అహ్మదాబాద్ గడ్డపై న్యూజిలాండ్‌తో అల్టిమేట్ టైటిల్ ఫైట్‌కు సూర్యకుమార్ సేన సిద్ధమైంది.! ఈ ఫార్మాట్‌లో ఎవ్వరికీ సాధ్యం కాని ఘనతలను సొంతం చేసుకునేందుకు ఇండియా వేయాల్సింది మరొక్క అడుగే.. గెలవాల్సింది ఇంకొక్క మ్యాచ్‌లోనే.. పడగొట్టాల్సింది ఒక్క న్యూజిలాండ్‌నే..! స్టేడియంలో లక్షల మంది దన్ను, కోట్లాది మంది అభిమానుల ఆశీస్సులతో బరిలోకి దిగుతున్న టీమిండియా మూడోసారి జగజ్జేతగా నిలవాలి అహ్మదాబాద్‌కు ‘బాద్‌షా’ అవ్వాలని దేశమంతా విజయీభవ అని దీవిస్తోంది..!
అహ్మదాబాద్: నెల రోజులుగా క్రికెట్ ప్రపంచాన్ని ఉర్రూతలూగిస్తున్న టీ20 వరల్డ్ కప్ కథ క్లైమాక్స్‌కు వచ్చేసింది. ఓవైపు ఫేవరెట్ హోదాకు న్యాయం చేస్తూ దూసుకొచ్చిన టీమిండియా.. ఇంకోవైపు అంచనాలను మించి రాణిస్తున్న న్యూజిలాండ్ వరల్డ్ లార్జెస్ట్ నరేంద్ర మోదీ స్టేడియంలో ఆదివారం జరిగే అంతిమ పోరులో అమీతుమీ తేల్చుకోనున్నాయి. ఈ సమ ఉజ్జీల సమరంలో ఇండియా వంద కోట్ల ప్రజల అంచనాల భారాన్ని మోస్తూ బరిలోకి దిగుతోంది.
2023 నవంబర్ 19న ఇదే స్టేడియంలో వన్డే వరల్డ్ కప్ ఫైనల్‌లో ఆస్ట్రేలియా చేతిలో ఇండియా ఓడిపోయినప్పుడు రోహిత్ శర్మ కన్నీటి పర్యంతం అవ్వగా.. 93 వేల మంది ప్రేక్షకులు ఉన్న స్టేడియం మొత్తం మూగబోయింది. ఆ బాధను మోస్తూ వచ్చిన ఇండియా 2024లో టీ20 కప్ గెలవగా.. రోహిత్ చేదు జ్ఞాపకాలను కొంతవరకు తుడిచేశాడు.
ఇప్పుడు సూర్యకుమార్ యాదవ్ కెప్టెన్సీలో టీ20 వరల్డ్ కప్‌ను నిలబెట్టుకుని, ఈ ట్రోఫీని మూడుసార్లు గెలిచిన తొలి జట్టుగా చరిత్ర సృష్టించాలని ఇండియా చూస్తోంది. కెప్టెన్‌గా సూర్య తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపును ఏర్పరుచుకోవడంతో పాటు మోదీ స్టేడియంలో 2023 వన్డే వరల్డ్ కప్ ఓటమి వేదనకు పూర్తిగా ముగింపు పలకాలని అనుకుంటున్నాడు. మరోవైపు ఇప్పటివరకూ ఒక్క ఐసీసీ వరల్డ్ కప్ నెగ్గలేకపోయిన న్యూజిలాండ్ ఈ సారైనా ఆ లోటును పూడ్చుకోవాలని చూస్తోంది.
కెప్టెన్ సూర్య ఫామ్‌పై టెన్షన్..
వరుసగా రెండు ఫిఫ్టీలతో సూపర్ ఫామ్‌లో ఉన్న సంజూ శాంసన్ ఈ మ్యాచ్‌లోనూ కీలకం కానున్నాడు. తను అదే జోరును కొనసాగిస్తే జట్టుకు తిరుగుండదు. వన్‌డౌన్‌లో వస్తున్న ఇషాన్ కిషన్ మళ్లీ జోరందుకోవాలని మేనేజ్‌మెంట్ ఆశిస్తోంది. ఇక, కెప్టెన్‌గా సూర్యకుమార్ గత రెండేళ్లుగా జట్టును అద్భుతంగా నడిపించాడు. కానీ బ్యాటర్‌గా పెద్ద మ్యాచ్‌ల్లో, బలమైన జట్లపై తను పెద్దగా రాణించలేదు.
ఫైనల్లో బాగా ఆడితే తనపై ఉన్న ఆ విమర్శలను అతను పూర్తిగా చెరిపేస్తాడు. తను ఫామ్‌లోకి వస్తే మాత్రం అహ్మదాబాద్‌లో పరుగుల పండగ పక్కా. అటు ఫినిషర్‌గానే కాకుండా మిడిలార్డర్‌లో పంపినా హిట్ అవుతున్న ఆల్‌రౌండర్ శివమ్ దూబే జట్టుకు అదనపు బలం. లోయర్ ఆర్డర్‌కు వెళ్లిన తర్వాత భారీ షాట్లతో విరుచుకుపడుతున్న తిలక్ వర్మతో పాటు ఇక పెద్ద మ్యాచ్‌ల్లో తన మార్కు చూపెట్టే స్టార్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా కూడా తుదిపోరులో కీలకం కానున్నారు.
ఫైనల్లో అయినా అభి‘షేక్’ చేస్తాడా ?
ఈ టోర్నీలో వరల్డ్ నంబర్ వన్ బ్యాటర్ అభిషేక్ శర్మ బ్యాటింగ్ టెక్నిక్‌లో లోపాలు స్పష్టంగా బయటపడ్డాయి. ఒకవేళ తను ఫైనల్ ఆడితే, కివీస్ ఆఫ్ స్పిన్నర్ కోల్ మెకాంచీతో ముందుగానే బౌలింగ్ చేయించి దెబ్బకొట్టాలని చూస్తుంది. అలాగని అభిషేక్‌ను తప్పిస్తే మిడిలార్డర్ పై ఎక్కువ భారం పడుతుంది. దానికి తోడు ఫినిషర్ రింకూ సింగ్ కూడా ఫామ్‌లో లేడు. ఈ నేపథ్యంలో అభిని తప్పించే చాన్స్ లేనట్టే. కనీసం ఫైనల్లో అయినా అభిషేక్ తన మార్కు చూపిస్తాడేమో చూడాలి.
బుమ్రాపై బౌలింగ్ భారం
బౌలింగ్‌లో జట్టు భారం మొత్తం పేస్ లీడర్ జస్‌ప్రీత్ బుమ్రాపైనే ఉంది. రెండో సెమీస్‌లో ఇంగ్లండ్‌కు బుమ్రా దెబ్బ ఏంటో తెలిసింది. ఫైనల్లో బుమ్రా వేసే ఆ నాలుగు ఓవర్లే రెండు జట్ల మధ్య విజయావకాశాలను నిర్ణయిస్తాయి. సాధారణంగా బుమ్రాను ఇన్నింగ్స్ చివర్లో డెత్ ఓవర్లలో బౌలింగ్‌కు దించుతున్నారు. కానీ సెమీస్‌లో 33 బాల్స్‌లోనే సెంచరీ చేసిన ఫిన్ అలెన్‌ను కట్టడి చేయడానికి సూర్యకుమార్ బుమ్రాను ముందుగానే బౌలింగ్‌కు దించుతాడా అనేది ఆసక్తికరం. కానీ, గత పోరులో 250 ప్లస్ టార్గెట్‌ను కాపాడుకోవడానికి ఇండియా చివరి బాల్ వరకూ పోరాడింది. ఇంగ్లండ్ మాదిరిగా భారీ బ్యాటింగ్ లైనప్ ఉన్న కివీస్‌ను కట్టడి చేయాలంటే మరో పేసర్ అర్ష్‌దీప్‌తో పాటు మిగతా బౌలర్లు కూడా సరైన లైన్ అండ్ లెంగ్త్‌తో బౌలింగ్ చేయాల్సి ఉంటుంది.
వరుణ్ ప్లేస్‌లో కుల్దీప్!
స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి వరుసగా ఫెయిలవడం ఇండియాకు ఊహించని సమస్య. తన బౌలింగ్‌లో మిస్టరీ తగ్గిపోయింది. మంచి బ్యాటింగ్ పిచ్‌లపై బ్యాటర్లను ఏమాత్రం ఇబ్బంది పెట్టలేకపోతున్నాడు. రైట్ హ్యాండ్ బ్యాటర్లు అతని బాల్స్‌ను సులభంగా ఆడేస్తున్నారు. ఈ నేపథ్యంలో వరుణ్ ప్లేస్‌లో ఈ టోర్నీలో కేవలం
ఒక మ్యాచ్ మాత్రమే ఆడిన కుల్దీప్ యాదవ్‌ను ఫైనల్లో ఆడిస్తే మెరుగైన ఫలితం ఉండొచ్చు. ప్రస్తుతం వరుణ్ ఆత్మవిశ్వాసం కూడా పూర్తిగా సన్నగిల్లింది. మరి, మేనేజ్‌మెంట్ ఏ నిర్ణయం తీసుకుంటుందో చూడాలి.
తుది జట్లు (అంచనా):
ఇండియా: అభిషేక్, శాంసన్ (కీపర్), ఇషాన్ కిషన్, తిలక్ వర్మ, సూర్యకుమార్ (కెప్టెన్), హార్దిక్ పాండ్యా, శివమ్ దూబే, అక్షర్, అర్ష్‌దీప్, బుమ్రా, కుల్దీప్ యాదవ్/వరుణ్ చక్రవర్తి.
న్యూజిలాండ్: టిమ్ సిఫర్ట్, ఫిన్ అలెన్, రచిన్ రవీంద్ర, గ్లెన్ ఫిలిప్స్, మార్క్ చాప్‌మన్, డారిల్ మిచెల్, శాంట్నర్ (కెప్టెన్), కోల్ మెకాంచీ, మ్యాట్ హెన్రీ, ఫెర్గూసన్, జేమ్స్ నీషమ్.
బ్యాటింగ్ పిచ్..
ఫైనల్ కోసం ఎర్ర, నలుపు మట్టి మిశ్రమంతో కూడిన మిడిల్ పిచ్‌ను సిద్ధం చేశారు. ఇది బ్యాటింగ్‌కు అనుకూలించనుంది. 2024 నుంచి ఈ వికెట్‌పై జరిగిన 8 మ్యాచ్‌ల్లో ఐదుసార్లు ఛేజింగ్ చేసిన జట్లే నెగ్గాయి. రాత్రి వేళ మంచు కురిసే అవకాశం ఉండటంతో బాల్‌పై బౌలర్లకు పట్టు తప్పే ప్రమాదం ఉంది.
కాబట్టి టాస్ గెలిచిన జట్టు ఫీల్డింగ్ ఎంచుకుని టార్గెట్ ఛేజ్ చేయడానికి మొగ్గు చూపొచ్చు. కానీ, ఇదే గ్రౌండ్‌లో సఫారీలపై 188 రన్స్ టార్గెట్‌ను అందుకోలేక బోల్తా పడినందున టాస్ గెలిస్తే ఇండియా ఆచితూచి నిర్ణయం తీసుకోనుంది. ఆదివారం వర్ష సూచన లేదు. మ్యాచ్‌కు రిజర్వ్ డే (సోమవారం) ఉంది.
నిరీక్షణ ఫలించేనా..!
ఐసీసీ టోర్నీల్లో సైలెంట్‌గా వచ్చి సంచలనాలు సృష్టించడం న్యూజిలాండ్ స్టయిల్. ఈ టోర్నీలో అసలు నాకౌట్‌కు వస్తుందో లేదో అనుకున్న బ్లాక్‌క్యాప్స్ టీమ్ సెమీస్‌లో అత్యంత బలమైన సౌతాఫ్రికాను చిత్తు చిత్తుగా ఓడించి ఒక్కసారిగా టైటిల్ ఫేవరెట్‌గా మారింది. ఎంతో మంది స్టార్లు, సూపర్ స్టార్లను ప్రపంచానికి అందించిన న్యూజిలాండ్ ఇప్పటివరకూ ఒక్క వరల్డ్ కప్ నెగ్గలేదు. శాంట్నర్ కెప్టెన్సీలో ఈసారైనా తమ రాత మార్చుకోవాలని చూస్తోంది.
డారిల్ మిచెల్, రచిన్ రవీంద్ర, గ్లెన్ ఫిలిప్స్, శాంట్నర్ వంటి ఆటగాళ్లు ఒంటిచేత్తో మ్యాచ్‌ను గెలిపించగలరు. తమదైన రోజు ఫిన్ అలెన్, లోకీ ఫెర్గూసన్, మ్యాట్ హెన్రీ లాంటి ఆటగాళ్లు ఏ క్షణంలోనైనా మ్యాచ్‌ను తమ వైపు తిప్పుకోగలరు. బుమ్రా బౌలింగ్‌లో మంచి స్ట్రయిక్ రేట్ ఉన్న డారిల్ మిచెల్, ఇండియా బౌలర్లకు సవాల్ విసిరే అవకాశం ఉంది. బ్యాట్‌తో పాటు స్పిన్‌తోనూ మెప్పిస్తున్న రచిన్ రవీంద్ర రూపంలో మరో ప్రమాదం పొంచి ఉంది. మిడిల్ ఓవర్లలో అతని స్పిన్‌ను ఎదుర్కొనే విషయంలో ఇండియా బ్యాటర్లు జాగ్రత్త వహించడం అవసరం.
* 2-1 ఐసీసీ ఫైనల్స్‌లో ఇండియా, న్యూజిలాండ్ మూడుసార్లు తలపడగా.. కివీస్ 2–1తో ముందంజలో ఉంది. 2000 చాంపియన్స్ ట్రోఫీ, 2021 వరల్డ్ టెస్ట్ చాంపియన్‌షిప్ ఫైనల్లో నెగ్గి.. 2025 చాంపియన్స్ ట్రోఫీ ఫైనల్లో ఓడింది.
* 0 న్యూజిలాండ్ ఇప్పటివరకు వన్డే లేదా టీ20 వరల్డ్ కప్ నెగ్గలేదు. 2019 వన్డే, 2021 టీ20 ఫైనల్స్‌లో ఆ జట్టుకు నిరాశే ఎదురైంది.
* 11 ఈ టోర్నీలో రచిన్ రవీంద్ర 11 వికెట్లు తీశాడు. ఒక వరల్డ్ కప్‌లో న్యూజిలాండ్ తరఫున అత్యధిక వికెట్లు తీసిన బౌలర్లలో ట్రెంట్ బౌల్ట్ (13) తర్వాత రచిన్ రెండో ప్లేస్‌లో ఉన్నాడు.
