నేడు నెదర్లాండ్స్‌‌‌‌తో ఇండియా మ్యాచ్‌‌

నేడు నెదర్లాండ్స్‌‌‌‌తో ఇండియా మ్యాచ్‌‌

సిడ్నీ: చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్‌‌‌‌‌‌‌‌‌‌పై అద్భుత విజయం తర్వాత  టీ20  వరల్డ్‌‌‌‌కప్‌‌‌‌లో ఇండియా రెండో పోరుకు సిద్ధమైంది. గురువారం జరిగే సూపర్‌‌‌‌12 గ్రూప్‌‌‌‌2 పోరులో నెదర్లాండ్స్‌‌‌‌తో పోటీ పడనుంది. ప్రత్యర్థి చిన్న జట్టు కావడంతో ఇండియాకు పెద్దగా సవాల్‌‌‌‌ ఎదురయ్యే అవకాశం కనిపించడం లేదు. ఈ మ్యాచ్‌‌‌‌లో విజయం పెద్ద కష్టమేం కాదు. కాబట్టి పాక్‌‌‌‌పై తడబడిన టాప్‌‌‌‌4లోని ముగ్గురు బ్యాటర్లు కేఎల్‌‌‌‌ రాహుల్‌‌‌‌, రోహిత్‌‌‌‌ శర్మ, సూర్యకుమార్‌‌‌‌ ఫామ్‌‌‌‌లోకి వచ్చేందుకు ఈ పోరును సద్వినియోగం చేసుకోవాలని ఇండియా భావిస్తోంది. రోహిత్‌‌‌‌ సేన తదుపరి పోరులో పెద్ద జట్టు సౌతాఫ్రికాను ఎదుర్కోనుంది. ఆ మ్యాచ్‌‌‌‌ ఫలితం పాయింట్ల పట్టికలో ముందుకెళ్లేందుకు కీలకం కానుంది. ఈ నేపథ్యంలో సఫారీలతో సవాల్‌‌‌‌కు ముందు రాహుల్‌‌‌‌, రోహిత్‌‌‌‌, సూర్య తక్షణమే గాడిలో పడాల్సిన అవసరం కూడా ఉంది.

ఫ్రెడ్‌‌‌‌ క్లాసెన్‌‌‌‌, డి లీడె, టిమ్‌‌‌‌ ప్రింగిల్‌‌‌‌, సఫారీ మాజీ లెఫ్టార్మ్‌‌‌‌ స్పిన్నర్‌‌‌‌  వాండర్‌‌‌‌ మెర్వేతో కూడిన నెదర్లాండ్స్‌‌‌‌ బౌలింగ్‌‌‌‌ యూనిట్‌‌‌‌లో ఒక్క మెర్వేకు మాత్రమే గతంలో ఐపీఎల్‌‌‌‌ ఆడిన అనుభవం ఉంది. అయితే, హోబర్ట్‌‌‌‌లో  లీగ్‌‌‌‌ స్టేజ్‌‌‌‌తో పాటు బంగ్లాదేశ్‌‌‌‌తో మ్యాచ్‌‌‌‌లో ఆ టీమ్‌‌‌‌ బౌలర్లు బాగానే బౌలింగ్‌‌‌‌ చేశారు. కానీ, ఇప్పుడు సిడ్నీ గ్రౌండ్‌‌‌‌లో నాణ్యమైన ఇండియన్‌‌‌‌ బ్యాటింగ్‌‌‌‌ ఎటాక్‌‌‌‌ను ఎదుర్కోవడం వాళ్లకు అంత ఈజీ కాబోదు. ఇదే గ్రౌండ్‌‌‌‌లో సూపర్‌‌‌‌ 12 తొలి పోరులో ఆసీస్‌‌‌‌పై న్యూజిలాండ్‌‌‌‌ 200 స్కోరు చేసింది. బ్యాటింగ్‌‌‌‌ ట్రాక్ కాబట్టి టాస్‌‌‌‌ నెగ్గితే కెప్టెన్‌‌‌‌ రోహిత్‌‌‌‌ ఫస్ట్‌‌‌‌ బ్యాటింగ్‌‌‌‌ ఎంచుకొని ఆరంభం నుంచే ఎదురుదాడికి దిగే ఆలోచనతో ఉన్నాడు. ముందుగా బ్యాటింగ్‌‌‌‌ చేస్తే భారీ టార్గెట్‌‌‌‌ నిర్దేశించడంతో పాటు సఫారీలతో మ్యాచ్‌‌‌‌కు ముందు ఓపెనర్లతో పాటు సూర్యకుమార్‌‌‌‌  వీలైనన్ని ఎక్కువ పరుగులు చేసి టచ్‌‌‌‌లోకి వచ్చే అవకాశం లభిస్తుంది.

హార్దిక్‌‌‌‌ ఫిట్‌‌‌‌.. అదే జట్టుతో బరిలోకి
పాక్‌‌‌‌తో ఆడిన తుది జట్టునే ఈ మ్యాచ్‌‌‌‌లోనూ కొనసాగిస్తామని బౌలింగ్‌‌‌‌ కోచ్‌‌‌‌ పరాస్‌‌‌‌ మాంబ్రే బుధవారం స్పష్టం చేశాడు. పాక్‌‌‌‌తో పోరులో చివర్లో కాస్త అలసటకు గురై మంగళవారం ప్రాక్టీస్‌‌‌‌కు దూరంగా ఉన్న ఆల్‌‌‌‌రౌండర్‌‌‌‌ హార్దిక్‌‌‌‌ పాండ్యా ఫిట్‌‌‌‌గా ఉన్నాడని, అన్ని మ్యాచ్‌‌‌‌ల్లోనూ తను బరిలోకి దిగుతాడని చెప్పాడు. పాక్‌‌‌‌పై అద్భుత విజయం సాధించినప్పటికీ ఈ మెగా టోర్నీలో ఇండియా బెస్ట్‌‌‌‌ ఫైనల్‌‌‌‌ ఎలెవన్‌‌‌‌ను ఎంచుకోలేకపోతోందని విమర్శలు వస్తున్నాయి.  ముఖ్యంగా హిట్టర్‌‌‌‌ రిషబ్‌‌‌‌ పంత్‌‌‌‌ను పక్కనబెట్టడంపై పలువురు పెదవి విరుస్తున్నారు. ఈ ఫార్మాట్‌‌‌‌లో నాణ్యమైన స్పిన్నర్‌‌‌‌గా గుర్తింపు తెచ్చుకున్నప్పటికీ యుజ్వేంద్ర చహల్‌‌‌‌కు పాక్‌‌‌‌పై చాన్స్‌‌‌‌ రాలేదు. చివరి నిమిషంలో ఎవరికైనా గాయాలైతే తప్ప పేస్‌‌‌‌ బౌలింగ్‌‌‌‌ లైనప్‌‌‌‌ను మార్చే అవసరం కనిపించడం లేదు. 

నెదర్లాండ్స్‌‌‌‌ పోటీ ఇస్తుందా?
చిన్న జట్టే అయినప్పటికీ నెదర్లాండ్స్‌‌‌‌లో కొందరు నాణ్యమైన ప్లేయర్లు ఉన్నారు. వివిధ దేశాలకు చెందిన ప్లేయర్లు ఆ టీమ్‌‌‌‌కు ప్రాతినిధ్యం వహిస్తున్నారు.  ఐసీసీ వరల్డ్‌‌‌‌ వన్డే లీగ్‌‌‌‌ ఆడటం మొదలు పెట్టిన తర్వాత పలువురికి సెంట్రల్‌‌‌‌ కాంట్రాక్టులు కూడా దక్కాయి. ఆస్ట్రేలియా అండర్‌‌‌‌19 మాజీ ప్లేయర్‌‌‌‌ టామ్‌‌‌‌ కూపర్‌‌‌‌కు బీబీఎల్‌‌‌‌లో ఆడిన అనుభవం ఉంది. ఇండియాకు చెందిన విక్రమ్‌‌‌‌జిత్‌‌‌‌ సింగ్‌‌‌‌ కూడా టాలెంటెడ్‌‌‌‌ ప్లేయరే. టిమ్‌‌‌‌ ప్రింగిల్‌‌‌‌, లీడెపై కూడా అంచనాలు ఉన్నాయి. అయితే, బలమైన ఇండియాకు వీళ్లు ఏ మేరకు పోటీ ఇస్తారో చూడాలి.