IND vs ENG 2025: వీళ్ళ ఆట బోర్ కొడుతుంది.. ఇంగ్లాండ్‌కు గిల్, సిరాజ్ చురకలు

IND vs ENG 2025: వీళ్ళ ఆట బోర్ కొడుతుంది.. ఇంగ్లాండ్‌కు గిల్, సిరాజ్ చురకలు

బజ్ బాల్ అంటూ టెస్ట్ క్రికెట్ లో వేగంగా ఆడుతూ సుదీర్ఘ ఫార్మాట్ పై ఆసక్తి పెంచిన జట్టు ఇంగ్లాండ్.  గెలుపు ఓటములతో సంబంధం లేకుండా టెస్టుల్లో కూడా దూకుడుగా ఆడుతుంది. ఈ క్రమంలో కొన్ని పరాజయాలు పలకరించినా తమ ఆట తీరు మాత్రం మార్చుకోలేదు. అయితే టీమిండియాతో జరుగుతోన్న లార్డ్స్ టెస్టులో మాత్రం ఇంగ్లాండ్ స్లో గా బ్యాటింగ్ చేస్తుంది. వికెట్ కోసం ప్రాధాన్యమిస్తూ నిదానంగా ఆడడం ఆశ్చర్యానికి గురి చేస్తోంది. రన్ రేట్ 3 మాత్రమే ఉండడంతో టీమిండియా బౌలింగ్ ఏ రకంగా చేసిందో అర్ధం చేసుకోవచ్చు. 

ఓపెనర్లు నుంచి మిడిల్ ఆర్డర్ వరకు ఒక్కరు కూడా కనీసం 60 స్ట్రైక్ రేట్ తో బ్యాటింగ్ చేయకపోవడం విశేషం. దీంతో టీమిండియా కెప్టెన్ శుభమాన్ గిల్ ఇంగ్లాండ్ పై సెటైర్ వేశాడు. రూట్, పోప్ బ్యాటింగ్ చేస్తున్న సమయంలో "అసలు ఎంటర్ టైన్ మెంట్ లేదు. వెల్కమ్ బ్యాక్ టు టెస్ట్ క్రికెట్" అని గిల్ ఇంగ్లాండ్ ను రెచ్చగొట్టాడు. అదే సమయంలో సిరాజ్ కూడా "రూట్ బజ్ బాల్ ఎక్కడ" అని ప్రశ్నించాడు. భారత బౌలర్ల ధాటికి రూట్, పోప్ ఇంగ్లాండ్ ఇన్నింగ్స్ ను నిర్మించడానికి చాలా స్లో గా బ్యాటింగ్ చేశారు. మొత్తానికి ఇంగ్లాండ్ దూకుడుకు కళ్లెం వేయడంలో మనోళ్లు సక్సెస్ అయ్యారనే చెప్పాలి.

ఈ మ్యాచ్ విషయానికి వస్తే ప్రస్తుతం ఇంగ్లాండ్ 65 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 202 పరుగులు చేసింది. క్రీజ్ లో రూట్ (72), కెప్టెన్ స్టోక్స్ (21) ఉన్నారు. రూట్ హాఫ్ సెంచరీతో పోరాడుతుండగా పోప్ 44 పరుగులు చేసి రాణించాడు. ఓపెనర్లు డకెట్ (23), క్రాలీ (18) విఫలమయ్యారు. భారత బౌలర్లలో నితీష్ కుమార్ రెడ్డి రెండు వికెట్లు తీసుకున్నాడు. జడేజా, బుమ్రాలకు తలో వికెట్ దక్కింది.