సౌతాఫ్రికాతో సెకండ్ టెస్ట్.. ఇండియాకు అగ్ని పరీక్ష! పంత్పై ప్రెజర్‌‌.. ఈ మ్యాచ్ గానీ గెలవకపోతే..

సౌతాఫ్రికాతో సెకండ్ టెస్ట్.. ఇండియాకు అగ్ని పరీక్ష! పంత్పై ప్రెజర్‌‌.. ఈ మ్యాచ్ గానీ గెలవకపోతే..
  •  ఇవాళ్టి (నవంబర్ 22) నుంచి సౌతాఫ్రికాతో  రెండో టెస్టు
  • గిల్ దూరం.. కెప్టెన్‌‌గా పంత్‌‌
  • సిరీస్‌ సమమే లక్ష్యంగా బరిలోకి
  • తొలిసారి టెస్టు మ్యాచ్‌కు
  •  ఆతిథ్యం  ఇస్తున్న గువాహటి 
  • ఉ. 9 గంటల నుంచి
  • స్టార్‌‌‌‌ స్పోర్ట్స్‌‌లో లైవ్‌‌


గువాహటి: సొంతగడ్డపై టెస్టుల్లో మన జట్టుకు తిరుగులేదు. ఇది ఒకప్పటి మాట. గతేడాది న్యూజిలాండ్‌‌ చేతిలో 0–3తో  చిత్తయిన ఇండియా కంచుకోటకు బీటలు వారగా ఇప్పుడు మరో వైట్‌‌వాష్ గండం వెంటాడుతోంది. సౌతాఫ్రికాతో తొలి టెస్టులో ఓడి తీవ్ర ఒత్తిడిలో ఉన్న టీమిండియా కెప్టెన్ శుభ్‌‌మన్ గిల్ లేకుండానే  శనివారం (నవంబర్ 22) మొదలయ్యే రెండో టెస్టు సవాల్‌‌కు రెడీ అయింది. 

ఈశాన్య రాష్ట్రం అసోంలోని గువాహటి తొలిసారి ఆతిథ్యం ఇస్తున్న  ఈ మ్యాచ్‌‌లో  పిచ్‌‌ ఎలా స్పందిస్తుందనేది సర్వత్రా ఆసక్తి రేకెత్తిస్తుండగా ఇందులో ఎలాగైనా గెలిచి సిరీస్‌‌ను పంచుకోవాలని పట్టుదలగా ఉంది. కోల్‌‌కతా తొలి టెస్టులో దెబ్బతిన్న ఇండియా ఇప్పుడు స్టాండిన్ కెప్టెన్ రిషబ్ పంత్  నాయకత్వంలో ఈ అగ్ని పరీక్షలో నెగ్గి  పరువు కాపాడుకోవాలని చూస్తోంది. ఇంకోవైపు తొలి మ్యాచ్‌‌ గెలిచిన జోరుతో  గువాహటిలోనూ ఆతిథ్య జట్టును పడగొట్టి 2–0తో సిరీస్ సొంతం చేసుకోవాలని సఫారీలు ఉవిళ్లూరుతున్నారు. 

పంత్‌పై ప్రెజర్‌‌

గిల్ గైర్హాజరీలో జట్టు పగ్గాలు చేపట్టిన రిషబ్ పంత్‌‌పై ఇప్పుడు తీవ్ర ఒత్తిడి ఉండనుంది. గత మ్యాచ్‌‌లో స్టాండిన్ కెప్టెన్‌‌గా  పంత్ తీసుకున్న నిర్ణయాలపై విమర్శలు వచ్చాయి. ముఖ్యంగా మూడో రోజు ఆటలో బుమ్రాకు ఆరంభంలోనే బౌలింగ్ ఇవ్వకపోవడాన్ని మాజీలు ప్రశ్నించారు.  గతంలో రోహిత్ శర్మ గైర్హాజరీలో పంత్ ఇదే సఫారీలపై టీ20 జట్టుకు కెప్టెన్‌‌గా వ్యవహరించినప్పటికీ, టెస్టు క్రికెట్‌‌లో నాయకుడిగా అతనికి ఇదే తొలి అనుభవం. 

దాంతో  బ్యాటింగ్‌‌తో పాటు, క్లిష్ట సమయాల్లో బౌలింగ్ మార్పులు, నిర్ణయాలు తీసుకోవడంలో తన సామర్థ్యాన్ని నిరూపించుకోవాల్సి ఉంది. తొలి టెస్టులో సఫారీ స్పిన్నర్ సైమన్ హార్మర్ ఇండియా బ్యాటర్లను ముప్పుతిప్పలు పెట్టాడు. స్పిన్‌‌ను ఎదుర్కోవడంలో ఆతిథ్య బ్యాటర్ల సాంకేతిక లోపాలు బయటపడ్డాయి. గువాహటి పిచ్ కూడా స్పిన్‌‌కు అనుకూలించే అవకాశం ఉండటంతో పంత్‌‌ సేన బ్యాటింగ్ లైనప్‌‌పై ఒత్తిడి నెలకొంది. టాపార్డర్‌‌‌‌లో యశస్వి, కేఎల్ రాహుల్ మిడిల్‌‌లో జురెల్‌‌, పంత్‌‌, జడేజా బాధ్యతగా ఆడాలి. 

ఇక, స్వదేశంలో జట్టు  అజేయ రికార్డు మసకబారడంతో  కోచ్ గంభీర్ కూడా విమర్శలు ఎదుర్కొంటున్నాడు.   ఒకవేళ ఈ మ్యాచ్‌‌లో ఓడితే  రెండు సెనా (సౌతాఫ్రికా, ఇంగ్లండ్‌‌, న్యూజిలాండ్, ఆస్ట్రేలియా) దేశాలతో టెస్టుల్లో 0–5తో పేలవ రికార్డు ఖాతాలో  చేరి గంభీర్ కోచింగ్ భవిష్యత్తుపై ప్రభావం పడే అవకాశం ఉంది.  గిల్ స్థానంలో సుదర్శన్ తుది జట్టులోకి రావడం ఖాయం. తను మూడో నంబర్‌‌‌‌లో బ్యాటింగ్ చేస్తాడా? లేక గత మ్యాచ్ మాదిరిగా సుందర్‌‌‌‌ను ఆడిస్తారా? అన్నది ఆసక్తికరం. 

సుదర్శన్ రాకతో జట్టులో ఏకంగా ఏడుగురు లెఫ్టాండ్  బ్యాటర్లు అవుతారు. వైవిధ్యం కోసం స్పిన్నర్ అక్షర్ పటేల్ లేదా కుల్దీప్ యాదవ్ స్థానంలో పేస్ ఆల్‌‌రౌండర్ నితీష్ కుమార్ రెడ్డిని తీసుకునే అవకాశం ఉంది. నితీష్ రైట్ హ్యాండ్ బ్యాటర్ కావడం జట్టుకు కలిసొచ్చే అంశం.  బౌలింగ్‌‌లో పేసర్‌‌‌‌ బుమ్రా, స్పిన్నర్ జడేజా సత్తా చాటుతుండగా.. సిరాజ్‌‌, కుల్దీప్‌‌, సుందర్  నుంచి మరింత సపోర్ట్ అవసరం. ఏదేమైనా తొలి టెస్టు ఓటమి నుంచి పాఠాలు నేర్చుకొని ఎలాంటి తప్పిదానికి తావివ్వకుండా ఆడితేనే ఇండియా  వైట్‌‌ వాష్ తప్పించుకొని పరువు కాపాడుకోగలదు.

జోరుమీద సఫారీలు

సౌతాఫ్రికా పూర్తి ఆత్మవిశ్వాసంతో ఉంది. స్టార్ పేసర్ కగిసో రబాడ గాయంతో ఈ మ్యాచ్‌‌కూ దూరమైనప్పటికీ  మార్కో యాన్సెన్, సైమన్ హార్మర్ వంటి బౌలర్లతో జట్టు పటిష్టంగా కనిపిస్తోంది. 2010 తర్వాత ఇండియాలో టెస్టు గెలిచిన సౌతాఫ్రికా, ఈ మ్యాచ్‌‌తో సిరీస్ కైవసం చేసుకోవాలని చూస్తోంది. బ్యాటింగ్‌‌లో ఆ టీమ్‌‌కు కెప్టెన్ బవూమ కొండంత అండగా ఉన్నాడు. అయితే, ఓపెనర్ మార్‌‌‌‌క్రమ్‌‌, రికెల్టన్‌‌ తో పాటు మిడిలార్డర్‌‌‌‌ ప్లేయర్లు కూడా సత్తా చాటాలని కెప్టెన్ కోరుకుంటున్నాడు. రబాడ స్థానంలో కార్బిన్ బాష్ కొనసాగే అవకాశం ఉంది.  ముల్డర్ స్థానంలో  ఎక్స్‌‌ట్రా స్పిన్నర్ ముత్తుసామి లేదా బ్యాటర్ డెవాల్డ్ బ్రెవిస్‌‌ను తీసుకునే అంశాన్ని పరిశీలిస్తోంది.

పిచ్‌‌/వాతావరణం

తొలిసారి టెస్టు మ్యాచ్ కు ఆతిథ్యం ఇస్తున్న గువాహటి ఇండియాలో 30వ టెస్టు వేదిక కానుంది. ఇక్కడి పిచ్ కూడా స్పిన్నర్లకు అనుకూలించే చాన్సుంది. అయితే కోల్‌‌కతా పిచ్‌‌తో పోలిస్తే బ్యాటింగ్‌‌కు కాస్త మెరుగ్గా ఉండవచ్చని అంచనా. ఇక్కడ సూర్యాస్తమయం త్వరగా అవుతుంది కాబట్టి ఆట ఉదయం 9 గంటలకే ప్రారంభమవుతుంది. 11 గంటలకు టీ బ్రేక్, మధ్యాహ్నం 1.20 గంటలకు లంచ్ బ్రేక్ ఇస్తారు.

తుది జట్లు (అంచనా)

ఇండియా: యశస్వి జైస్వాల్, కేఎల్ రాహుల్, సాయి సుదర్శన్, ధ్రువ్ జురెల్, రిషబ్ పంత్ (కెప్టెన్, కీపర్), నితీష్ రెడ్డి, రవీంద్ర జడేజా, వాషింగ్టన్ సుందర్, కుల్దీప్ యాదవ్/అక్షర్ పటేల్, బుమ్రా, సిరాజ్.
సౌతాఫ్రికా: మార్‌‌‌‌క్రమ్‌‌,  రికెల్టన్,  ముల్డర్ / బ్రెవిస్ / ముత్తుసామి, టోనీ డి జార్జీ, బవూమ (కెప్టెన్), ట్రిస్టన్ స్టబ్స్, కైల్ వెరెన్ (కీపర్), కార్బిన్ బాష్, మార్కో యాన్సెన్, హార్మర్, కేశవ్ మహారాజ్.

ముంబైలో గిల్‌‌కు మెడికల్ టెస్టులు
మెడ నొప్పితో బాధపడుతున్న కెప్టెన్ గిల్ 

ఈ టెస్టుకు దూరమైనట్టు బీసీసీఐ శుక్రవారం మధ్యాహ్నం ప్రకటించింది. మ్యాచ్‌‌ ఆడేందుకు గిల్ పూర్తి స్థాయి ఫిట్‌‌నెస్ సాధించలేదని బోర్డు సెక్రటరీ దేవజిత్ సైకియా తెలిపారు. తదుపరి మెడికల్ టెస్టుల కోసం గిల్‌‌ ముంబైకి వెళ్తున్నాడని వెల్లడించారు.