‘హద్దు’ మీరొద్దు .. బార్డర్​లో కాల్పులపై పాక్​కు ఇండియా వార్నింగ్

‘హద్దు’ మీరొద్దు .. బార్డర్​లో కాల్పులపై పాక్​కు ఇండియా వార్నింగ్
  • ఇరుదేశాల మధ్య హాట్​లైన్ సంభాషణ
  • ఢిల్లీలో బిజీబిజీగా ప్రధాని నరేంద్ర మోదీ
  • రక్షణ, విదేశీ, హోంశాఖ మంత్రులతో భేటీలు
  • జాతీయ భద్రతా సలహా బోర్డు ఏర్పాటు
  • చైర్మన్​గా రా మాజీ చీఫ్ అలోక్ జోషి
  • పాక్​ ఫ్లైట్లకు మన ఎయిర్​స్పేస్​ క్లోజ్​

న్యూఢిల్లీ: కాల్పుల విరమణ ఒప్పందాన్ని పాకిస్తాన్​ ఉల్లంఘించడం, సరిహద్దు వెంట ఆ దేశ సైన్యం కాల్పులకు తెగబడటంపై భారత్​ ఆగ్రహం వ్యక్తం చేసింది. హద్దు మీరితే సహించేది లేదని, మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుందని స్ట్రాంగ్​ వార్నింగ్​ ఇచ్చింది. పహల్గాం టెర్రర్​ అటాక్​ ఘటన నేపథ్యంలో ఇరు దేశాల మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఇదే అదునుగా పాక్​ ఆర్మీ కవ్వింపు చర్యలకు దిగుతున్నది. ఆరు రోజులుగా  లైన్ ఆఫ్​ కంట్రోల్​(ఎల్​వోసీ) వెంట సైనిక పోస్టులను టార్గెట్ చేసి పాక్ సైనికులు కాల్పులు జరుపుతున్నారు. 

ఇప్పుడు జమ్మూ పర్​గ్వాల్​సెక్టార్​లోని ఇంటర్నేషనల్ బోర్డర్​వెంట కూడా పాకిస్తాన్​ సైన్యం కాల్పులు మొదలుపెట్టింది. వీటిని మన ఆర్మీ ఎప్పటికప్పుడు బలంగా తిప్పికొడుతున్నది. పదే పదే కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించడంపై పాకిస్తాన్​కు భారత్ హెచ్చరిక జారీ చేసింది. సరిహద్దు అంశాలపై రొటీన్​ డిస్కషన్​లో భాగంగా ఇరు దేశాల డైరెక్టర్​ జనరల్స్​ ఆఫ్​ మిలిటరీ ఆపరేషన్స్(డీజీఎంవో)లు మంగళవారం రాత్రి హాట్​లైన్​ ద్వారా మాట్లాడుకున్నారు. పాకిస్తాన్​ సైన్యం తీరును మన డీజీఎంవో తీవ్రంగా తప్పుబట్టారు. సరిహద్దు వెంట కాల్పులకు తెగబడితే ఊరుకునేది లేదని గట్టిగా హెచ్చరించారు.

ఢిల్లీలో మూడు కీలక భేటీలు

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన కేబినెట్ కమిటీ ఆన్ సెక్యూరిటీ (సీసీఎస్) భేటీ అయింది. జమ్మూ కాశ్మీర్​లో నెలకొన్న పరిస్థితులపై కేంద్ర మంత్రులతో మోదీ చర్చించారు. పహల్గాం దాడి నేపథ్యంలో పాకిస్తాన్కు ఎలా బుద్ధి చెప్పాలన్న దానిపై చర్చించినట్లు సమాచారం. రక్షణ శాఖ మంత్రి రాజ్​నాథ్ సింగ్, హోంశాఖ మంత్రి అమిత్ షా, విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి జైశంకర్ ఈ భేటీకి హాజరయ్యారు. లోక్​కళ్యాణ్ మార్గ్​లోని ప్రధాని నివాసంలో సీసీఎస్ సమావేశమైంది. కాగా, ఈ భేటీకి సంబంధించిన అంశాలను ప్రభుత్వం మీడియాకు వెల్లడించలేదు. 

ఇండియా బార్డర్ వెంట నెలకొన్న పరిస్థితుల గురించి కేంద్ర మంత్రులను మోదీ అడిగి తెలుసుకున్నారు. జవాన్ల మోహరింపు, యుద్ధ ట్యాంకులు, ఫైటర్ జెట్ల తరలింపుపై కీలకంగా చర్చించినట్లు సమాచారం. టెర్రర్ అటాక్ తర్వాత వారం రోజుల వ్యవధిలోనే సీసీఎస్ రెండుసార్లు భేటీ కావడం గమనార్హం. తొలి భేటీలోనే సింధూ జలాల ఒప్పందాన్ని రద్దు చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. సీసీఎస్ సమావేశం తర్వాత కేబినెట్ కమిటీ ఆన్ పొలిటికల్ ఎఫైర్స్(సీసీపీఏ) మీటింగ్ జరిగింది. 

దీనికి మోదీ అధ్యక్షత వహించారు. అపోజిషన్ పార్టీల సూచనలు, సలహాలపై చర్చించారు. పహల్గాం టెర్రర్ అటాక్ పై చర్చించేందుకు స్పెషల్ పార్లమెంట్ సెషన్ నిర్వహించాలని ప్రతిపక్షాలు కేంద్రాన్ని కోరుతున్నాయి. దీనిపై కూడా ఈ భేటీలో మాట్లాడుకున్నారు. టెర్రర్ అటాక్​పై సమష్టి తీర్మానం చేయాలని కోరుతూ మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీతో పాటు పలువురు ప్రతిపక్ష నేతలు మోదీకి లేఖలు రాశారు. ఈ అంశంపై కూడా సమావేశంలో చర్చించినట్లు సమాచారం.

ఎన్ఎస్ఏబీ చైర్మన్​గా అలోక్ జోషి

భారత ప్రభుత్వం జాతీయ భద్రతా సలహా బోర్డు (ఎన్ఎస్ఏబీ) ను పునర్వ్యవస్థీకరించి, రీసెర్చ్ అండ్ అనాలిసిస్ వింగ్ (రా) మాజీ చీఫ్ అలోక్ జోషిని చైర్మన్‌‌గా నియమించింది. సైన్యం, పోలీస్, విదేశీ సేవల విభాగాలలో సేవలందించి రిటైర్ అయిన ఉద్యోగులు సభ్యులుగా మొత్తం ఏడుగురితో బోర్డును ఏర్పాటు చేసింది. వీరిలో మాజీ వెస్ట్రన్ ఎయిర్ కమాండర్ ఎయిర్ మార్షల్ పీఎం సిన్హా, మాజీ సదరన్ ఆర్మీ కమాండర్ లెఫ్టినెంట్ జనరల్ ఏకే సింగ్ ఉన్నారు. 

జాతీయ భద్రతా మండలికి దీర్ఘకాల విశ్లేషణ, విధాన సిఫార్సులను ఈ బోర్డు అందిస్తుంది. పహల్గాం ఉగ్రదాడి నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకోవడం ప్రాధాన్యం సంతరించుకుంది. కాగా, ఎన్ఎస్ఏబీ చైర్మన్​గా అలోక్ జో్​షి నియామకం టెర్రరిజం కట్టడి, ఇంటెలిజెన్స్​పై కేంద్రం దూరదృష్టిని సూచిస్తుందని, దేశ భద్రతావ్యవస్థను బలోపేతం చేయడంలో కీలకమైనదని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.