భారత్-కివీస్ ఫస్ట్ టీ20 : హైలైట్స్

భారత్-కివీస్ ఫస్ట్ టీ20 : హైలైట్స్

న్యూజిలాండ్ చితక్కొట్టింది.. టీమిండియా చిత్తుగా ఓడింది. వాళ్లు ఆల్ రౌండ్ షో చేస్తే.. మనోళ్లు ఆల్ రౌండ్ ఫ్లాప్ షో చూపించారు. వన్డే సిరీస్ గెలుపుతో జోష్ మీదున్న భారత్ కు.. టీ20 సిరీస్  ఫస్ట్ మ్యాచ్ లోనే కివీస్ ప్లేయర్లు షాకిచ్చారు. 80 పరుగుల భారీ తేడాతో నెగ్గి.. సిరీస్ లో 1-0 ఆధిక్యంలోకి దూసుకెళ్లింది న్యూజిలాండ్. వన్డే సిరీస్ ఓటమికి.. రివేంజ్ తీర్చుకుంది న్యూజిలాండ్. వెల్లింగ్టన్ వేదికగా జరిగిన తొలి టీ20 మ్యాచ్ లో.. కివీస్ ప్లేయర్లు ఆల్ రౌండ్ షో చేశారు. 80 రన్స్ తేడాతో.. టీమిండియాపై గ్రాండ్ విక్టరీ కొట్టారు.

220 రన్స్ టార్గెట్ తో బరిలోకి దిగిన భారత్ కు.. మూడో ఓవర్ నుంచే కష్టాలు మొదలయ్యాయి. ఓపెనర్ రోహిత్ శర్మ.. సింగిల్ రన్ కే ఔటయ్యాడు. తర్వాత యంగ్ ప్లేయర్ విజయ్ శంకర్ క్రీజులొకొచ్చాడు. అప్పటికే దూకుడు మీదున్న ధవన్ కు.. శంకర్ తోడయ్యాడు. ఇద్దరూ కాసేపు మెరుపులు మెరిపించారు. సెటిలయ్యారనుకునేలోపే.. ధవన్ ఔటయ్యాడు. కాసేపటికే విజయ్ శంకర్ కూడా పెవిలియన్ చేరాడు. తర్వాత వచ్చిన రిషబ్ పంత్ కూడా సింగిల్ డిజిట్ కే ఔటయ్యి నిరాశపరిచాడు.

మిడిలార్డర్ లో మహేంద్రసింగ్ ధోనీ, కృనాల్ పాండ్య.. కాసేపు స్కోరు బోర్డును పరుగులెత్తించారు. భారీ స్కోరు చేసే క్రమంలో కృనాల్ ఔటయ్యాడు. తర్వాత 2 ఓవర్ల గ్యాప్ లోనే ధోనీ కూడా పెవిలియన్ చేరాడు. 39 రన్స్ చేసి.. టీమ్ లో టాప్ స్కోరర్ గా నిలిచాడు మహి. ధవన్ 29, విజయ్ శంకర్ 27, కృనాల్ పాండ్య 20 పరుగులతో ఫరవాలేదనిపిస్తే… రిషబ్ పంత్, దినేష్ కార్తీక్, హార్దిక్ పాండ్య, భువీ, చాహల్, ఖలీల్.. సింగిల్ డిజిట్ తోనే సరిపెట్టారు. దీంతో.. 139 రన్స్ కే భారత్ ఆలౌటైంది.

అంతకుముందు టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగిన న్యూజిలాండ్ .. 6 వికెట్ల నష్టానికి 219 పరుగుల భారీ స్కోరు చేసింది. ఓపెనర్ టిమ్ సీఫర్ట్.. 84 రన్స్ తో సూపర్బ్ ఇన్నింగ్స్ ఆడాడు. సీఫర్ట్ ఇన్నింగ్సే.. కివీస్  స్కోరు బోర్డును పరుగులెత్తేలా చేసింది. ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ గా నిలిచాడు సీఫర్ట్.

భారత బౌలర్లలో హార్దిక్ పాండ్య 2 వికెట్లు తీయగా.. భువీ, ఖలీల్, కృనాల్, చాహల్ తలో వికెట్ తీశారు. ఓవరాల్ గా  కివీస్ ప్లేయర్లు ఆల్ రౌండ్ షో అదరగొట్టారు. 3 మ్యాచ్ ల టీ-20 సిరీస్ లో.. కివీస్ 1-0 ఆధిక్యంలో ఉంది.