క్రికెట్ ఫ్యాన్స్‎కు హార్ట్ బ్రేకింగ్ న్యూస్: WCL-2025 టోర్నీలో భారత్-పాక్ మ్యాచ్ రద్దు

క్రికెట్ ఫ్యాన్స్‎కు హార్ట్ బ్రేకింగ్ న్యూస్: WCL-2025 టోర్నీలో భారత్-పాక్ మ్యాచ్ రద్దు

బ్రిటన్: దాయాదుల సమరం కోసం ఎదురుచూస్తోన్న క్రికెట్ ప్రియులకు బ్యాడ్ న్యూస్. ఇంగ్లాండ్ వేదికగా జరుగుతోన్న ప్రపంచ ఛాంపియన్‌షిప్ ఆఫ్ లెజెండ్స్ (WCL) 2025 లీగ్‎లో భారత్, పాకిస్తాన్ మధ్య జరగాల్సిన మ్యాచ్ అర్ధాంతరంగా రద్దు అయ్యింది. షెడ్యూల్ ప్రకారం.. 2025, జూలై 20న బర్మింగ్‌హామ్‌లోని ఎడ్జ్‌బాస్టన్‌లో పాక్, ఇండియా  జట్లు తలపడాల్సి ఉంది. ఈ ఉత్కంఠ పోరు కోసం ఎంతో ఆతృతగా ఎదురు చూస్తోన్న అభిమానులకు చివరి నిమిషంలో డబ్ల్యూసీఎల్ ఊహించని షాక్ ఇచ్చింది.

 భారత్, పాకిస్తాన్ మధ్య ఇటీవల చోటు చేసుకున్న ఉద్రిక్తతల కారణంగా ఈ  మ్యా్చ్‎ను రద్దు చేయాలని పలు డిమాండ్లు వచ్చాయని.. వాటిని దృష్టిలో పెట్టుకుని మ్యాచును రద్దు చేస్తున్నట్లు తెలిపింది డబ్ల్యూసీఎల్. ఆటగాళ్లు, అభిమానుల మనోభావాలను గాయపర్చొద్దని ఈ నిర్ణయం తీసుకున్నట్లు స్పష్టం చేసింది. ఈ మేరకు భారత్, పాక్ మ్యాచ్ రద్దుపై డబ్ల్యూసీఎల్ ప్రకటన విడుదల చేసింది. 


‘‘డబ్ల్యూసీఎల్‎లో ఎల్లప్పుడూ క్రికెట్‌ను ఎంతో ఆదరిస్తాం. అభిమానులకు కొన్ని మంచి, సంతోషకరమైన క్షణాలను అందించడమే మా ఏకైక లక్ష్యం. ఈ సంవత్సరం పాకిస్తాన్ హాకీ జట్టు భారతదేశానికి వస్తుందని విన్నాం. అలాగే భారత్ వర్సెస్ పాకిస్తాన్ వాలీబాల్ మ్యాచ్‌తో పాటు రెండు దేశాల మధ్య ఇతర వేర్వేరు క్రీడలు జరిగాయి. వీటిని దృష్టిలో పెట్టుకునే డబ్ల్యూసీఎల్‎లో ఇండియా, పాక్ మ్యాచ్‌ను నిర్వహించాలని అనుకున్నాం. 

కానీ ఇది కొందరు ఆటగాళ్లు, అభిమానుల మనోభావాలను గాయపర్చింది. వాటిని దృష్టిలో పెట్టుకుని పాక్, భారత్ మ్యాచ్‎ను రద్దు చేస్తున్నాం’’ అని డబ్ల్యూసీఎల్ ప్రకటనలో పేర్కొంది. అంతకముందే.. ధావన్‌, హర్భజన్ సింగ్, యూసుఫ్ పఠాన్, ఇర్ఫాన్ పఠాన్ పాకిస్తాన్ ఛాంపియన్స్‌తో జరిగిన మ్యాచ్ ఆడటానికి నిరాకరించారు.

కాగా, 2025, ఏప్రిల్ 22న జమ్మూ  కాశ్మీర్‎లోని పహల్గాంలో ఉగ్రదాడి జరిగిన విషయం తెలిసిందే. పాక్ ప్రేరేపిత ఉగ్రవాదులు జరిపిన మారణహోమంలో 26 మంది చనిపోయారు. ఈ టెర్రర్ ఎటాక్‎తో భారత్ పాక్ మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొనడంతో పాటు ఇరుదేశాల మధ్య సంబంధాలు క్షీణించాయి. పాకిస్థాన్‎కు బుద్ధి చెప్పేందుకు భారత ప్రభుత్వం పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. దాయాది దేశం పాకిస్థాన్‎తో క్రికెట్ కూడా ఆడొద్దని పలువురు డిమాండ్ చేశారు. 

ఈ ఉద్రిక్తతలు కొనసాగుతుండగానే.. అన్ని దేశాల మాజీ క్రికెటర్లు ఆడే వరల్డ్ ఛాంపియన్‌షిప్ ఆఫ్ లెజెండ్స్ లీగులో భారత్, పాకిస్థాన్ మధ్య ఏర్పాటు చేసింది డబ్ల్యూసీఎల్. దీనిపై భారత ఫ్యాన్స్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. భారత్‎పై అనుచిత వ్యాఖ్యలు చేసిన షాహిది అఫ్రిదీ కెప్టె్న్‎గా ఉన్న జట్టుతో భారత టీమ్ మ్యాచు ఆడొద్దని డిమాండ్ చేశారు. ఇండియా టీమ్‎లోని ధావన్, హర్బజన్ సింగ్, ఇర్ఫాన్ పఠాన్, యూసఫ్ పఠాన్ కూడా పాక్‎తో మ్యాచ్ ఆడటానికి నిరాకరించారు. సర్వత్రా విమర్శలు వ్యక్తం కావడంతో భారత్, పాక్ మ్యాచును రద్దు చేసింది డబ్ల్యూసీఎల్.