బాక్సింగ్ డే టెస్టులో టీమిండియాను అజింక్యా రహానె సక్సెస్‌ఫుల్‌గా నడిపించగలడని సీనియర్ ఫాస్ట్ బౌలర్ ఇషాంత్ శర్మ అన్నాడు. విరాట్ కోహ్లీ గైర్హాజరీలో భారత్‌కు నడిపించే సత్తా రహానేకు ఉందన్నాడు. తొలి టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో 36 రన్స్‌కే భారత్ కుప్పుకూలిన నేపథ్యంలో జట్టులో ఆత్మస్థైర్యం నింపాల్సిన అవసరం ఉంది. ఆ సత్తా రహానేకు ఉందని ఇషాంత్ ఆశాభావం వ్యక్తం చేశాడు.
‘రహానె మీద నాకు పూర్తి నమ్మకం ఉంది. అతడు బౌలర్ల కెప్టెన్. మేం చాలా మ్యాచుల్లో కలసి ఆడాం. విరాట్ జట్టులో లేనప్పుడు అజింక్యా ఫీల్డింగ్ సెట్ చేసేవాడు. బౌలర్లకు ఎలాంటి ఫీల్డింగ్ కావాలని, ఎప్పుడు బౌలింగ్ చేయాలనుకుంటున్నారోనని అడిగి తెలుసుకునేవాడు. అది చేయండి, ఇది చేయండని అనేవాడు కాదు. ప్రత్యర్థి బ్యాట్స్‌మెన్ పార్ట్‌నర్‌షిప్ నమోదు చేసినప్పుడు, పిచ్ ఫ్లాట్‌గా ఉన్నప్పుడు, మ్యాచ్ చేజారుతున్న తరుణంలో మంచి ఎనర్జీతో అందరిలో విశ్వాసం నింపే కెప్టెన్ కావాలి. అలాంటి స్కిల్స్ రహానేలో ఉన్నాయి. ఒత్తిడి పరిస్థితుల్లోనూ టీమ్‌ను నడిపించే సత్తా అతడికి ఉంది’ అని ఇషాంత్ పేర్కొన్నాడు.

