- ఉగ్రవాదాన్ని ఎదుర్కొనే సత్తా తమకుందని వెల్లడి
న్యూయార్క్: యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్ (యూఎన్ఎస్సీ) వేదికగా పాకిస్తాన్‌కు భారత్ స్ట్రంగ్ వార్నింగ్ ఇచ్చింది. ఉగ్రవాదానికి మద్దతివ్వడం ఆపకపోతే ఇస్లామాబాద్ భారీ మూల్యం చెల్లించక తప్పదని స్పష్టం చేసింది.
సరిహద్దు ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తే దాని పర్యవసానాలు చాలా తీవ్రంగా ఉంటాయని భారత్ తేల్చిచెప్పింది. దశాబ్దాలుగా ఉగ్రవాదానికి, మతపరమైన తీవ్రవాదానికి, హింసాత్మక రాడికలిజానికి పాకిస్తాన్ మద్దతిస్తోందని భారత్ ఘాటుగా వ్యాఖ్యానించింది.
న్యూయార్క్‌లో జరిగిన యూఎన్ఎస్సీ బహిరంగ చర్చలో భారత శాశ్వత ప్రతినిధి, రాయబారి హరీశ్ పర్వతనేని మాట్లాడారు. ఈ సందర్భంగా పాకిస్తాన్ వైఖరిని ఆయన తీవ్రస్థాయిలో ఎండగట్టారు. భారతదేశంపై పాక్ చేసిన నిరాధారమైన ఆరోపణలను తప్పుపట్టారు.
స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచి భారత్‌పై పాకిస్తాన్ నిరంతరం దురాక్రమణలు చేస్తూనే ఉందని హరీశ్ ధ్వజమెత్తారు. సరిహద్దుల్లో ఉగ్రవాదానికి పాక్ నిరంతరం ఆశ్రయం కల్పిస్తోందని విమర్శించారు. స్వతంత్ర భారతదేశం తన ప్రస్థానం ప్రారంభంలోనే పాకిస్తాన్ చేసిన సరిహద్దు దురాక్రమణను ఎదుర్కోవాల్సి వచ్చిందని గుర్తు చేశారు.
చట్టబద్ధంగా భారత్‌లో విలీనమైన భూభాగాలను ఆక్రమించుకోవాలని పాకిస్తాన్ కుట్రలు చేసిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. అందులో భాగంగానే అంతర్జాతీయ నియమాలైన సార్వభౌమాధికారం, ప్రాంతీయ సమగ్రత, శాంతియుత సహజీవనం వంటి సూత్రాలను పాకిస్తాన్ నిరంతరం ఉల్లంఘిస్తూ వస్తోందని ఆరోపించారు.
పాకిస్తాన్ నేరుగా ఎదుర్కొనలేక ఉగ్ర దాడులు, చొరబాట్లు, మతకల్లోలాల రూపంలో భారత్ కు వెయ్యి గాయాలు చేయాలని చూస్తోందని ప్రపంచ దేశాలకు వివరించారు. తద్వారా ఇండియాను ఆర్థికంగా, సైనికంగా, సామాజికంగా బలహీనపడేలా చేయాలనేదే పాకిస్తాన్ అసలు వ్యూహమని మండిపడ్డారు.
అయితే, సరిహద్దు ఉగ్రవాదం నుంచి తనను తాను రక్షించుకునే పూర్తి సత్తా భారతదేశానికి ఉన్నాయని స్పష్టం చేశారు. ఉగ్రవాదానికి మద్దతిస్తున్నందుకు భవిష్యత్తులో పర్యవసానాలు ఉంటాయనే నిజాన్ని పాకిస్తాన్ అంగీకరించక తప్పదని హెచ్చరించారు.
