
జమ్మూకాశ్మీర్ పరిస్థితిపై ఆఫీస్ ఆఫ్ యూఎన్ హైకమిషనర్ ఫర్ హ్యూమన్ రైట్స్ ( ఓహెచ్‌సీహెచ్‌ఆర్) తాజాగా రిలీజ్ చేసిన రిపోర్ట్‌పై ఇండియా తీవ్రంగా స్పందించింది. అదంతా తప్పుల తడకని పేర్కొంది. క్రాస్ బోర్డర్ టెర్రరిజాన్ని నివేదికలో ప్రస్తావించలేదని అభ్యంతరం వ్యక్తంచేసింది.ఓహెచ్‌సీహెచ్‌ఆర్ గత ఏడాది తొలిసారిగా కాశ్మీర్ మానవ హక్కులపై ఒక రిపోర్ట్‌ను రిలీజ్ చేసింది. దానికి కొనసాగింపుగా సోమవారం మరో లేటెస్ట్ రిపోర్ట్‌ను విడుదలచేసింది. పాత రిపోర్ట్‌కు కొనసాగింపుగా ఉందే తప్ప .. తాజా నివేదికలో ఎలాంటి నిజాలు లేవని ఇండియా తన నిరసనను తెలిపింది. మే 2018 నుంచి ఏప్రిల్ 2019 మధ్య కాలంలో పదేళ్లలో ఎన్నడూలేనంతంగా కాశ్మీర్, పాక్ ఆక్రమిత కాశ్మీర్‌లోని ప్రజల హక్కులకు భంగం కలిగాయని ఓహెచ్‌సీహెచ్‌ఆర్ లేటెస్ట్ నివేదిక ప్రస్తావించింది. తాము చేసిన సిఫార్సుల్ని ఇండియా, పాకిస్థాన్‌లు పట్టించుకోలేదని ఆ రిపోర్ట్ తెలిపింది. ఈ రిపోర్ట్‌పై విదేశాంగశాఖ అధికార ప్రతినిధి రవీశ్ కుమార్ సీరియస్ అయ్యారు. ఓహెచ్‌సీహెచ్‌ఆర్ రిపోర్ట్ దేశ సమగ్రతనుగాని, క్రాస్ బోర్డర్ టెర్రరిజాన్నిగాని పట్టించుకోలేదని అన్నారు.