Cricket World Cup 2023: సెమీ ఫైనల్స్ ఆడే భారత జట్టు ఇదే..ఆ నలుగురికి ఛాన్స్ వస్తుందా..?

Cricket World Cup 2023: సెమీ ఫైనల్స్ ఆడే భారత జట్టు ఇదే..ఆ నలుగురికి ఛాన్స్ వస్తుందా..?

వరల్డ్ కప్ లో టీమిండియా తమ జైత్రయాత్ర కొనసాగిస్తోంది. లీగ్ దశలో ఆడిన 9 మ్యాచ్ ల్లో విజయం సాధించిన రోహిత్ సేన ప్రస్తుతం సెమీ ఫైనల్ సమరానికి సిద్ధమవుతుంది. నవంబర్ 15 న న్యూజిలాండ్ తో జరగనున్న ఈ మ్యాచ్ లో భారత్ హాట్ ఫేవరేట్ గా బరిలోకి దిగుతుంది. సొంతగడ్డపై ఆడుతుండడం టీమిండియాకు కలిసొచ్చే అంశం. ముంబైలోని వాంఖడే స్టేడియం ఈ మ్యాచ్ కు వేదిక కానుంది. ఈ నేపథ్యంలో ఈ మ్యాచ్ లో భారత్ ఆడే తుది జట్టు ఎలా ఉండబోతుందో ఒకసారి చూద్దాం.   
 
నెదర్లాండ్స్ తో నిన్న(నవంబర్ 12) జరిగిన చివరి లీగ్ మ్యాచ్ లో భారత్ జట్టు ప్రయోగాలేమి చేయలేదు. నెదర్లాండ్స్ పసికూన జట్టే అయినా ఎలాంటి ఛాన్స్ తీసుకోలేదు. దీంతో వరల్డ్ కప్ సెమీ ఫైనల్ కు కూడా దాదాపు ఇదే జట్టుతో బరిలోకి దిగుతుంది. ఎవరైనా గాయపడితే తుది జట్టులో మార్పులు చోటు చేసుకుంటాయి. రోహిత్, గిల్ ఓపెనర్లుగా అదరగొడుతుంటే కోహ్లీ, అయ్యర్, రాహుల్ సూపర్ ఫామ్ లో ఉన్నారు. సూర్య కుమార్ యాదవ్ గాడిలో పడితే భారత్ కు తిరుగుండదు.

బౌలర్లు సిరాజ్, బుమ్రా, షమీ స్థానాలకు ఎలాంటి ముప్పు లేదు. ఆల్ రౌండర్ గా జడేజా జట్టులో కొనసాగటం ఖాయం. ప్రధాన స్పిన్నర్ గా కుల్దీప్ తుది జట్టులో ఉంటాడు. సెమీ ఫైనల్ లాంటి కీలక మ్యాచ్ లో భారత్ ఎలాంటి ప్రయోగాలకు చేయదని స్పష్టం అవుతుంది. దీంతో అశ్విన్, శార్దూల ఠాకూర్, ఇషాన్ కిషాన్, ప్రసిద్ కృష్ణ బెంచ్ కే పరిమితమవ్వక తప్పదు. మరోవైపు న్యూజిలాండ్ ఈ మ్యాచ్ లో ఎలాంటి మార్పులు చేస్తుందో చూడాలి.      
         
భారత్ తుది జట్టు:

రోహిత్ శర్మ(కెప్టెన్), శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్, కేఎల్ రాహుల్(వికెట్ కీపర్), సూర్యకుమార్ యాదవ్, రవీంద్ర జడేజా, మహ్మద్ షమీ, జస్ప్రీత్ బుమ్రా, కుల్దీప్ యాదవ్, మహ్మద్ సిరాజ్