీవోకేలో బ్రిటిష్ హైకమిషనర్ టూర్.. అభ్యంతరం తెలిపిన భారత్

పీవోకేలో బ్రిటిష్ హైకమిషనర్ టూర్.. అభ్యంతరం తెలిపిన భారత్

న్యూఢిల్లీ: ఇస్లామాబాద్​లోని బ్రిటిష్ హైకమిషనర్ జేన్ మారియట్ బుధవారం పాక్ ఆక్రమిత కాశ్మీర్ (పీవోకే)లోని మీర్ పూర్ లో అధికారికంగా పర్యటించడంపై భారత విదేశాంగ శాఖ తీవ్ర నిరసన వ్యక్తం చేసింది. ఇది భారత భూభాగ సమగ్రతను, సార్వభౌమత్వాన్ని ఉల్లంఘించడమేనని స్పష్టం చేసింది. జమ్మూకాశ్మీర్ ఇండియాలో భాగమని, ఎప్పటికీ భారత్ లో అంతర్భాగంగానే ఉంటుందని తేల్చిచెప్పింది. జేన్ మారియట్ బుధవారం బ్రిటన్ విదేశాంగ శాఖ అధికారితో కలిసి అధికారికంగా మీర్ పూర్ లో పర్యటించారు.

70 శాతం మంది బ్రిటిష్​పాకిస్తానీ ప్రజల మూలాలు ఇక్కడే ఉన్నాయని, ఈ గడ్డపై తనకు అద్భుత ఆతిథ్యం ఇచ్చిన స్థానిక ప్రజలకు ధన్యవాదాలు అంటూ ఆమె ట్వీట్ చేశారు. పాకిస్తాన్ హైకమిషన్ కూడా జేన్ పర్యటనకు సంబంధించిన వీడియోను ట్వీట్ చేసింది. ఈ నేపథ్యంలో జేన్ మారియట్ పర్యటన పట్ల శనివారం భారత విదేశాంగ శాఖ ఢిల్లీలోని బ్రిటిష్ హైకమిషనర్ కు అభ్యంతరం తెలిపింది. నిరుడు అక్టోబర్ లో అమెరికన్ అంబాసిడర్ డొనాల్డ్ బ్లూమ్ కూడా పీవోకేలోని గిల్గిట్ బాల్టిస్తాన్ లో పర్యటించగా, భారత్ తప్పుపట్టింది. కాగా, జమ్మూకాశ్మీర్, లడఖ్ తోపాటు పీవోకే కూడా భారత్ లో అంతర్భాగమేనని అంతర్జాతీయ వేదికలపై కేంద్రం తరచూ స్పష్టం చేస్తోంది. జమ్మూకాశ్మీర్ అసెంబ్లీలో 24 సీట్లను పీవోకేకు రిజర్వ్ చేసి ఉంచామని కేంద్ర హోంమంత్రి అమిత్ షా గత డిసెంబర్​లో పార్లమెంట్ లోనే ప్రకటించారు. పీవోకే భారత్​లో భాగమేనని తేల్చిచెప్పారు.