రోడ్డు ప్రాజెక్టుల్లో చైనా కంపెనీలను అనుమతించేది లేదు: నితిన్ గడ్కరీ

రోడ్డు ప్రాజెక్టుల్లో చైనా కంపెనీలను అనుమతించేది లేదు: నితిన్ గడ్కరీ

ఇప్పటికే చైనా యాప్ లను నిషేధించి ఆ దేశానికి షాకిచ్చిన భారత ప్రభుత్వం… మరో కీలక నిర్ణయం తీసుకుంది. దేశంలో చేపడుతున్న నేషనల్ హైవేల ప్రాజెక్టుల్లో చైనా కంపెనీలను కానీ, ఆ దేశ కంపెనీల భాగస్వామ్యాన్ని కానీ అనుమతించేది లేదని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ స్పష్టం చేశారు. ఎంఎస్ఎంఈ కంపెనీల్లో కూడా చైనాను అనుమతించబోమన్నారు. చైనా కంపెనీలు భాగస్వామిగా ఉన్న జాయింట్ వెంచర్లను కూడా అనుమతించబోమని తేల్చిచెప్పారు.

జాతీయ రహదారులకు సంబంధించి కొత్త పాలసీని తీసుకొస్తున్నామని… మన దేశ కంపెనీలకు ప్రాజెక్టు నిర్మాణాల్లో ఎక్కువ భాగస్వామ్యాన్ని కల్పిస్తామని గడ్కరీ తెలిపారు. ప్రస్తుతం కొనసాగుతున్న ప్రాజెక్టుల్లో చైనా కంపెనీల భాగస్వామ్యం ఉన్నట్టైతే… రీబిడ్డింగ్ నిర్వహిస్తామని చెప్పారు. సాంకేతిక, ఆర్థిక నిబంధనలను దేశీయ సంస్థల కోసం సడలించాలని జాతీయ రహదారుల సెక్రటరీ గిరిధర్, చైర్మన్ సంధూలకు సూచించానని… త్వరలోనే దీనిపై సమావేశాన్ని నిర్వహించబోతున్నామని తెలిపారు.

మన దేశానికి విదేశీ టెక్నాలజీ అవసరమైనా కూడా చైనా పెట్టుబడిదారులను అనుమతించబోమని స్పష్టం చేశారు గడ్కరీ.