నేడు సౌతాఫ్రికాతో ఇండియా రెండో టీ20   

నేడు సౌతాఫ్రికాతో ఇండియా రెండో టీ20   

ఇండియానే ఫేవరెట్

రిషభ్ పంత్ పైనే అందరి దృష్టి

రాత్రి 7 గంటలకు స్టార్ స్పోర్ట్స్ లో

ధోనీ వారసుడిగా ముద్ర.. కుర్రాళ్లలో అందరికంటే ఎక్కువగా అవకాశాలు.. సీనియర్‌‌‌‌ వికెట్‌‌ కీపర్‌‌‌‌ అందుబాటులో ఉన్నా ప్రతీ ఫార్మాట్‌‌లో అతనికే ఫస్ట్​చాన్స్… ఫామ్‌‌లో లేకపోయినా, చెత్త షాట్లతో ఔటైనా.. విదేశీ సిరీస్‌‌ల్లోనూ అతనికే పెద్ద పీట.. ఇలా ఒకటా, రెండా.. లెక్కకుమించి అవకాశాలు ఇస్తున్నా.. తన ఆటతీరును మార్చుకోలేకపోతున్న రిషబ్‌‌ పంత్‌‌కు అఖరి అవకాశం..! ఇన్నాళ్లూ అండగా నిలిచిన మేనేజ్‌‌మెంటే.. ఇప్పుడు ఆడకపోతే ఇక అంతే.. అని సంకేతాలిస్తున్న నేపథ్యంలో నేడు సౌతాఫ్రికాతో జరిగే రెండో టీ20లో పంత్​ ఎలా ఆడతాడన్నది ఆసక్తికరంగా మారింది..! నాలుగైదు అవకాశాల కంటే ఎక్కువగా ఆశించొద్దన్న కెప్టెన్‌‌ కోహ్లీ వ్యాఖ్యలతో.. టీమ్‌‌లోకి వచ్చిన యువ క్రికెటర్ల ఆటపై కూడా దృష్టి పెరిగింది..!!

మొహాలీ: ఓవైపు వచ్చే ఏడాది టీ20 వరల్డ్‌‌కప్ కోసం సన్నాహాకాలు​.. మరోవైపు కుర్రాళ్లకు ఎక్కువ అవకాశాలు ఇవ్వలేని పరిస్థితి.. ఈ నేపథ్యంలో సౌతాఫ్రికాతో రెండో టీ20 మ్యాచ్‌‌కు ఇండియా సిద్ధమైంది. వర్షం వల్ల ఒక్క బంతి పడకుండానే తొలి మ్యాచ్‌‌ రద్దుకావడంతో.. బుధవారం జరిగే ఈ మ్యాచ్‌‌పై రెట్టింపు ఆసక్తి నెలకొంది. సిరీస్‌‌ రెండు మ్యాచ్‌‌లకే పరిమితం కావడంతో.. ఇరుజట్లు గెలుపే లక్ష్యంగా బరిలోకి దిగుతున్నాయి. అయితే ఇప్పటివరకు సొంతగడ్డపై పొట్టి ఫార్మాట్‌‌లో సఫారీలను టీమిండియా ఓడించలేదు. దీంతో ఈ మ్యాచ్‌‌లో ఎలాగైనా గెలిచి చెత్త రికార్డును చెరిపేయాలని విరాట్‌‌సేన లక్ష్యంగా పెట్టుకుంది. టీ20 ప్రపంచకప్‌‌కు 12 నెలలే సమయం ఉండటం.. విరాట్‌‌ పక్కా ప్రణాళికలు రచించడం.. రిజర్వ్​బెంచ్‌‌లో ఎక్కువ మంది అవకాశాల కోసం ఎదురుచూస్తుండటంతో ఇప్పట్నించి ప్రతి మ్యాచ్‌‌ కీలకంగా మారింది. అదే సమయంలో ప్రతీ ప్లేయర్‌‌‌‌ ఆటను కూడా నిశితంగా పరిశీలించనున్నారు. కాబట్టి టీమ్‌‌లో స్థానం సుస్థిరం చేసుకోవాలనే ఆటగాళ్లు చావోరేవో తేల్చుకోవాల్సిన పరిస్థితి మొదలైంది.

పంత్‌‌పైనే దృష్టి..

2017 ఫిబ్రవరిలో అరంగేట్రం చేసిన రిషబ్ ఒకప్పుడు యువ క్రికెటర్‌‌‌‌. ఇప్పుడు టీమ్‌‌లో అతను కూడా సీనియరే. ఇప్పటికే చాలా అవకాశాలు ఇచ్చారు. అయినా సద్వినియోగం చేసుకోవడం లేదు. అద్భుతమైన టాలెంట్‌‌ ఉన్నా.. నిర్లక్ష్యపు ఆటతీరుతో పదేపదే వికెట్‌‌ పారేసుకుంటున్నాడు. దీంతో ఈ మ్యాచ్‌‌లో అందరి దృష్టి అతనిపైనే నెలకొంది. టీమ్‌‌ అవసరాలకు అతను ఏమాత్రం సరిపోవడం లేదని, చెత్త షాట్లతో ఔటవుతున్నాడని చీఫ్​కోచ్‌‌ రవిశాస్త్రి ఇప్పటికే హెచ్చరికలు జారీ చేయడంతో గతంలో ఎప్పుడూ లేనంత తీవ్ర ఒత్తిడి పంత్‌‌పై పడింది. ఒకవేళ రిషబ్​ఫామ్‌‌ ఇలాగే కొనసాగితే ధోనీని మళ్లీ తీసుకురావాలని కోహ్లీ ఆలోచిస్తున్నాడు. ఇక మణికట్టు స్పిన్నర్లు చహల్, కుల్దీప్‌‌ను కాదని వరుసగా రెండో సిరీస్‌‌కు లెగ్‌‌ స్పిన్నర్‌‌‌‌ రాహుల్‌‌ చహర్‌‌‌‌, ఆఫ్‌‌ బ్రేకర్‌‌‌‌ వాషింగ్టన్‌‌ సుందర్‌‌‌‌కు అవకాశం కల్పించారు.  8, 9, 10  స్థానాల్లో బ్యాటింగ్‌‌ డెప్త్‌‌ను పెంచడానికి వీళ్లను తీసుకున్నట్లు విరాట్‌‌ స్పష్టతనిచ్చాడు. మరి వరల్డ్‌‌కప్‌‌ వరకు కేవలం 20 మ్యాచ్‌‌లే ఆడనున్న తరుణంలో వికెట్లు తీయడంతో పాటు వీళ్లు
బ్యాటింగ్‌‌లోనూ మెరుస్తారా? మిడిలార్డర్‌‌‌‌ బలోపేతం కోసం తీసుకున్న శ్రేయస్‌‌ అయ్యర్‌‌‌‌, మనీష్‌‌ పాండే.. ఆ బాధ్యతలను సమర్థంగా నిర్వర్తిస్తారా? ఇక అచ్చొచ్చిన మైదానంలో ధవన్​మళ్లీ గాడిలో పడతాడా? ఇలా ప్రశ్నార్థకంగా కనిపిస్తున్న ఈ అంశాలకు రెండో టీ20లో కొద్దిగా స్పష్టత వచ్చినా చాలని మేనేజ్‌‌మెంట్‌‌ భావిస్తోంది. పేస్‌‌ బౌలింగ్‌‌లో దీపక్‌‌, సైనీ.. సీనియర్ల స్థాయిని అందుకుంటారా చూడాలి.

బౌలింగే బలం..

మరోవైపు సఫారీల పరిస్థితి కూడా భిన్నంగా ఏమీ లేదు. ప్రస్తుతం టీమ్‌‌ సంధి దశలో ఉంది. డుప్లెసిస్‌‌ స్థానంలో పగ్గాలు చేపట్టిన డికాక్ టీమ్‌‌ను ఎలా నడిపిస్తాడో చూడాలి. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో టీమిండియాను ఓడించడం అంత సులభం కాదు. ప్రొటీస్‌‌ టీమ్‌‌లో ఎక్కువ మంది కుర్రాళ్లు ఉన్నారు. వీళ్లకు ఇండియాపై ఆడిన అనుభవం తక్కువ. బ్యాటింగ్‌‌తో పోలిస్తే సఫారీలకు బౌలింగే ప్రధాన బలం. రబడ, జూనియర్ డలా, నోర్జ్​అత్యంత కీలకం కానున్నారు. డికాక్, మిల్లర్​కు ఇండియా పిచ్‌‌లపై మంచి అవగాహన ఉంది. ఐపీఎల్‌‌లో అన్ని పిచ్‌‌లపై ఆడారు. జూనియర్లను వీళ్లు నడిపిస్తారనే ఆశ ఉన్నా.. విరాట్‌‌, రోహిత్‌‌ను ఆపడం సఫారీలకు సాధ్యమవుతుందా? అన్నది కూడా మిలియన్‌‌ డాలర్ల ప్రశ్న. ఓవరాల్‌‌గా ఇండియా బ్యాటింగ్‌‌కు, సౌతాఫ్రికా బౌలింగ్‌‌కు మధ్య రసవత్తర పోరు మాత్రం ఖాయం.

జట్లు (అంచనా) :

ఇండియా: కోహ్లీ (కెప్టెన్‌‌), రోహిత్‌‌, ధవన్‌‌ / రాహుల్‌‌, మనీష్​ / శ్రేయస్‌‌, రిషబ్‌‌, హార్దిక్‌‌, క్రునాల్‌‌, జడేజా, సుందర్‌‌‌‌ / రాహుల్‌‌ చహర్‌‌‌‌, దీపక్‌‌, సైనీ.

సౌతాఫ్రికా: డికాక్‌‌ (కెప్టెన్‌‌), హెండ్రిక్స్, డుసేన్, బవూమ, మిల్లర్, పెహుల్‌‌క్వాయో, ప్రిటోరియస్‌‌, ఫోర్టిన్‌‌ / లిండే, రబడ, డలా/ నోర్జ్​, షంసీ. పిచ్, వాతావరణం

  • బ్యాటింగ్‌‌, బౌలింగ్‌‌కు సమతూకమైన పిచ్‌‌.
  • 2019లో ఏడు ఐపీఎల్‌‌ మ్యాచ్‌‌లు జరిగితే యావరేజ్‌‌ స్కోరు 171.
  • ఐదుస్లారు ఛేజింగ్‌‌ టీమ్‌‌ గెలిచింది.
  • వర్షం ముప్పు లేదు.