ఇయాల్టి నుంచే సౌతాఫ్రికాతో ఫస్ట్‌ టెస్ట్‌

ఇయాల్టి నుంచే సౌతాఫ్రికాతో ఫస్ట్‌ టెస్ట్‌
  • కెప్టెన్​ విరాట్​ కోహ్లీపై  అందరి ఫోకస్​
  • బౌలర్లపైనే ప్రొటీస్‌‌ భారం
  • మధ్యాహ్నం 1.30 నుంచి స్టార్‌‌ స్పోర్ట్స్‌‌లో

ఇంగ్లండ్‌‌‌‌లో టెస్ట్‌‌ సిరీస్‌‌ గెలిచినం..! ఆస్ట్రేలియాలో కంగారూల అంతుచూసినం..! వెస్టిండీస్‌‌లో విశేషంగా రాణించినం..! ఇక మిగిలింది సౌతాఫ్రికా..! 1992 నుంచి పోరాటం చేస్తున్న సఫారీలు టెస్ట్‌‌ల్లో మనకు చిక్కడం లేదు..! ఆరు టూర్లలో ఒకటి, రెండు విక్టరీలు మినహా చెప్పుకోదగ్గ పెర్ఫామెన్స్‌‌ కూడా పెద్దగా లేవు..! ఈ నేపథ్యంలో టీమిండియా ఏడోసారి  ప్రొటీస్‌‌ టూర్‌‌కు సిద్ధమైంది..! మూడు టెస్ట్‌‌ల్లో భాగంగా ఇయాల్టి నుంచే ఇరు జట్ల మధ్య ఫస్ట్‌‌ టెస్ట్‌‌..! అప్పట్లో సౌతాఫ్రికాలో ఫస్ట్‌‌ టెస్ట్‌‌ విక్టరీని తెచ్చి పెట్టిన ఆనాటి కెప్టెన్‌‌ రాహుల్‌‌ ద్రవిడ్‌‌.. ఇప్పుడు చీఫ్‌‌ కోచ్‌‌గా వెన్నంటి ఉండగా, విరాట్‌‌సేన.. సిరీస్‌‌ను టార్గెట్‌‌గా పెట్టుకుంది..! మరి ఈసారైనా ఆ కల తీరేనా? సఫారీలపై విక్టరీ సవారీ చేస్తారా?

సెంచూరియన్‌‌‌‌: ఓవైపు కొవిడ్‌‌ కొత్త భయాలు వెంటాడుతున్నా.. మరోవైపు టీమిండియా సఫారీ టూర్‌‌కు రంగం సిద్ధమైంది. టూర్​కు ముందే  వన్డే కెప్టెన్సీ విషయంలో ఇండియా క్యాంప్‌‌లో వివాదాలు మొదలైనా.. వాటిని పట్టించుకోకుండా టీమ్‌‌ను నడిపించేందుకు సిద్ధమవుతున్న కింగ్‌‌ కోహ్లీకి.. కెప్టెన్‌‌గా ఇదో పెద్ద అగ్ని పరీక్ష.  ఈ టూర్‌‌లో బ్యాటర్​, కెప్టెన్​గా సక్సెస్‌‌పైనే తన ఫ్యూచర్‌‌ ఆధారపడి ఉంటుందన్నది నమ్మలేని నిజం. ఈ నేపథ్యంలో ఆదివారం నుంచి మొదలయ్యే ఫస్ట్‌‌ టెస్ట్‌‌ (బాక్సింగ్‌‌ డే)లో టీమిండియా.. సౌతాఫ్రికాతో అమీతుమీ తేల్చుకోనుంది. ఎక్స్‌‌పీరియెన్స్‌‌, స్ట్రెంత్‌‌, స్కిల్స్‌‌.. ఇలా ఒక్కో అంశాన్ని బేరీజు వేసుకుంటే కోహ్లీసేనదే పైచేయిగా ఉన్నా.. సఫారీలకు లోకల్‌‌ అడ్వాంటేజ్‌‌ ప్లస్​ పాయింట్​కానుంది. అయితే ఇప్పుడున్న పరిస్థితుల్లో వెదర్‌‌ కండీషన్స్‌‌ బట్టి కోహ్లీ ఎలాంటి కాంబినేషన్‌‌ను ఎంచుకుంటాడన్నదే ఆసక్తిగా మారింది. సీనియర్లకు చెక్‌‌ పెట్టి కుర్రాళ్లకు చాన్స్‌‌ ఇస్తాడా? లేక ఎక్స్‌‌పీరియెన్స్‌‌కే పెద్ద పీట వేస్తాడా? అన్నది చూడాలి. మరోవైపు ఇరు జట్ల బౌలింగ్‌‌ సూపర్బ్‌‌గా ఉన్నా.. బ్యాటింగ్‌‌లో సౌతాఫ్రికాకు ఇబ్బందులు ఉన్నాయి. 
రహానెకు చాన్స్​ ఇస్తారా?
వైట్‌‌బాల్‌‌ ఫార్మాట్‌‌ కొత్త కెప్టెన్‌‌ రోహిత్‌‌ శర్మ ఈ టూర్‌‌కు అందుబాటులో లేకపోవడంతో కేఎల్‌‌ రాహుల్‌‌తో పాటు మయాంక్‌‌ అగర్వాల్‌‌ ఇన్నింగ్స్‌‌ను ఓపెన్‌‌ చేస్తాడు. తర్వాత పుజారా, కోహ్లీ ప్లేస్‌‌లు ఖాయంగా కనిపిస్తున్నాయి. గత కొంత కాలంగా పుజారా పెద్దగా ఫామ్‌‌లో లేకపోయినా.. సఫారీ గడ్డపై ఉన్న ట్రాక్‌‌ రికార్డు పరంగా అతన్ని కొనసాగించే చాన్సెస్‌‌ ఎక్కువగా ఉన్నాయి. పుజారాతో పాటు కోహ్లీ  తన బ్యాట్​కు పని చెప్పాల్సిన అవసరం ఉంది. ఇక,  ఐదో ప్లేస్‌‌పైనే గందరగోళం నెలకొంది. వైస్​ కెప్టెన్సీ కోల్పోయిన అజింక్యా రహానెను ఆడిస్తారా.. శ్రేయస్‌‌ అయ్యర్‌‌, హనుమ విహారిలో ఒకర్ని తీసుకుంటారా? అనేది తేలాలి. ప్రస్తుతం రహానె ఫామ్‌‌లో లేడు. అందుకే న్యూజిలాండ్‌‌తో సెకండ్​ టెస్ట్‌‌లో తనను బెంచ్​పై ఉంచారు.  అతని ప్లేస్‌‌లో వచ్చిన అయ్యర్‌‌ సెంచరీ, హాఫ్‌‌ సెంచరీతో దుమ్మురేపాడు. ఇక విహారి నెల కిందటే సౌతాఫ్రికా వచ్చి ఇండియా–ఎ తరఫున మ్యాచ్‌‌లు ఆడాడు. ఈ లెక్కన అతనికే చాన్స్​ ఇవ్వాల్సి ఉంటుంది.  వికెట్‌‌ కీపర్‌‌ కమ్‌‌ బ్యాటర్‌‌గా పంత్‌‌ ప్లేస్‌‌ ఖాయం. ఐదుగురు బౌలర్ల స్ట్రాటజీని కంటిన్యూ చేస్తామని ఇప్పటికే వైస్‌‌ కెప్టెన్‌‌ రాహుల్‌‌ హింట్స్‌‌ ఇచ్చాడు. కాబట్టి నలుగురు పేసర్లు, ఒక స్పిన్నర్‌‌తో బరిలోకి దిగొచ్చు. అదే జరిగితే పేసర్లుగా బుమ్రా, షమీ, ఆల్‌‌రౌండర్‌‌గా శార్దూల్‌‌ ఫైనల్‌‌ ఎలెవన్‌‌లో ఉంటారు. ఫోర్త్‌‌ పేసర్‌‌ కోసం సిరాజ్‌‌, ఇషాంత్‌‌ మధ్య పోటీ ఉంటుంది. ఏకైక స్పిన్నర్‌‌గా అశ్విన్‌‌కే మొగ్గుంది.  మొత్తంగా  బౌలింగ్‌‌లో బాగానే ఉన్నా.. బ్యాటింగ్‌‌ కాంబినేషన్‌‌పైనే టీమిండియా ఎక్కువగా ఫోకస్‌‌ చేయాల్సిన అవసరం ఉంది. అదే టైమ్​లో బ్యాట్​, బాల్​తో రాణిస్తేనే గెలుపు ఆశించొచ్చు.
వాళ్లకు బౌలింగే దిక్కు..
సౌతాఫ్రికాలో అన్ని బౌన్సీ పిచ్‌‌‌‌లే. అందుకు అనుగుణంగానే సఫారీలు కూడా ఐదుగురు టాప్​ క్లాస్‌‌ బౌలర్లను రంగంలోకి దించుతున్నారు. సో ఫస్ట్‌‌ బాల్‌‌ నుంచే కచ్చితంగా ఇండియాకు ఇబ్బందులు తప్పవు. ఇప్పుడున్న పరిస్థితుల్లో ప్రొటీస్‌‌ బ్యాటింగ్‌‌ కంటే బౌలింగ్‌‌పైనే ఎక్కువగా దృష్టి పెట్టింది. ఫామ్​లో ఉన్న పేసర్​ అన్రిచ్‌‌ నోర్జ్‌‌ ఈ టూర్‌‌కు అందుబాటులో లేకపోవడం ఇండియాకు ప్లస్‌‌ పాయింటే. కానీ, రబాడ, ఎంగిడి, ఒలివర్‌‌ నుంచి కచ్చితంగా ప్రమాదం పొంచి ఉంది. ముల్డర్‌‌ను కూడా తక్కువగా అంచనా వేసే పరిస్థితి లేదు. కేశవ్‌‌ మహారాజ్‌‌ స్పిన్‌‌ బాధ్యతలను మోయనున్నాడు. బ్యాటింగ్‌‌లో ఎల్గర్‌‌, డికాక్‌‌కు ఇంటర్నేషనల్​ ఎక్స్‌‌పీరియెన్స్‌‌ ఎక్కువగా ఉంది. మార్‌‌క్రమ్‌‌, పీటర్సన్‌‌, డుసెన్‌‌, బవూమ అండగా నిలిస్తే.. భారీ స్కోరును ఆశించొచ్చు. సింపుల్‌‌గా చెప్పాలంటే ఈ సిరీస్‌‌ మొత్తం ఇండియా బ్యాటర్లకు.. సఫారీ బౌలర్లకు మధ్యనే పోటీ ఉండొచ్చు.