- నేడు శ్రీలంకతో ఇండియా అమ్మాయిల నాలుగో టీ20
- మరో విజయంపై హర్మన్‌సేన గురి
- రా. 7 నుంచి స్టార్ స్పోర్ట్స్‌లో లైవ్
హ్యాట్రిక్ విజయాలతో సిరీస్ నెగ్గిన ఇండియా అమ్మాయిలు.. శ్రీలంకను వైట్‌వాష్ చేయాలని చూస్తున్నారు. ఐదు టీ20ల సిరీస్‌లో భాగంగా ఆదివారం జరిగే మ్యాచ్‌లోనూ హర్మన్‌ప్రీత్ కెప్టెన్సీలోని జట్టు గెలుపే లక్ష్యంగా ఫేవరెట్‌గా బరిలోకి దిగుతున్నది.
తిరువనంతపురం: విమెన్స్ వన్డే వరల్డ్ కప్ సొంతం చేసుకున్న జోరును టీ20 ఫార్మాట్‌లో కొనసాగిస్తూ ఇప్పటికే హ్యాట్రిక్ విజయాలతో సిరీస్ నెగ్గిన ఇండియా అమ్మాయిలు.. శ్రీలంకను వైట్‌వాష్ చేయాలని చూస్తున్నారు.
ఐదు టీ20ల సిరీస్‌లో భాగంగా ఆదివారం జరిగే నాలుగో మ్యాచ్‌లోనూ హర్మన్‌ప్రీత్ కెప్టెన్సీలోని జట్టు గెలుపే లక్ష్యంగా ఫేవరెట్‌గా బరిలోకి దిగుతోంది. ఇప్పటివరకు జరిగిన మూడు మ్యాచ్‌ల్లోనూ ఆతిథ్య జట్టే పూర్తి ఆధిపత్యం చెలాయించింది.
ఈ మూడు సందర్భాల్లోనూ టార్గెట్ ఛేజ్ చేసిన ఇండియా అందుకు14.4 ఓవర్లకు మించి తీసుకోలేదు. మరోవైపు లంక జట్టు బ్యాటర్లు మన బౌలింగ్ దాటికి కుప్పకూలుతున్నారు. ఏ మ్యాచ్‌లోనూ 129 రన్స్ కంటే ఎక్కువ టార్గెట్ ఉంచలేకపోయారు. హోమ్‌టీమ్ బౌలర్లు క్రమశిక్షణతో కూడిన బౌలింగ్‌తో ప్రత్యర్థిని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నారు.
సీనియర్ స్పిన్నర్ దీప్తి శర్మ తన మాయాజాలంతో ప్రత్యర్థి బ్యాటర్లను బోల్తా కొట్టిస్తోంది. గత మ్యాచ్‌లో ఏకంగా 4 వికెట్లు తీసిన పేసర్ రేణుక సింగ్ స్వింగ్ బౌలింగ్‌ను ఎదుర్కోవడం లంక బ్యాటర్లకు కష్టంగా మారింది. హర్మన్‌సేన బౌలింగ్ ధాటికి లంక బ్యాటర్లలో ఒక్కరు కూడా 40 రన్స్ దాటలేకపోయారు. మన బౌలర్లు ఇదే జోరు కొనసాగిస్తే జట్టుకు తిరుగుండదు.
ఇక 2026లో జరిగే టీ20 వరల్డ్ కప్‌ను దృష్టిలో ఉంచుకుని ఇండియా టీమ్ మేనేజ్‌మెంట్ తుది జట్టులో మార్పులు చేస్తూ వస్తోంది. పేస్ బౌలింగ్ విభాగంలో అరుంధతి రెడ్డికి తొలి రెండు మ్యాచ్‌ల్లో అవకాశం ఇవ్వగా.. గత పోరులో ఆమె స్థానంలో రేణుక సింగ్‌ను తీసుకున్నారు. ఈ సిరీస్‌లో ఇప్పటివరకు జట్టులోని 15 మంది సభ్యుల్లో 13 మందికి తుది జట్టులో స్థానం దక్కింది.
సిరీస్ సొంతమైన నేపథ్యంలో ఇంకా చాన్స్ రాని యంగ్ బ్యాటర్ కమలిని, సీనియర్ ప్లేయర్ హర్లీన్ డియోల్‌ను ఈ మ్యాచ్‌లో బరిలోకి దింపే చాన్సుంది.
మంధాన మెరవాలి
ఇండియా బౌలర్లకు తోడుగా బ్యాటర్లు కూడా తమ బాధ్యతను సమర్థవంతంగా నిర్వర్తిస్తున్నారు. డాషింగ్ ఓపెనర్ షెఫాలీ వర్మ, మిడిలార్డర్ బ్యాటర్ జెమీమా రోడ్రిగ్స్ చెరో హాఫ్ సెంచరీతో ఈ సిరీస్‌లో సత్తా చాటారు. అయితే స్టార్ ఓపెనర్ స్మృతి మంధాన నుంచి అభిమానులు ఇంకా పెద్ద ఇన్నింగ్స్ ఆశిస్తున్నారు.
ఇటీవల పర్సనల్ లైఫ్‌లో కొంత ఇబ్బందులకు గురైన ఆమె తొలి మూడు మ్యాచ్‌ల్లో కలిపి 40 రన్స్ మాత్రమే చేసింది. క్లాసీ షాట్లకు పెట్టింది పేరైన మంధాన ఈ మ్యాచ్‌లో తన బ్యాట్‌కు పనిచెప్పాలని, భారీ స్కోరు సాధించి మళ్లీ ఫామ్‌లోకి రావాలని జట్టు కోరుకుంటోంది.
లంక బోణీ చేసేనా?
శ్రీలంక జట్టు పరిస్థితి దయనీయంగా ఉంది. ఆ జట్టు కెప్టెన్ చామరి అటపట్టుతో పాటు మిగతా బ్యాటర్లు దారుణంగా ఫెయిలవడం ఆ టీమ్‌ను దెబ్బతీస్తోంది. హసిని పెరీరా, కవిషా దిల్హారి, హర్షిత వంటి ప్రతిభావంతులైన ప్లేయర్లు ఉన్నా.. ఎవ్వరూ మ్యాచ్ గెలిపించే ఇన్నింగ్స్ ఆడలేకపోతున్నారు.
ఇండియా బౌలింగ్ దాడిని ఎదుర్కోవడంలో అంతా ఇబ్బందిపడుతున్నారు. లంక బౌలింగ్ విభాగం కూడా చాలా బలహీనంగా కనిపిస్తోంది. ఇండియా బ్యాటర్ల నైపుణ్యం ముందు లంక బౌలర్లు తేలిపోతున్నారు. కనీసం ఈ మ్యాచ్‌లోనైనా గెలిచి పరువు నిలబెట్టుకోవాలని, సిరీస్‌లో ఒక్క విజయమైనా నమోదు చేయాలని లంక భావిస్తోంది. ఆ టీమ్ యంగ్ బౌలర్లు ఇండియా బ్యాటర్లను కట్టడి చేస్తేనే గెలిచే అవకాశం ఉంటుంది.
