స్పిన్ పిచ్ అంటే ఎందుకు భయం?

స్పిన్ పిచ్ అంటే ఎందుకు భయం?

ఇంగ్లండ్-ఇండియా మధ్య జరిగిన మూడో టెస్టు రెండ్రోజుల్లోనే ముగిసింది. దీంతో మొతేరా పిచ్‌‌పై వివాదం చెలరేగుతోంది. పిచ్ మీద విపరీతంగా స్పిన్ అవ్వడం, వికెట్లు టపటపాకూలడంతో ఇరు జట్ల బ్యాట్స్‌‌మెన్ రెండంకెల స్కోరు చేయడానికీ ఆపసోపాలు పడ్డారు. ఈ నేపథ్యంలో ఇంగ్లండ్ సీనియర్ క్రికెటర్లు మైకేల్ వాన్‌‌తో అలిస్టర్ కుక్ మొతేరా పిచ్‌‌ను విమర్శిస్తూ కామెంట్లు చేశారు. అయితే ఈ విమర్శలపై ఆస్ట్రేలియా స్పిన్నర్ నాథన్ లయన్ సీరియస్ అయ్యాడు. పిచ్‌‌ స్పిన్‌‌కు సహకరిస్తే తప్పేంటని ప్రశ్నించాడు. పిచ్‌‌ స్పిన్నర్లకు సహకరిస్తే ఎందుకు ఏడుస్తారంటూ దీటైన్ కౌంటర్ ఇచ్చాడు.

‘మేం ప్రపంచవ్యాప్తంగా సీమింగ్ వికెట్ల మీద ఆడుతుంటాం. ఆ వికెట్ల పైనా 47, 60 పరుగులకు ఆలౌట్ అయిన సందర్భాలు ఉన్నాయి. కానీ దీని గురించి ఎవరూ మాట్లాడరు. అయితే పిచ్ మీద స్పిన్ అవ్వడం మొదలైతే మాత్రం అందరికీ భయమే. స్పిన్ స్టార్ట్ అయ్యిందంటూ అందరూ ఏడ్వడం మొదలెడతారు. ఇదేంటో నాకు అర్థం అవ్వడం లేదు. మొతేరాలో పిచ్‌‌ను తయారు చేసిన పిచ్ క్యూరేటర్‌‌ను సిడ్నీ క్రికెట్ గ్రౌండ్‌‌కు పిలిపించాలని ఉంది’ అని లయన్ పేర్కొన్నాడు.