న్యూఢిల్లీ: భారత ఫార్మా, హెల్త్‌కేర్ రంగం ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మార్చి క్వార్టర్లో ఆశించిన స్థాయిలో ఉండకపోవచ్చని హెచ్డీఎఫ్సీ సెక్యూరిటీస్ రిపోర్ట్ వెల్లడించింది. దీని ప్రకారం..ఈసారి అమ్మకాలు 10 శాతం పెరగవచ్చు. దేశీయ వ్యాపారం 15 శాతం వరకు వృద్ధి చెందే అవకాశం ఉంది. అమెరికా మార్కెట్లో ధరల తగ్గింపు వల్ల కొంత ఒత్తిడి ఎదురవుతోంది. గ్రెవ్లిమిడ్ మందుల విక్రయాలు నిలిచిపోవడం వల్ల యూఎస్ ఫార్ములేషన్స్ ఆదాయం సుమారు 5 శాతం తగ్గే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు.
మన దేశ ఫార్మా మార్కెట్‌కు క్రానిక్, స్పెషాలిటీ పోర్ట్‌ఫోలియో మందులు కీలకం. 2026 సంవత్సరం జనవరి, ఫిబ్రవరిలో క్రానిక్ సెగ్మెంట్ 16 శాతం వృద్ధి సాధించింది. దేశీయంగా స్పెషాలిటీ మందుల అమ్మకాలు పెరగడం వల్ల కంపెనీల ఆదాయం మెరుగుపడుతోంది. ముడి పదార్థాల ఖర్చులు పెరగడం, పరిశోధన అభివృద్ధి (ఆర్ అండ్ డీ) కోసం భారీగా వెచ్చించాల్సి రావడం వల్ల ఇబిటా మార్జిన్లపై ప్రతికూల ప్రభావం పడుతోంది. అమెరికా మార్కెట్లో పోటీ కూడా లాభదాయకతను దెబ్బతీసే అవకాశాలు ఉన్నాయి. అక్యూట్ విభాగం సుమారు 9 శాతం వృద్ధి సాధించింది.
డయాగ్నోస్టిక్స్ విభాగం బెటర్
హెల్త్‌కేర్ విభాగంలో ఆస్పత్రుల ఆదాయం 15 శాతం వృద్ధి సాధించే అవకాశం ఉంది. ఆస్పత్రుల్లో రోగుల సంఖ్య పెరగడం బెడ్ల సామర్థ్యాన్ని పెంచుకోవడం వల్ల ఈ వృద్ధి సాధ్యపడవచ్చు. డయాగ్నోస్టిక్స్, రిటైల్ ఫార్మసీ రంగాలు కూడా మెరుగైన ఫలితాలు ఇచ్చే దిశగా ఉన్నాయి. ఈ విభాగాల్లో 15 నుంచి 20 శాతం మధ్య ఆదాయ వృద్ధి కనిపించవచ్చు. ముఖ్యంగా మెడ్ ప్లస్, అపోలో హెల్త్ కో వంటి సంస్థలు బలంగా పుంజుకుంటున్నాయి. ఆస్పత్రుల్లో సగటు ఆదాయం పెరగడం, కొత్త బెడ్లు రావడం ఈ రంగానికి కలిసొచ్చే అంశాలుగా ఉన్నాయి.
ఆర్ అండ్ డీ ఖర్చులతోపాటు విక్రయాలు సాధారణ నిర్వహణ ఖర్చులు పెరగడం వల్ల ఫార్మా కంపెనీల మార్జిన్లు కొంత తగ్గే సూచనలు ఉన్నాయి. అంతర్జాతీయ మార్కెట్లో నెలకొన్న అనిశ్చితి వల్ల గ్లోబల్ బిజినెస్ కొంత మందగించినా, దేశీయ మార్కెట్ బలంగా ఉండటం ఊరటను ఇస్తోంది. ఇన్పుట్ ఖర్చులు పెరగడం ధరల కోత వంటి సవాళ్లు ఉన్నప్పటికీ కంపెనీలు తమ వ్యూహాలతో ఆదాయాన్ని పెంచుకోవడానికి ప్రయత్నిస్తున్నాయని హెచ్డీఎఫ్సీ సెక్యూరిటీస్ రిపోర్ట్ వెల్లడించింది.
