చాంగ్వాన్: ఇండియా వెటరన్ షూటర్ మేరాజ్ అహ్మద్ ఖాన్ చరిత్ర సృష్టించాడు. 46 ఏండ్ల లేటు వయసులో కెరీర్‌లో గుర్తిండిపోయే విజయం సాధించాడు. ఐఎస్‌ఎస్‌ఎఫ్ వరల్డ్ కప్ మెన్స్ స్కీట్‌లో ఇండియాకు గోల్డ్ మెడల్ అందించిన తొలి షూటర్‌గా రికార్డుకెక్కాడు. సోమవారం జరిగిన ఫైనల్లో 40 షాట్లకు గాను 37 పాయింట్లు స్కోరు చేసిన మేరాజ్ గోల్డ్ కైవసం చేసుకొని ఈ ఘనత సాధించాడు. కొరియాకు చెందిన మిన్సు కిమ (36) సిల్వర్ నెగ్గగా, బ్రిటన్ షూటర్ బెన్ లెవెలిన్ (26) బ్రాంజ్ గెలిచాడు. ఉత్తరప్రదేశ్‌కు చెందిన అహ్మద్ ఖాన్ గోల్డ్ నెగ్గే క్రమంలో గట్టి పోటీ ఎదుర్కొని అద్భుత పెర్పామెన్స్ చేస్తూ ముందుకొచ్చాడు. రెండు రోజుల పాటు సాగిన క్వాలిఫికేషన్ రౌండ్‌లో 125కి గాను అతను 119 స్కోరుతో ఎనిమిదో ప్లేస్ సాధించాడు. మరో నలుగురు కూడా అంతే స్కోరు సాధించడంతో చివరి రెండు క్వాలిఫికేషన్ స్థానాల కోసం షూటాఫ్ నిర్వహించారు. షూటాఫ్‌లో మేరాజ్12 పాయింట్లు స్కోరు చేసి ఎనిమిదో ప్లేస్‌తో ర్యాంకింగ్ రౌండ్‌కు అర్హత సాధించాడు. ర్యాంకింగ్ రౌండ్‌లో స్వెన్ కార్టె (జర్మనీ), మింకి చొ (కొరియా), నికోలస్ వసిలొ (సైప్రస్)తో పోటీ పడ్డ ఇండియా షూటర్ 30 టార్గెట్లకు గాను 27 స్కోరుతో నలుగురిలో టాప్ ప్లేస్‌లో నిలిచి ఫైనల్‌కు వచ్చాడు. నలుగురితో జరిగిన తుదిపోరులో అహ్మద్ ఖాన్, కొరియా షూటర్ మిన్సు పోటాపోటీగా తలపడ్డారు. 40 షాట్లలో కేవలం మేరాజ్ మూడింటిని మాత్రమే మిస్ చేయగా.. మిన్సు నాలుగు షాట్లు మిస్ చేసి సిల్వర్‌కు పరిమితం అయ్యాడు. ఈ టోర్నీలో ఆడుతున్న ఇండియా టీమ్‌లో వయసులో పెద్దోడైన మేరాజ్ 2016 వరల్డ్ కప్‌లో సిల్వర్ మెడల్ గెలిచాడు.
అంజుమ్ టీమ్‌కు బ్రాంజ్
విమెన్స్ స్టార్ షూటర్ అంజుమ్ మౌద్గిల్ టోర్నీలో మరో పతకం గెలిచింది. విమెన్స్ 50మీ. రైఫిల్ 3 పొజిషన్ టీమ్ ఈవెంట్‌లో అంజుమ్, అషి చౌక్సే, సిఫ్ట్ కౌర్‌తో కూడిన ఇండియా బ్రాంజ్ నెగ్గింది.
బ్రాంజ్ మెడల్ ప్లే ఆఫ్ మ్యాచ్‌లో ఇండియా జట్టు 16–6తో కొరియాను ఓడించింది. కాగా, మెన్స్ 25 మీ. ర్యాపిడ్ ఫైర్ పిస్టల్ పోటీల్లో విజయ్‌వీర్ సిద్దూ మెడల్ రౌండ్‌కు క్వాలిఫై అయినా మెడల్ రౌండ్స్ దగ్గరికి రాలేకపోయాడు. అనీశ్, సమీర్ క్వాలిఫయింగ్ రౌండ్‌లోనే వెనుదిరిగారు.
