- కాశ్మీర్ అంశంలో జోక్యాన్ని సహించబోం
- యూఎన్ హెచ్చార్సీలో పాక్ కు ఇండియా వార్నింగ్
- పాక్ ప్రతినిధి తీరుపై విదేశాంగ కార్యదర్శి ఫైర్
జెనీవా: జమ్మూ కాశ్మీర్స్పెషల్ స్టేటస్ ఎత్తివేత నిర్ణయం ఇండియా సార్వభౌమాధికారానికి సంబంధించిందని, ఇందులో ఇతర దేశాల జోక్యాన్ని ఎట్టిపరిస్థితిలోనూ సహించబోమని విదేశాంగ శాఖ సెక్రెటరీ(ఈస్ట్) విజయ్ థాకూర్సింగ్ తేల్చిచెప్పారు. జెనీవాలో మంగళవారం జరిగిన 42వ యూఎన్ హెచ్చార్సీ సమావేశంలో మాట్లాడుతూ.. కాశ్మీర్ అంశంపై పాకిస్తాన్ ఆరోపణలను తిప్పికొట్టారు. కాశ్మీర్లో అంతా రాజ్యాంగబద్ధంగానే జరుగుతోందని స్పష్టంచేశారు. పార్లమెంట్లో చర్చించిన తర్వాత, ఉభయ సభల ఆమోదంతోనే ఆర్టికల్‌ను రద్దు చేశామన్నారు. ప్రభుత్వ నిర్ణయాన్ని ప్రజలు సంతోషంతో స్వాగతించారని చెప్పారు. జమ్మూ, కాశ్మీర్లో సాధారణ పరిస్థితులు నెలకొనేందుకు ప్రభుత్వం అన్నిరకాల చర్యలు తీసుకుందని వివరించారు. ఒక్కొక్కటిగా ఆంక్షలను ఎత్తివేస్తోందని తెలిపారు. కాశ్మీర్లో మానవ హక్కుల ఉల్లంఘనపై అంతర్జాతీయ విచారణ జరిపించాలన్న పాక్ డిమాండ్‌ను తీవ్రంగా తప్పుబట్టారు.
హ్యూమన్రైట్స్వేదికను రాజకీయ అజెండాగా మార్చే ప్రయత్నాలను ఖండించాలని సింగ్ అన్నారు. టెర్రరిజానికి ఆశ్రయమిచ్చి ప్రోత్సహించడాన్ని ఆమె తీవ్రంగా ఖండించారు. టెర్రరిజంపై, దానిని ప్రోత్సహించే దేశాలకు వ్యతిరేకంగా ఇండియా సాగిస్తున్న పోరాటంలో కలిసి నడవాలంటూ ప్రపంచ దేశాలకు విజ్ఞప్తి చేశారు. అస్సాంలో నేషనల్ రిజిస్టర్ ఆఫ్ సిటిజెన్స్(ఎన్నార్సీ) వ్యవహారం సుప్రీంకోర్టు పర్యవేక్షణలో పూర్తిగా చట్టబద్ధంగా, పారదర్శకంగా జరుగుతోందని చెప్పారు. జాతీయ సంస్థలు బలోపేతంగా ఉన్నపుడే దేశంలో మానవ హక్కుల పరిరక్షణ సాధ్యమని ఇండియా నమ్ముతుందని విజయ్ థాకూర్ సింగ్ హెచ్చార్సీలో పేర్కొన్నారు.
దొంగే దొంగని అరిచినట్లుంది
టెర్రరిస్టు లీడర్లకు ఆశ్రయమిస్తూ, నిధులిస్తూ టెర్రరిజాన్ని ప్రోత్సహించే దేశం మానవ హక్కుల గురించి మాట్లాడిన తీరు చూస్తుంటే.. దొంగే దొంగని అరిచినట్లుందని విజయ్ థాకూర్ సింగ్ అన్నారు. ప్రపంచ దేశాలన్నింటికీ పాక్ తీరు బాగా తెలుసన్నారు. స్పెషల్ స్టేటస్రద్దు నేపథ్యంలో శాంతిభద్రతలకు భంగం కలగకుండా, టెర్రర్ దాడులకు అవకాశమివ్వకుండా ప్రభుత్వం ముందు జాగ్రత్త చర్యలు తీసుకుందన్నారు. అందులో భాగంగానే కాశ్మీర్లో నేతలను హౌజ్ అరెస్ట్ చేశామని ఆమె చెప్పారు. కాశ్మీర్‌పై ఆరోపణలు చేస్తున్న పాక్.. తన అధీనంలోని పీవోకే లో ఎలాంటి పరిస్థితులు ఉన్నాయో చూసుకోవాలని సింగ్ తిప్పికొట్టారు.


