ముంబై: సొంతగడ్డపై వచ్చే ఏడాది జరిగే టీ20 వరల్డ్ కప్ కోసం టీమిండియా ఎంపికపై ఉత్కంఠ నెలకొంది. అజిత్ అగార్కర్ నేతృత్వంలోని సీనియర్ సెలెక్షన్ కమిటీ శనివారం 15 మందితో కూడిన టీమ్‌ను ప్రకటించనుంది. సౌతాఫ్రికాతో సిరీస్‌లో ఆడిన జట్టునే దాదాపు కొనసాగించే చాన్సుంది. అయితే, కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్, ఓపెనర్ శుభ్‌మన్ గిల్ ఫామ్ ఆందోళన కలిగిస్తోంది. సూర్య దాదాపు 14 నెలలుగా చెత్తగా ఆడుతుండగా.. గిల్ గత 18 ఇన్నింగ్స్‌ల్లో ఒక్క హాఫ్ సెంచరీ కూడా చేయలేదు.
అయినప్పటికీ, జట్టు కెప్టెన్, వైస్ కెప్టెన్‌గా ఉన్న ఈ ఇద్దరినీ ఇప్పుడప్పుడే పక్కనబెట్టే అవకాశం లేదని తెలుస్తోంది. సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో 517 రన్స్, 33 సిక్సర్లతో చెలరేగిన ఇషాన్ కిషన్ రేసులోకి వచ్చాడు. అయితే ఓపెనర్లుగా అభిషేక్ శర్మ, గిల్‌తో పాటు బ్యాకప్‌గా సంజూ శాంసన్ ఉండటంతో కిషన్‌కు చోటు దక్కడం కష్టమే. ఫినిషర్ రింకూ సింగ్ కంటే ఆల్‌రౌండర్ సుందర్ వైపే గంభీర్ మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తోంది. హార్దిక్ పాండ్యా ఫిట్‌గా ఉండటంతో స్పెషలిస్ట్ ఫినిషర్ కంటే ఆల్‌రౌండర్‌కే ప్రాధాన్యం ఇవ్వొచ్చు. ఫిబ్రవరి 7న మొదలయ్యే ఈ మెగా టోర్నీకి ముంగిట బీసీసీఐకి జట్టులో ఏ ఆటగాడినైనా మార్చుకునే అవకాశం ఉంది. కాగా, జనవరి 21 నుంచి న్యూజిలాండ్‌తో జరిగే టీ20 సిరీస్‌కు కూడా టీమ్‌ను ఎంపిక చేయనుంది.
