- వైస్ కెప్టెన్‌గా అక్షర్ రింకూ సింగ్‌కు చాన్స్ టీమ్‌లో మన తిలక్
ముంబై: సొంతగడ్డపై జరిగే టీ20 వరల్డ్ కప్ కోసం ఆలిండియా సీనియర్ సెలెక్షన్ కమిటీ సంచలన నిర్ణయం తీసుకుంది. ఫామ్ కోల్పోయిన వైస్ కెప్టెన్, ఓపెనర్ శుభ్‌మన్ గిల్‌పై వేటు వేసింది. ఈ మేరకు అజిత్ అగార్కర్ నేతృత్వంలోని కమిటీ శనివారం ముంబైలో సమావేశమై సూర్యకుమార్ యాదవ్ కెప్టెన్సీలో 15 మందితో కూడిన జట్టును ప్రకటించింది. సూర్యకుమార్ కూడా చాన్నాళ్లుగా ఫామ్ కోల్పోయి ఇబ్బంది పడుతున్నప్పటికీ ఊహించినట్టుగానే అతనికే పగ్గాలు అప్పగించింది. కానీ, శుభ్‌మన్ గిల్‌ను జట్టు నుంచి తప్పించింది. అతని స్థానంలో వికెట్ కీపర్-బ్యాటర్ ఇషాన్ కిషన్‌ను తీసుకోవడంతో పాటు ఫినిషర్ రింకూ సింగ్‌కు జట్టులో చోటు కల్పించింది. టెస్టులు, వన్డేల్లో నిలకడగా రాణిస్తున్నప్పటికీ, టీ20 ఫార్మాట్‌లో గిల్ తన స్థానాన్ని సుస్థిరం చేసుకోలేకపోయాడు. ముఖ్యంగా పవర్ ప్లేలో వేగంగా రన్స్ రాబట్టడంలో గిల్ ఇబ్బంది పడుతుండటం, ఇటీవలి సౌతాఫ్రికా సిరీస్‌లో వరుసగా 4, 0, 28 రన్స్ మాత్రమే చేయడం అతని ఎంపికపై ప్రభావం చూపింది. గిల్ లేకపోవడంతో స్పిన్ ఆల్ రౌండర్ అక్షర్ పటేల్‌కు వైస్ కెప్టెన్ బాధ్యతలు అప్పగించారు. హైదరాబాదీ తిలక్ వర్మ కూడా మెగా టోర్నీకి ఎంపికయ్యాడు. ఇదే జట్టు జనవరి 21 నుంచి న్యూజిలాండ్‌తో జరిగే ఐదు టీ20ల సిరీస్‌లో కూడా పాల్గొంటుంది.
ఇషాన్ కిషన్ రీ-ఎంట్రీ.. జైస్వాల్, జితేష్‌కు నిరాశ
ఫిట్ నెస్, ఇతర కారణాల వల్ల ఈ ఏడాది చాలా వరకు జట్టుకు దూరంగా ఉన్న ఇషాన్ తిరిగి జట్టులోకి వచ్చాడు. ఇటీవల జరిగిన సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో జార్ఖండ్ జట్టును విజేతగా నిలపడంలో ఇషాన్ కీలక పాత్ర పోషించాడు. ఫైనల్లో తన మెరుపు సెంచరీ సెలెక్టర్లను ఆకట్టుకుంది. ఇషాన్ కిషన్ రాకతో యువ సంచలనం యశస్వి జైస్వాల్ తన స్థానాన్ని కోల్పోవాల్సి వచ్చింది. అలాగే కీపర్ జితేష్ శర్మకు కూడా జట్టులో చోటు దక్కలేదు. టాపార్డర్‌లో కీపర్ బ్యాటింగ్ చేయాలన్న వ్యూహంతోనే ఈ మార్పులు చేసినట్లు తెలుస్తోంది. ఈ లెక్కన సంజూ శాంసన్ బ్యాకప్ ఓపెనర్ కమ్ కీపర్‌గా జట్టులో ఉంటాడు.
బలంగా బ్యాటింగ్ విభాగం
కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్, అభిషేక్ శర్మ, తిలక్ వర్మతో బ్యాటింగ్ విభాగం బలంగా కనిపిస్తోంది. మిడిలార్డర్, ఫినిషింగ్ బాధ్యతలను రింకూ సింగ్, హార్దిక్ పాండ్యా, శివమ్ దూబే పంచుకోనున్నారు. పేస్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా టీమ్ బ్యాలెన్స్‌లో కీలకం కానుండగా, స్పిన్నర్లను సమర్థవంతంగా ఎదుర్కోగల సత్తా ఉన్న శివమ్ దూబే అదనపు బలంగా మారాడు. వాషింగ్టన్ సుందర్, అక్షర్ పటేల్ రూపంలో స్పిన్ ఆల్ రౌండర్లు జట్టుకు మరింత బలాన్ని ఇస్తున్నారు. ఇక, బౌలింగ్ దళానికి జస్‌ప్రీత్ బుమ్రా నాయకత్వం వహించనుండగా, అర్ష్‌దీప్ సింగ్ అతనికి తోడుగా ఉంటాడు. యువ పేసర్ హర్షిత్ రాణాకు అనూహ్యంగా వరల్డ్ కప్ జట్టులో చోటు దక్కింది. అతని వేగం, బౌన్స్ జట్టుకు ఉపయోగపడతాయని సెలెక్టర్లు భావించారు. స్పిన్ విభాగంలో కుల్దీప్ యాదవ్, వరుణ్ చక్రవర్తి తమ మణికట్టు మాయాజాలంతో ప్రత్యర్థులను ఇబ్బంది పెట్టడానికి సిద్ధంగా ఉన్నారు. ఫిబ్రవరి 7వ తేదీ నుంచి జరిగే ఈ మెగా టోర్నీలో తొలి రోజు ఇండియా .. అమెరికా జట్టుతో జరిగే మ్యాచ్‌లో ట్రోఫీ వేటను ప్రారంభిస్తుంది. 12న నమీబియాతో, 15న కొలంబో వేదికగా దాయాది జట్టు పాకిస్తాన్‌తో హై వోల్టేజ్ మ్యాచ్‌లో తలపడనుంది. గ్రూప్ దశ చివరి మ్యాచ్‌లో భాగంగా 18న అహ్మదాబాద్‌లో నెదర్లాండ్స్‌తో పోటీ పడుతుంది. సూపర్ -8 మ్యాచ్‌లు ఫిబ్రవరి 21 నుంచి ప్రారంభమవుతాయి. ఫైనల్ మార్చి 8న జరగనుంది.
శుభ్‌మన్ గిల్ క్లాస్ ప్లేయర్ అనడంలో సందేహం లేదు. కానీ ప్రస్తుతం అతను రన్స్ చేయలేకపోతున్నాడు. గత వరల్డ్ కప్‌లో కూడా కాంబినేషన్ కుదరకే తనకు చోటు దక్కలేదు. ఇప్పుడు మాకు టాపార్డర్‌లో ఇద్దరు వికెట్ కీపర్లు అవసరం ఉంది. అందుకే ఈ నిర్ణయం తీసుకున్నాం.– చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్
ఇది (గిల్‌ను తప్పించడం) కేవలం ఫామ్ సమస్య కాదు, జట్టు కాంబినేషన్ కోసం తీసుకున్న నిర్ణయం. మాకు బ్యాటింగ్ ఆర్డర్ మొదట్లో ఒక కీపర్ కావాలి. అందుకే ఇషాన్ కిషన్‌ను తీసుకున్నాం. నేను నాలుగో స్థానంలో, తిలక్ వర్మ మూడో స్థానంలో బ్యాటింగ్ చేస్తాం. ప్రస్తుతం నేను కూడా ఫామ్‌లో లేను. దీనిపై ఫోకస్ పెట్టేందుకు నాకు కొంత సమయం దొరికింది. వరల్డ్ కప్ సమయానికి మీరంతా నాలోని బెస్ట్ బ్యాటర్‌ను చూస్తారు– కెప్టెన్ సూర్యకుమార్
టీ20 వరల్డ్ కప్, న్యూజిలాండ్‌తో టీ20 సిరీస్‌కు ఇండియా టీమ్: సూర్యకుమార్ (కెప్టెన్), అభిషేక్ శర్మ, తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా, శివమ్ దూబే, అక్షర్ పటేల్ (వైస్ కెప్టెన్), కుల్దీప్ యాదవ్, జస్‌ప్రీత్ బుమ్రా, అర్ష్‌దీప్ సింగ్, హర్షిత్ రాణా, సంజు శాంసన్ (కీపర్), వాషింగ్టన్ సుందర్, వరుణ్ చక్రవర్తి, ఇషాన్ కిషన్ (కీపర్), రింకూ సింగ్.
