భారత్, అమెరికా మధ్య బిగ్ డిఫెన్స్ డీల్... రూ.825 కోట్ల వెపన్స్ అమ్మేందుకు ట్రంప్ ఓకే

భారత్, అమెరికా మధ్య బిగ్ డిఫెన్స్ డీల్... రూ.825 కోట్ల వెపన్స్ అమ్మేందుకు ట్రంప్ ఓకే
  • 100 ఎఫ్​జీఎం-148 జావెలిన్ మిసైల్స్216 ఎక్స్ క్యాలిబర్ ఆర్టిలరీ రౌండ్లు రెండు విడతల్లో డెలివరీకి ఆమోదం
  • రూ.825 కోట్ల వెపన్స్ అమ్మేందుకు ట్రంప్ ఆమోదం 
  • 100 ఎఫ్ జీఎం–148 జావెలిన్ మిసైల్స్
  • 216 ఎక్స్ క్యాబర్ ఆర్టిలరీ రౌండ్లు
  • రెండు విడతల్లో డెలివరీకి ఓకే 

వాషింగ్టన్: భారత్, అమెరికా మధ్య కీలక డిఫెన్స్ ఒప్పందం కుదిరింది. ఇండియాకు రూ.825 కోట్లు (93 మిలియన్ డాలర్లు) విలువ చేసే ఆయుధాలు అమ్మేందుకు అమెరికా గ్రీన్​సిగ్నల్ ఇచ్చింది. ఈ ఒప్పందంలో భాగంగా అత్యాధునిక ‘జావెలిన్ మిస్సైల్ సిస్టమ్’ (భుజంపై నుంచి ప్రయోగించే యాంటీ- ట్యాంక్ క్షిపణి) ఇండియాకు రానున్నది. అదేవిధంగా 216 ఎక్స్‌‌‌‌ క్యాలిబర్ ప్రెసిషన్ -గైడెడ్ ఆర్టిలరీ రౌండ్ల కొత్త బ్యాచ్‌‌‌‌ను కూడా అందించేందుకు అమెరికా ఒప్పుకున్నది. ఈ డీల్ కు అమెరికా డిఫెన్స్ సెక్యూరిటీ కోఆపరేషన్ ఏజెన్సీ(డీఎస్​సీఏ) ఆమోదం తెలిపింది. 

ఈ ప్యాకేజీలో 100 ఎఫ్​జీఎం–-148 జావెలిన్ క్షిపణులు, 25 తేలికపాటి కమాండ్ లాంచ్ యూనిట్లు, 216 ఎక్స్‌‌‌‌క్యాలిబర్ ఆర్టిలరీ రౌండ్లు ఉన్నాయి. ఈ డీల్.. ఇండియా, అమెరికా మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని బలోపేతం చేస్తుందని, రక్షణ రంగంలో ఇండియా సత్తాను మరింత పెంచుతుందని అమెరికా తెలిపింది. కాగా, జావెలిన్ యాంటీ ట్యాంక్ మిస్సైల్ సిస్టమ్ ఖరీదు సుమారు రూ.405 కోట్లు ఉంది. అదేవిధంగా, రూ.417 కోట్లు విలువైన ఎక్స్‌‌‌‌క్యాలిబర్ ప్రొజెక్టైల్స్ వంటి పరికరాలను అమెరికా ఇండియాకు అందించనున్నది. 

ఎక్స్‌‌‌‌క్యాలిబర్ అనేది జీపీఎస్ ఆధారిత ప్రెసిషన్-గైడెడ్ ఆర్టిలరీ షెల్. ఇది క్షిపణి దాడుల్లో అత్యంత కచ్చితత్వాన్ని అందిస్తుంది. ఒప్పందంలో భాగంగా.. రూ.825 కోట్లు విలువ చేసే ఆయుధాలు ఇండియాకు రెండు విడతల్లో అందనున్నాయి. తొలి విడతలో ఎఫ్‌‌‌‌జీఎం148 మిస్సైల్స్, 25 జావెలిన్ లైట్ వెయిట్ కమాండ్ లాంచ్ యూనిట్లు ఇండియాకు రానున్నాయి.  

జావెలిన్ ప్రయోగిస్తే.. బంకర్లు, ట్యాంకర్లు మటాషే..   

జావెలిన్‌‌‌‌ అనేది అమెరికాకు చెందిన రక్షణ రంగ దిగ్గజాలు రేథియాన్, లాక్ హీడ్ మార్టిన్ జాయింట్ వెంచర్ అభివృద్ధి చేసిన యాంటీ ట్యాంక్ గైడెడ్ మిస్సైల్(ఏటీజీఎం). దీనిని భుజంపై నుంచి శత్రు ట్యాంకులపైకి గురిపెట్టి ప్రయోగించొచ్చు. ట్యాంకులు, బంకర్లు, బలమైన స్థావరాలను 94% కచ్చితత్వంతో ఇది నాశనం చేయగలదు. పగలు, రాత్రితో సంబంధం లేకుండా అన్ని వాతావరణ పరిస్థితుల్లోను ప్రయోగించొచ్చు. 

ఇది 65 మీటర్ల నుంచి 4 కిలోమీటర్ల లోపు లక్ష్యాలను చేధించగలదు. దీనిని ఒకసారి ప్రయోగించాక మరలా కంట్రోల్ చేయాల్సిన అవసరముండదు. క్షిపణిలో అమర్చిన ఇన్‌‌‌‌ఫ్రారెడ్ సీకర్.. తనంతట తానుగా లక్ష్యంవైపు దూసుకెళ్లి, ఛేదిస్తుంది. పొగలు వెలువడకుండా దీనిని ప్రయోగించే అవకాశం ఉండటంతో శత్రువుల సెన్సర్లకు కూడా చిక్కదు. ఆపరేటర్ దీన్ని ప్రయోగించిన తర్వాత సురక్షిత ప్రదేశానికి వెళ్లిపోవచ్చు. అఫ్గాన్, ఇరాక్ యుద్ధంలో అమెరికా బలగాలు వీటిని వేలాదిగా ఉపయోగించాయి. ప్రస్తుతం రష్యాతో యుద్ధంలోనూ ఉక్రెయిన్‌‌‌‌కు అండగా నిలుస్తుండటంతో ఇది ప్రపంచం దృష్టిని ఆకర్షిస్తున్నది.