
మాంచెస్టర్ వేదికగా బుధవారం (జూలై 23) ఇండియా, ఇంగ్లాండ్ జట్ల మధ్య నాలుగో టెస్ట్ జరగనుంది. ఈ మ్యాచ్ లో టీమిండియా గెలవడం అత్యంత కీలకం. ఐదు మ్యాచ్ ల టెస్ట్ సిరీస్ లో 1-2తో వెనకబడిన గిల్ సేన ఈ టెస్టులో ఓడిపోతే సిరీస్ కోల్పోతుంది. దీంతో ఎలాగైనా ఈ మ్యాచ్ లో గెలిచేందుకు తీవ్ర కసరత్తులు చేస్తుంది. మరో వైపు ఇప్పటికే 2 టెస్టులు గెలిచిన ఇంగ్లాండ్ ఈ మాంచెస్టర్ టెస్టులోనూ గెలిచి చివరి టెస్ట్ మిగిలి ఉండగానే సిరీస్ కైవసం చేసుకోవాలని భావిస్తోంది. మ్యాచ్ జరగబోయే ఓల్డ్ ట్రాఫర్డ్ పిచ్ ఎలా ఉంటుందో ఇప్పుడు చూద్దాం..
మాంచెస్టర్‌లోని ఓల్డ్ ట్రాఫోర్డ్ పిచ్ సహజంగానే పేస్ తో పాటు బౌన్స్‌ను అనుకూలిస్తుంది. ఓల్డ్ ట్రాఫోర్డ్ పిచ్ ఎడ్జ్‌బాస్టన్ మాదిరిగానే కనిపిస్తుంది. పిచ్‌పై ఎక్కువగా గడ్డి ఉంది. ఇండియా, ఇంగ్లాండ్ సిరీస్‌లోని మొదటి మూడు టెస్ట్ మ్యాచ్‌లలో చూసినట్లుగా, మ్యాచ్ ప్రారంభానికి ముందు పిచ్ పై చాలా గడ్డి ఉంటుంది. టెస్ట్ సమయంలో వర్షం పడే అవకాశం ఉన్నందున, పరిస్థితులు ఫాస్ట్ బౌలర్లకు అనుకూలంగా ఉండే అవకాశం ఉంది. ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే ఇటీవలి కాలంలో పిచ్ ఉపరితలం నెమ్మదిగా మారింది. అందువల్ల స్పిన్నర్లు ఈ మ్యాచ్ లో కీలక పాత్ర పోషించే అవకాశం ఉంది. మాంచెస్టర్‌లో ఇరు జట్లు ఇద్దరు స్పిన్నర్లతో బరిలోకి దిగవచ్చు.
Also Read : నాకు కోహ్లీ, దేవుడు ఇద్దరూ ఒకటే
ఈ మ్యాచ్ లో టీమిండియా మూడు మార్పులతో బరిలోకి దిగే అవకాశం కనిపిస్తుంది. బ్యాటింగ్ లో టీమిండియా ఒక్క మార్పుతో బరిలోకి దిగే అవకాశం ఉంది. నితీష్ రెడ్డి స్థానంలో వికెట్ కీపర్ ధృవ్ జురెల్ జట్టులోకి రావడం దాదాపుగా ఖాయమైంది. బౌలింగ్ లో గాయపడిన ఆకాష్ దీప్ స్థానంలో కొత్త కుర్రాడు అన్షుల్ కంబోజ్ వచ్చే అవకాశం ఉంది. సుందర్ స్థానంలో స్పెషలిస్ట్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ ను ఆడించే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. ఆతిథ్య ఇంగ్లాండ్ ఈ మ్యాచ్ లో ఒక మార్పుతో బరిలోకి దిగుతుంది. లార్డ్స్ వేదికగా జరిగిన మూడో టెస్టులో గాయపడిన షోయబ్ బషీర్ స్థానంలో ఆఫ్ స్పిన్నర్ లియామ్ డాసన్‌ను ఇంగ్లాండ్ తుది జట్టులో చోటు కల్పించింది.