భారీగా పెరిగిన కరోనా కేసులు.. 63 రోజుల తర్వాత హయ్యెస్ట్

భారీగా పెరిగిన కరోనా కేసులు.. 63 రోజుల తర్వాత హయ్యెస్ట్

భారత్‌లో మళ్లీ కరోనా కేసులు భారీగా పెరుగుతున్నాయి. గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా 47,092 కొత్త కేసులు నమోదయ్యాయని కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. దీంతో దేశంలో ఇప్పటి వరకు నమోదైన మొత్తం కేసుల సంఖ్య 3,28,57,937కు చేరింది. నిన్న ఒక్క రోజులో 509 మంది కరోనాతో ప్రాణాలు కోల్పోయారు. దేశంలో మొత్తం కరోనా మరణాల సంఖ్య 4,39,529కి పెరిగింది. అయితే దేశ రికవరీ రేటు 97.48 శాతంగా ఉంది. గడిచిన 24 గంటల్లో 35,181 మంది కరోనా నుంచి కోలుకున్నారు. దీంతో మొత్తంగా రికవరీ అయిన వాళ్ల సంఖ్య 3,20,28,825కు పెరింది. అయితే గడిచిన 24 గంటల్లో యాక్టివ్ కేసుల లోడ్ 11,402 పెరిగి, మొత్తం యాక్టివ్ కేసులు సంఖ్య 3,89,583కి చేరింది.

ఒక్క రోజులో 5,127 కేసులు జంప్

గడిచిన 24 గంటల్లో (గురువారం) నమోదైన కరోనా కేసుల సంఖ్య 47,092గా ఉండగా.. ముందు రోజు (బుధవారం) 41,965 కేసులు నమోదయ్యాయి. దీంతో ఒక్క రోజులోనే 5,127 కేసులు పెరిగాయి. ఇక గురువారం నమోదైన కేసులు గడిచిన రెండు నెలల్లో హయ్యెస్ట్. 63 రోజుల క్రితం జులై 1వ తేదీన 48,786 కరోనా కేసులు నమోదు కాగా, ఆ తర్వాత మళ్లీ ఇప్పుడే అత్యధిక కేసులు నమోదయ్యాయి.

కేరళలో అత్యధిక కేసులు

గడిచిన కొద్దిరోజులుగా దేశం మొత్తంలో నమోదవుతున్న కేసుల్లో సగానికి పైగా ఒక్క కేరళ రాష్ట్రంలోనే ఉంటున్నాయి. నిన్న కేరళలో 32,803 కేసులు నమోదు కాగా, ఆ తర్వాత మహారాష్ట్రలో 4,456 కేసులు, మిజోరంలో 1992, తమిళనాడులో 1509, ఏపీలో 1186 కేసులు నమోదయ్యాయి. దేశంలో కరోనా కేసుల లోడ్‌లో 89 శాతం పైగా ఐదు రాష్ట్రాల నుంచే ఉంది. నిన్న వచ్చిన కొత్త కేసుల్లో కేరళ కేసులు 69.66 శాతం ఉన్నాయి.