IND vs NZ: సాంట్నర్, రవీంద్ర మెరుపులు.. టీమిండియా ముందు ఛాలెంజింగ్ టార్గెట్

IND vs NZ: సాంట్నర్, రవీంద్ర మెరుపులు.. టీమిండియా ముందు ఛాలెంజింగ్ టార్గెట్

న్యూజిలాండ్ తో జరుగుతున్న రెండో టీ20లో టీమిండియా బౌలర్లు విఫలమయ్యారు. శుక్రవారం (జనవరి 23) రాయ్‌పూర్ వేదికగా షహీద్ వీర్ నారాయణ్ సింగ్ అంతర్జాతీయ స్టేడియంలో జరుగుతున్న ఈ మ్యాచ్ లో ప్రత్యర్థి న్యూజిలాండ్ జట్టు భారీ స్కోర్ చేసింది. రచీన్ రవీంద్ర (44), కెప్టెన్ సాంట్నర్ (47) మెరుపులకు తోడు మిగిలిన బ్యాటర్లు తలో చేయి వేయడంతో నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 208 పరుగులు చేసింది. సాంట్నర్ 47 పరుగులు చేసి టాప్ స్కోరర్ గా నిలిచాడు. టీమిండియా బౌలర్లలో కుల్దీప్ యాదవ్ రెండు వికెట్లు తీసుకున్నాడు. పాండ్య, రానా, దూబే, వరుణ్ చక్రవర్తి తలో వికెట్ పడగొట్టారు.     

టాస్ ఓడి మొదట బ్యాటింగ్ కు దిగిన న్యూజిలాండ్ కు ఓపెనర్లు అదిరిపోయే ఆరంభం ఇచ్చారు. అర్షదీప్ సింగ్ వేసిన తొలి ఓవర్లోనే మూడు ఫోర్లు, ఒక సిక్సర్ తో కాన్వే 18 పరుగులు రాబట్టాడు. ఆ తర్వాత అర్షదీప్ వేసిన ఇన్నింగ్స్ మూడో ఓవర్లో సీఫెర్ట్ దుమ్ములేపాడు. ఈ ఓవర్లో చివరి నాలుగు బంతులకు సీఫెర్ట్ బౌండరీలు బాదడంతో ఈ ఓవర్లో కూడా 18 పరుగులు వచ్చాయి. దీంతో తొలి మూడు ఓవర్లలోనే న్యూజిలాండ్ వికెట్ నష్టపోకుండా 43 పరుగులు చేసింది. నాలుగో ఓవర్లో హర్షిత్ రానా ప్రమాదకరంగా మారుతున్న ఈ జోడీని విడగొట్టాడు. మేడిన్ ఓవర్ వేయడంతో పాటు కాన్వే (19) ను పెవిలియన్ కు పంపాడు. 

Also Read : ఆస్ట్రేలియా చేతిలో చిత్తుచిత్తుగా ఓడిన శ్రీలంక

ఆ తర్వాత వరుణ్ చక్రవర్తి మరో ఓపెనర్ సీఫెర్ట్ (24) ను ఔట్ చేయడంతో పవరే ప్లే లో న్యూజిలాండ్ రెండు వికెట్లు కోల్పోయి 64 పరుగులు చేసింది. కుల్దీప్ వేసిన 9 ఓవర్లో సిక్స్, రెండు ఫోర్లతో దూకుడు చూపించిన ఫిలిప్స్ (19) ఇదే ఓవర్లో ఐదో బంతికి ఔటయ్యాడు. ఫిలిప్స్, రవీంద్ర మూడో వికెట్ కు 55 పరుగులు జోడించి జట్టును భారీ స్కోర్ కు బాటలు వేశారు. క్రీజ్ లో ఉన్నత సేపు వేగంగా ఆడిన రచీన్ రవీంద్ర (44)ను కుల్దీప్ యాదవ్ ఔట్ చేసి స్కోర్ వేగాన్ని ఆపాడు. చివర్లో కివీస్ కెప్టెన్ సాంట్నర్ ఒంటరి పోరాటం చేశాడు. హాఫ్ సెంచరీ చేసి జట్టును 200 పరుగుల మార్క్ కు చేర్చాడు.