న్యూఢిల్లీ: ఉత్తర బంగాళాఖాతంలో భద్రతను పటిష్టం చేసేందుకు నేవీ సన్నాహాలు చేస్తున్నది. అటు చైనా, ఇటు బంగ్లాదేశ్‌పై నిఘా పెట్టేందుకు కొత్త బేస్‌ను ఏర్పాటు చేస్తున్నది. పశ్చిమ బెంగాల్‌లోని హల్దియా వద్ద బేస్ ఏర్పాటుకు పనులు ప్రారంభిస్తున్నది. సముద్ర భద్రత దృష్ట్యా ఉత్తర బంగాళాఖాతంలో ఏర్పాటు చేయబోయే ఈ బేస్.. మనకు కీలకంగా మారనుంది.
హిందూ మహాసముద్రం, బంగాళాఖాతంలో చైనా నౌకాదళం ఇటీవల తన కార్యకలాపాలను పెంచుకుంటున్నది. ఈ నేపథ్యంలో బంగాళాఖాతంలో చైనా యుద్ధనౌకలు, జలాంతర్గాముల కదలికలను ఎప్పటికప్పుడు పరిశీలించేందుకు హల్దియా బేస్ ఉపయోగపడుతుంది. అలాగే బంగ్లాదేశ్‌లో మారుతున్న రాజకీయ పరిస్థితులు, అక్కడ చైనా పెట్టుబడులు పెరుగుతున్న నేపథ్యంలో సరిహద్దు భద్రతను పటిష్టం చేయాల్సిన అవసరం ఉంది.
బంగ్లాదేశ్ సరిహద్దుల నుంచి సముద్రం ద్వారా అక్రమ చొరబాట్లు, స్మగ్లింగ్‌ను అడ్డుకోవడంలో ఈ బేస్ ముఖ్యపాత్ర పోషించనుంది. ఇది కోల్‌కతా నుంచి దాదాపు 100 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఇక్కడి నుంచి నేరుగా బంగాళాఖాతంలోకి ప్రవేశించే అవకాశం ఉంది. దీంతో హుగ్లీ నది గుండా తిరిగి రావాల్సిన అవసరం ఉండదు.
గతంలోనే ప్రతిపాదనలు..
మనకు విశాఖపట్నం కేంద్రంగా తూర్పు నౌకాదళ కమాండ్, అండమాన్ నికోబార్‌లో ముఖ్యమైన నేవీ బేస్‌లు ఉన్నప్పటికీ.. ఉత్తర బంగాళాఖాతంలో వేగంగా స్పందించేందుకు ఒక స్పెషల్ బేస్ అవసరమని కేంద్రం భావిస్తున్నది. దీన్ని బెంగాల్‌లోని హల్దియా వద్ద ఏర్పాటు చేయాలని గతంలోనే ప్రతిపాదించినప్పటికీ, కొన్ని రోజులు పెండింగ్ పడింది. మళ్లీ ఇప్పుడు కదలిక వచ్చింది.
