- రా. 7 నుంచి స్టార్ స్పోర్ట్స్‌లో లైవ్
మాంచెస్టర్: విమెన్స్ టీ20 వరల్డ్ కప్‌లో వరుస విజయాలతో దూసుకుపోతున్న ఇండియా.. మరో కీలక సమరానికి రెడీ అయ్యింది. ఆదివారం జరిగే గ్రూప్–1 మూడో మ్యాచ్‌లో బలమైన సౌతాఫ్రికాతో తలపడనుంది. ఇందులో గెలిచి నాకౌట్ బెర్త్‌కు మరింత చేరువ కావాలని హర్మన్‌సేన లక్ష్యంగా పెట్టుకుంది.
ఓపెనర్లు స్మృతి మంధాన, షెఫాలీ వర్మ, రిచా ఘోష్ మంచి ఫామ్‌లో ఉండటం జట్టుకు ప్లస్ పాయింట్. కెప్టెన్ హర్మన్‌ప్రీత్, జెమీమా రొడ్రిగ్స్ భారీ ఇన్నింగ్స్ ఆడాల్సి ఉంది. బౌలింగ్‌లో దీప్తి శర్మ మరోసారి కీలకం కానుంది. అరుంధతి రెడ్డి, రేణుకా సింగ్ మెరిస్తే ఇండియాకు బౌలింగ్ కష్టాలు తప్పినట్లే.
గాయంతో శ్రేయాంక పాటిల్ టోర్నీకి దూరం కావడం కాస్త మైనస్‌గా మారింది. అయితే రాధా యాదవ్ ఫామ్‌లోకి వస్తే ఇండియాకు ఎలాంటి ఇబ్బంది ఉండదు. మాంచెస్టర్ పిచ్ స్పిన్నర్లకు అనుకూలిస్తుందనే వార్తల నేపథ్యంలో ఇండియా ఫేవరెట్‌గా బరిలోకి దిగుతోంది. ఇప్పటివరకు ఐదుసార్లు సెమీస్ చేరినా ఒక్కసారి కూడా వరల్డ్ కప్ గెలవలేదు.
మరోవైపు సౌతాఫ్రికాను తక్కువగా అంచనా వేస్తే ముప్పు తప్పదు. ఆస్ట్రేలియా చేతిలో ఓడిపోయినప్పటికీ.. పాకిస్తాన్‌పై రెండు వికెట్ల తేడాతో గెలిచి సఫారీలు తిరిగి ఫామ్‌లోకి వచ్చారు. కెప్టెన్ లారా వోల్‌వోర్ట్, మరిజానే కాప్ లాంటి స్టార్ ప్లేయర్లపై ఆ జట్టు ఎక్కువగా ఆధారపడుతోంది.
