న్యూఢిల్లీ: ఏఐ, సెమీకండక్టర్ షేర్లు భారీగా పడుతుండడంతో మార్కెట్ క్యాప్‌లో తైవాన్, దక్షిణ కొరియాలను ఇండియా వెనక్కి నెట్టింది. ప్రపంచంలోనే అత్యధిక మార్కెట్ విలువ కలిగిన ఐదవ అతిపెద్ద దేశంగా మళ్లీ తన స్థానాన్ని దక్కించుకుంది. ప్రస్తుతం మార్కెట్ క్యాప్ రేసులో మనకంటే ముందు అమెరికా, చైనా, జపాన్, హాంగ్‌కాంగ్‌లు ఉన్నాయి. ప్రస్తుత భారత్ స్టాక్‌మార్కెట్ మొత్తం మార్కెట్ క్యాపిటలైజేషన్ 5.05 ట్రిలియన్ డాలర్లకు చేరుకుంది. తైవాన్ (4.97 ట్రిలియన్ డాలర్ల) మార్కెట్ ఆరో స్థానానికి, దక్షిణ కొరియా(4.66 ట్రిలియన్ డాలర్ల) ఏడో స్థానానికి పరిమితమయ్యాయి.
ఆసియా మార్కెట్ల పతనానికి కారణాలు..
అంతర్జాతీయ మార్కెట్లలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ), సెమీకండక్టర్ రంగానికి చెందిన షేర్లు భారీగా పెరగడంతో తైవాన్, దక్షిణ కొరియా మార్కెట్‌లు ఇటీవల దూసుకుపోయాయి. అయితే, గత కొన్ని సెషన్లుగా ఏఐ కంపెనీల షేర్లలో ప్రాఫిట్ బుకింగ్ జరుగుతుండడంతో ఈ రెండు దేశాల మార్కెట్లు భారీగా నష్టపోతున్నాయి. ముఖ్యంగా దక్షిణ కొరియా ప్రధాన ఇండెక్స్ 'కోస్పి' గడిచిన శుక్రవారం ఏకంగా 9శాతం పతనమైంది. మార్కెట్ కుప్పకూలడంతో కొరియా ఎక్స్ఛేంజ్ 20 నిమిషాల పాటు ట్రేడింగ్‌ను నిలిపివేస్తూ 'సర్క్యూట్ బ్రేకర్'ను కూడా యాక్టివేట్ చేయాల్సి వచ్చింది. మరోవైపు భారత్ మార్కెట్ మాత్రం అంతర్జాతీయంగా బలహీన సంకేతాలు ఉన్నప్పటికీ నిలకడగా ఉంది. ఇన్వెస్టర్ల సానుకూల సెంటిమెంట్, కీలక రంగాలలో కొనుగోళ్ల మద్దతుతో దేశీయ సూచీలు గత నెల రోజుల్లో 2 శాతం మేర లాభపడ్డాయి.
